Share News

బెల్లింగ్‌హామ్‌ డబుల్‌ క్వార్టర్స్‌కు ఇంగ్లండ్‌

ABN , Publish Date - Jul 07 , 2026 | 05:53 AM

జూడ్‌ బెల్లింగ్‌హామ్‌, హ్యారీ కేన్‌ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను క్వార్టర్స్‌కు చేర్చారు. హోరాహోరీగా జరిగిన రౌండ్‌-16 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 3-2తో ఆతిథ్య మెక్సికోపై గెలిచింది...

బెల్లింగ్‌హామ్‌ డబుల్‌ క్వార్టర్స్‌కు ఇంగ్లండ్‌

నిష్క్రమించిన ఆతిథ్య మెక్సికో

మెక్సికో సిటీ: జూడ్‌ బెల్లింగ్‌హామ్‌, హ్యారీ కేన్‌ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను క్వార్టర్స్‌కు చేర్చారు. హోరాహోరీగా జరిగిన రౌండ్‌-16 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 3-2తో ఆతిథ్య మెక్సికోపై గెలిచింది. సెమీ్‌సలో చోటు కోసం నార్వేతో ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకోనుంది. బెల్లింగ్‌హామ్‌ (36వ, 38వ నిమిషం) రెండు గోల్స్‌ చేయగా.. కెప్టెన్‌ హ్యారీ కేన్‌ (60వ) పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచాడు. మెక్సికో తరఫున జూలియన్‌ క్వినోనెస్‌ (42వ), రౌల్‌ జిమినెజ్‌ (69వ) చెరో గోల్‌ కొట్టారు. ఇంగ్లండ్‌తో పోల్చితే మెక్సికో బలహీనమైన జట్టు అయినా.. సొంత ప్రేక్షకుల మద్దతుతో చెలరేగి పోయింది. ఈ క్రమంలో బంతిపై మెరుగైన ఆధిపత్యంతో ఇంగ్లండ్‌ డిఫెన్స్‌ను కలవరపెట్టింది. అయితే, 98 సెకన్ల తేడాతో బెల్లింగ్‌హామ్‌ డబుల్‌ ధమాకా సృష్టించడంతో ఇంగ్లండ్‌ మ్యాచ్‌పై నియంత్రణ సాధించింది. 36వ నిమిషంలో డైవింగ్‌ హెడర్‌తో గోల్‌ చేసిన బెల్లింగ్‌హామ్‌.. 38వ నిమిషంలో కేన్‌ ఇచ్చిన పాస్‌ను లాఘవంగా గోలోలోకి పంపి ఇంగ్లండ్‌ను 2-0 ఆధిక్యంలో నిలిపాడు. మరో నాలుగు నిమిషాల తర్వాత జూలియన్‌ గోల్‌ చేయడంతో మెక్సికో పోటీలోకి వచ్చింది. ఇక, సెకండాఫ్‌ ఆరంభమైన 10 నిమిషాలకు ఇంగ్లండ్‌ ప్లేయర్‌ క్వాంసా రెడ్‌కార్డ్‌కు గురయ్యాడు. అయితే, 10 మందితోనే కేన్‌ సేన దీటుగా పోరాడింది. 60వ నిమిషంలో పెనాల్టీ ఏరియాలోకి దూసుకెళ్తున్న కేన్‌ను మెక్సికో కీపర్‌ అడ్డుకొని కిందపడేయడంతో.. ఇంగ్లండ్‌కు స్పాట్‌ కిక్‌ లభించింది. దీన్ని కేన్‌ గోల్‌గా మలిచాడు. అయితే, మరో 9 నిమిషాలకు కేన్‌ ఫౌల్‌ చేయడంతో మెక్సికోకు ఈసారి పెనాల్టీ లభించింది. దీన్ని రౌల్‌ గోల్‌లోకి పంపి మెక్సికోను 2-3తో నిలిపాడు. సమం చేసే అవకాశం లభించడంతో మెక్సికో ఉధృతమైన దాడులతో ఒత్తిడి పెంచినా.. ఇంగ్లండ్‌ పటిష్ట డిఫెన్స్‌తో అడ్డుకొంది.

ఇవి కూడా చదవండి:

వైభవ్ అరంగేట్రంలో జాప్యంపై స్పందించిన బీసీసీఐ

ట్రంప్‌ జోక్యంపై యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం తీవ్ర విమర్శలు

Updated Date - Jul 07 , 2026 | 05:53 AM