వారెవ్వా.. రిబకినా
ABN , Publish Date - Sep 14 , 2026 | 03:59 AM
టాప్ ఇద్దరు సీడెడ్‌లు తలపడిన యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ తుదిపోరు అనుకున్నట్టుగానే అభిమానులకు మజా పంచింది. టాప్ సీడ్, 28 ఏళ్ల అరీన సబలెంక (బెలారస్), రెండో సీడ్...
కజకిస్థాన్ స్టార్‌దే యూఎస్ ఓపెన్
ఫైనల్లో సబలెంకకు షాక్
కజకిస్థాన్ స్టార్ ఎలెనా రిబకినా యూఎస్ ఓపెన్ టైటిల్ పట్టేసింది..
టోర్నమెంట్ సెమీఫైనల్లో ప్రవేశించడం ద్వారా వరల్డ్ నెం.1 ర్యాంక్‌ను ఖాయం చేసుకున్న ఎలెనా అదే జోరులో రెండుసార్లు డిఫెండింగ్ చాంపియన్ అరీన సబలెంకకు ఫైనల్లో చెక్ పెట్టింది..తొలిసారి ఇక్కడ విజేతగా నిలిచిన రిబకినా.. ఓవరాల్‌గా మూడో గ్రాండ్‌స్లామ్‌ను ఖాతాలో వేసుకుంది.
న్యూయార్క్: టాప్ ఇద్దరు సీడెడ్‌లు తలపడిన యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ తుదిపోరు అనుకున్నట్టుగానే అభిమానులకు మజా పంచింది. టాప్ సీడ్, 28 ఏళ్ల అరీన సబలెంక (బెలారస్), రెండో సీడ్, 27 ఏళ్ల ఎలెనా రిబకినా (కజకిస్థాన్) తగ్గేదెలే అనేలా ఆడడంతో ఆదివారంనాటి ఫైనల్ పోరు మూడు సెట్లపాటు కొనసాగింది. చివరకు రిబకినా 6-4, 5-7, 6-2తో సబలెంకపై గెలిచి తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్ ముద్దాడింది. గత రెండేళ్లుగా ఈ టైటిల్ అందుకొని ముచ్చటగా మూడోసారి కూడా విజేతగా నిలవాలన్న సబలెంక ఆశలకు గండి కొట్టింది. ఇక సబలెంక నుంచి చేజిక్కించుకున్న వరల్డ్ నెం.1 ర్యాంకు సోమవారం అధికారికంగా రిబకినా పరం కానుంది. ‘టైటిల్ నాదేనన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా’ అని మ్యాచ్ అనంతరం రిబకినా ఉద్వేగంగా స్పందించింది. ‘గత కొన్ని వారాల్లో ఎన్నో విజయాలు లభించాయి’ అని వ్యాఖ్యానించింది. సబలెంకను ఓడించి ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ దక్కించుకున్న ఎలెనా, 2022లో వింబుల్డన్ చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో గెలుపుతో..యూఎస్ ఓపెన్‌లో సబెలంక 19 వరుస మ్యాచ్‌ల విజయాలకు రిబకినా బ్రేక్ వేసింది. 2023 ఫైనల్లో కొకొ గాఫ్ చేతిలో ఓడాక యూఎస్ ఓపెన్‌లో అరీన అపజయమనేదే లేకుండా సాగుతోంది.

ఆగ్రహంతో రాకెట్ విసిరి కొట్టి..
వరుసగా మూడో సంవత్సరమూ టైటిల్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించే చాన్స్ చేజారడంతో సబలెంక తీవ్ర ఆగ్రహానికి లోనైంది. మ్యాచ్ ముగిశాక తన చైర్ వద్దకు వెళ్లి అసహనంతో రాకెట్‌ను నేలకేసి కొట్టింది. అంతేకాదు..తన భావోద్వేగాలను చిత్రీకరిస్తున్న కెమెరామన్‌పైనా కేకలు వేసింది. కాగా..గతంలో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ (2012-14) యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో హ్యాట్రిక్ టైటిల్స్ కొట్టింది.
ఇవి కూడా చదవండి:
పురుషుల జూనియర్ హాకీ ఆసియా కప్: వరుసగా నాలుగోసారి.. విజేతగా భారత్
ఆసియా కప్ జూనియర్ హాకీ: భారత మహిళల హ్యాట్రిక్ విజయం