Share News

బోణీ అదిరింది

ABN , Publish Date - Aug 16 , 2026 | 05:56 AM

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ డబుల్‌ ధమాకాతో.. పురుషుల హాకీ వరల్డ్‌క్‌పను భారత జట్టు ఘన విజయంతో ఆరంభించింది. గ్రూప్‌-డిలో శనివారం జరిగిన తమ ఆరంభ మ్యాచ్‌లో భారత్‌ 3-1తో వేల్స్‌ జట్టును...

బోణీ అదిరింది

  • కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ డబుల్‌ ధమాకా

  • 3-1తో వేల్స్‌ను చిత్తు చేసిన భారత్‌

  • పురుషుల హాకీ వరల్డ్‌కప్‌

అమ్‌స్టెల్‌వీన్‌ (నెదర్లాండ్స్‌): కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ డబుల్‌ ధమాకాతో.. పురుషుల హాకీ వరల్డ్‌క్‌పను భారత జట్టు ఘన విజయంతో ఆరంభించింది. గ్రూప్‌-డిలో శనివారం జరిగిన తమ ఆరంభ మ్యాచ్‌లో భారత్‌ 3-1తో వేల్స్‌ జట్టును చిత్తు చేసింది. హర్మన్‌ (11వ, 43వ నిమిషం) రెండు గోల్స్‌ చేయగా.. సంజయ్‌ (8వ నిమిషం) ఓ గోల్‌ సాధించాడు. వేల్స్‌ తరఫున ఏకైక గోల్‌ను సామ్‌ వెల్ష్‌ (56వ) కొట్టాడు. మ్యాచ్‌ మొదలైన రెండో నిమిషంలోనే భారత గోల్‌ పోస్టుపై వేల్స్‌ దాడి చేసింది. కానీ, గోల్‌కీపర్‌ సూరజ్‌ కర్కరే సమర్ధవంతంగా దాన్ని అడ్డుకొన్నాడు. ఆ తర్వాత క్రమంగా ఎదురుదాడిని ఆరంభించిన భారత్‌ పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచింది. 8వ నిమిషంలో లభించిన పెనాల్టీని సంజయ్‌ నేరుగా గోల్‌లోకి పంపి భారత్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. మూడు నిమిషాల తర్వాత లభించిన మరో పెనాల్టీని డ్రాగ్‌ ఫ్లికర్‌ హర్మన్‌ప్రీత్‌ బలంగా గోల్‌లోకి పంపి భారత ఆధిక్యాన్ని డబుల్‌ చేశాడు. రెండో క్వార్టర్స్‌లో ఇరుజట్లూ గోల్స్‌ చేయడంలో విఫలమైనా..మూడో క్వార్టర్స్‌ ఆరంభంలోనే హర్మన్‌ మరో పెనాల్టీని గోల్‌గా మలచడంతో భారత్‌ 3-0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. అయితే, నాలుగు నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా వేల్స్‌ ఆటగాడు సామ్‌ ఫీల్డ్‌గోల్‌ చేసి.. భారత ఆధిక్యాన్ని తగ్గించాడు కానీ, విజయాన్ని మాత్రం అడ్డుకోలేక పోయాడు.

జర్మనీ దూకుడు: గ్రూప్‌-బిలో జరిగిన మరో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జర్మనీ అదిరే విజయాన్ని నమోదు చేసింది. తమ తొలి మ్యాచ్‌లో జర్మనీ 5-1తో మలేసియాను ఓడించింది.

1

ఇప్పటిదాకా జరిగిన మొత్తం 16 వరల్డ్‌కప్‌లలోనూ ఆడిన జట్టుగా భారత్‌ కొత్త రికార్డు నెలకొల్పింది. 1971లో జరిగిన తొలిటోర్నీ నుంచి భారత్‌ పాల్గొంటోంది.

ఇవి కూడా చదవండి..

బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్.. ఉగ్రసంస్థల లింకులతో దర్యాప్తు..

అరుణాచల్‌ప్రదేశ్‌లో వరద బీభత్సం.. నలుగురి మృతి, ఆర్మీ సిబ్బంది గల్లంతు..

Updated Date - Aug 16 , 2026 | 05:56 AM