ఆ క్యాచ్ పట్టి ఉంటే భారత్ ఓడిపోయేదా?
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:05 PM
భారత్‌తో నేడు జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సంజూ ఇచ్చిన క్యాచ్‌ను మిస్ చేయడం ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పక తప్పదు. సంజూ మొదట్లోనే అవుట్ అయ్యి ఉంటే భారత ఇన్నింగ్స్, ఈ మ్యాచ్ ఫలితంగా మరోలా ఉండేది అనడంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు.
ఇంటర్నెట్ డెస్క్: ముంబై వాంఖడే స్టేడియంలో నేడు జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లండ్‌పై డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఘన విజయం సాధించింది. ఇది భారత అభిమానులు ఎన్నడూ మర్చిపోలేని విజయం. ఇంగ్లండ్‌కు ఏకంగా 254 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్ తొలి నుంచే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. ఫలితంగా ఇంగ్లండ్ బ్యాటర్లు రక్షణాత్మక ధోరణిలో ఆడటం, రన్ రేట్ తగ్గడం, వంటి పరిణామాలు భారత్ విజయానికి బాటలు పరిచాయి (Ind Vs Eng T20 Semi Final).
ఈ గెలుపులో సంజూ శాంసన్‌ది (Sanju Samson) కీలక పాత్ర అని చెప్పకతప్పదు. అయితే, సంజూ దూకుడుకు ఈసారి అదృష్టం తోడయ్యిందనే అనాలి. ఇన్నింగ్స్ మొదట్లో సంజూకు లైఫ్ దక్కకపోయి ఉంటే భారత ఇన్నింగ్స్ మరోలా ఉండేది. సంజూ క్యాచ్‌ను జారవిడిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook Catch Drop) భారీ పొరపాటు చేశాడు. సులువైన క్యాచ్‌ను వదిలిపెట్టి ఇంగ్లండ్‌కు ఓటమిని ఖరారు చేశాడు. మ్యాచ్‌కు అదే టర్నింగ్ పాయింట్.
వాస్తవానికి ఇన్నింగ్స్ మొదటి నుంచీ సంజూ దూకుడుగా ఆడాడు. తొలి ఓవర్‌లోనే ఒక ఫోర్, సిక్స్‌ను బాదిన సంజూ రెండో ఓవర్‌లో కాస్త నెమ్మదించాడు. నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాడు. ఆ ఓవర్‌లో అభిషేక్ శర్మ రెండు బౌండరీలు రాబట్టాడు. మూడో ఓవర్‌లో సంజూ మళ్లీ దూకుడును కొనసాగిస్తూ జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి బంతిని ఫోర్‌గా మలిచాడు. రెండో బంతిని కూడా షాట్ ఆడే ప్రయత్నంలో కెప్టెన్ హ్యారీ బ్రూక్ వైపు మిడాన్ దిశగా బంతిని కొట్టాడు. ఇలా అందివచ్చిన సింపుల్ క్యాచ్‌ను బ్రూక్ అనూహ్యంగా జారవిడిచాడు.
సులువైన క్యాచ్‌ను మిస్ చేసినందుకు బ్రూక్ కూడా ఒకింత షాకయ్యాడు. చేసిన తప్పునకు భారీ మూల్యం చెల్లించక తప్పదన్న విషయం స్ఫురించినట్టు ఆశ్చర్యానికి లోనయ్యాడు. అప్పటికే అభిషేక్ శర్మ పెవిలియన్ బాట పట్టడంతో డీలా పడ్డ టీమిండియా అభిమానులు మాత్రం ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆ తరువాత సంజూ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఓ రేంజ్‌లో బౌండరీలు సాధిస్తూ రన్ రేట్‌ను పరుగులు పెట్టించాడు.
సంజూ బ్రూక్‌కు దొరికి పెవిలియన్ బాట పట్టి ఉంటే మాత్రం కథ వెరేలా ఉండేది. సంజూ మొదట్లోనే వెనుదిరిగి ఉంటే భారత బ్యాటర్‌లు డిఫెన్స్‌లో పడి ఉండేవారు. పవర్ ప్లే ముగిసే సరికి భారత్ స్కోరు 50కే పరిమితమై ఉండేది. ఇంగ్లండ్ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో టీమిండియా బ్యాటర్లపై ఒత్తిడి పెంచేది. మిడిల్ ఓవర్స్‌లో భారత్‌పై పూర్తి ఆధిపత్యం కనబరిచేది. చివరకు భారత్ ఏ 180 పరుగులకో పరిమితమై ఉండేది. కానీ మొదటి పది ఓవర్లలో సంజూ ఇచ్చిన శుభారంభం సద్వినియోగం చేసుకున్న భారత్ భారీ స్కోరు చేయగలిగింది.
భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ తొలి నుంచీ డిఫెన్స్‌లో పడిపోయింది. మొదటి పది ఓవర్లలో నిర్ణయాత్మక భాగస్వామ్యాల్ని నెలకొల్ప లేకపోయింది. జేకబ్ బెతెల్ సెంచరీ సాధించినా ఉపయోగం లేకపోయింది. విల్ జాక్స్, శామ్ కరమ్‌తో కలిసి చెప్పుకోదగ్గ భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌ను సరిదిద్దేందుకు చేసిన ప్రయత్నాలు విఫలయత్నాలుగా మారాయి. చివరకు ఇంగ్లండ్ ఓటమిని మూటకట్టుకోవాల్సి వచ్చింది.
ఇవీ చదవండి:
ఫైనల్‌కు టీమిండియా.. సెమీస్‌లో పోరాడి ఓడిన ఇంగ్లండ్..
శ్రీలంక హోటల్‌లో మహిళా సిబ్బందితో పాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన..