గోపీచంద్ కుమార్తె, షట్లర్..
ABN , Publish Date - Aug 19 , 2026 | 05:57 AM
ఒకప్పుడు భారత బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో పుల్లెల గోపీచంద్ సంచలనాలు సృష్టిస్తే.. ఇప్పుడు అతని కూతురు గాయత్రి మహిళల డబుల్స్‌లో అద్భుత ప్రదర్శనతో అలరిస్తూ తండ్రి వారసత్వాన్ని...
పుల్లెల గాయత్రికి అర్జున అవార్డు
తెలుగు షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు కూడా
చెస్ తార దివ్యా దేశ్‌ముఖ్ సహా 17 మందికి అర్జున
2025 క్రీడా పురస్కారాలను ప్రకటించిన కేంద్రం
ఖేల్‌రత్నకు ఎవరినీ ఎంపిక చేయని వైనం
నాడు తండ్రి.. నేడు తనయ
ఒకప్పుడు భారత బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో పుల్లెల గోపీచంద్ సంచలనాలు సృష్టిస్తే.. ఇప్పుడు అతని కూతురు గాయత్రి మహిళల డబుల్స్‌లో అద్భుత ప్రదర్శనతో అలరిస్తూ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తోంది. దిగ్గజ షట్లర్‌గా భారత్‌కు గొప్ప విజయాలు అందించిన గోపీచంద్ 1999లో అర్జున అవార్డు దక్కించుకోగా.. తాజాగా గాయత్రి కూడా ఆ పురస్కారానికి ఎంపికై తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. మరోవైపు గాయత్రి తల్లి లక్ష్మి కూడా బ్యాడ్మింటన్ క్రీడాకారిణే. 8 సార్లు జాతీయ చాంపియ న్. రెండు ఒలింపిక్స్‌లో ఆడిన లక్ష్మి కామన్వెల్త్ క్రీడల మెడలిస్టు కూడా. ఇక తండ్రి శిక్షణలో రాటుదేలిన 23 ఏళ్ల గాయత్రి తొలుత సింగిల్స్ మాత్రమే ఆడేది. అయితే, కొవిడ్ అనంతరం గోపీ సూచనమేరకు డబుల్స్‌కు మారింది. కేరళకు చెందిన 23 ఏళ్ల ట్రీసా జాలీ రూపంలో తనకు డబుల్స్‌లో సరైన జోడీ దొరకడంతో గాయత్రి వెనుదిరిగి చూసుకోలేదు. తొలుత 2021లో ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ డబుల్స్ టైటిల్ నెగ్గిన గాయత్రి/ట్రీసా.. అదే ఏడాది వేల్స్ ఇంటర్నేషనల్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచారు. 2022లో సయ్యద్ మోదీ టోర్నీలో రన్నరప్, ఆ వెంటనే ఒడిశా ఓపెన్‌లో విజయంతో కెరీర్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ అందుకున్నారు. 2024, 2025లో సయ్యద్ మోదీ టోర్నీ విజేతగా నిలిచిన వీళ్లు.. ఈ ఏడాది ఫిలిప్పీన్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్ నెగ్గారు. ప్రస్తుతం ఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ మెరుగైన ప్రదర్శనతో పతకం సాధించే దిశగా దూసుకుపోతున్నారు.
(ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి)
అర్జున అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఈ పురస్కారం నా బాధ్యతను మరింత పెంచింది. ఈ పురస్కారంతో లభించిన గుర్తింపు నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనది. - గాయత్రీ గోపీచంద్
ఈ వార్తలనూ చదవండి:
ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు
మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం