Share News

పాక్‌ స్థానంలో బంగ్లా?

ABN , Publish Date - Jan 28 , 2026 | 02:45 AM

భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్‌కప్‌ ప్రతిష్ఠను దిగజార్చడానికి పాకిస్థాన్‌ ఇంకా కుటిల పన్నాగాలు పన్నుతూనే ఉంది. తాజాగా మెగా టోర్నీని పాకిస్థాన్‌ బాయ్‌కాట్‌ చేసే అవకాశాలున్నట్టు వార్తలు...

పాక్‌ స్థానంలో బంగ్లా?

బుద్ధి చెప్పే యోచనలో ఐసీసీ

న్యూఢిల్లీ: భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్‌కప్‌ ప్రతిష్ఠను దిగజార్చడానికి పాకిస్థాన్‌ ఇంకా కుటిల పన్నాగాలు పన్నుతూనే ఉంది. తాజాగా మెగా టోర్నీని పాకిస్థాన్‌ బాయ్‌కాట్‌ చేసే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. టోర్నీ విషయమై మరో నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకొంటామని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ మొహిసిన్‌ నక్వీ చెప్పాడు. అయితే, పాక్‌ తప్పుకొంటే ఆ స్థానంలో బంగ్లాదేశ్‌ను ఆడించాలని ఐసీసీ భావిస్తున్నట్టు సమాచారం. భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత లేదనే సాకుతో తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లా డిమాండ్‌ చేసింది. ఐసీసీ దీన్ని తోసిపుచ్చడంతో బెట్టువీడని బంగ్లా టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించింది. అయితే, బంగ్లాకు మద్దతుగా పాక్‌ కూడా టోర్నీని బాయ్‌కాట్‌ చేయాలనే ఆలోచనలో ఉంది. ఇదే జరిగితే పాక్‌ స్థానంలో బంగ్లాను ఆడించేందుకు ఐసీసీ పావులు కదుపుతున్నట్టు సమాచారం. లంకలోనే ఆడతామనే బంగ్లా డి మాండ్‌ కూడా ఒకరకంగా నెరవేరే అవకాశాలు ఉన్నాయి.


వ్యతిరేకిస్తున్న మాజీలు: పొట్టి కప్‌ నుంచి వైదొలగానే పాక్‌ ఆలోచనను ఆ దేశ మాజీ క్రికెటర్లు వ్యతిరేకిస్తున్నారు. పాక్‌ క్రికెట్‌ను ఫణంగా పెట్టి బంగ్లాకు మద్దతుగా నిలవాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు. ఐసీసీతో సంబంధాలు చెడితే పాక్‌ క్రికెట్‌కే నష్టమని హెచ్చరిస్తున్నారు. ఎంతో ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవాలని మాజీ కెప్టెన్లు ఇంజమాముల్‌ హక్‌, మహ్మద్‌ యూసుఫ్‌ అన్నారు. ‘టోర్నీ నుంచి పాక్‌ తప్పుకోవడం సరికాదు. మన జట్టులో ప్రతిభగల ప్లేయర్లు ఉన్నారు. వారి సత్తా ప్రపంచానికి తెలియాల’ని హక్‌ చెప్పాడు. కాగా, అసలు టోర్నీని బహిష్కరించడానికి తగిన కారణాలు కనిపించడం లేదని మాజీ బ్యాటర్‌ హరూన్‌ రషీద్‌ అన్నాడు.

అక్రిడిటేషన్ల తిరస్కరణ?: బంగ్లాదేశ్‌ టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఆదేశ మీడియాకు కూడా ఐసీసీ అక్రిడిటేషన్లు తిరస్కరించినట్టు తెలుస్తోంది. అయితే ఐసీసీ తీరుపై విమర్శలు వ్యక్తం కావడంతో దిద్దుబాటు చర్యలు తీసుకొంటున్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి:

'అతను నిస్వార్థపరుడు'.. అభిషేక్ శర్మపై మంజ్రేకర్ ప్రశంసలు..

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ అరెస్ట్

Updated Date - Jan 28 , 2026 | 02:45 AM