చరిత్ర సృష్టించిన ధీరజ్
ABN , Publish Date - Sep 14 , 2026 | 04:07 AM
భారత టాప్ ర్యాంక్ రికర్వ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అంతర్జాతీయ వేదికపై భారత పతాకను రెపరెపలాడించాడు...
ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్లో తెలుగు కుర్రాడికి స్వర్ణం
సాల్‌టిల్లో (మెక్సికో): భారత టాప్ ర్యాంక్ రికర్వ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అంతర్జాతీయ వేదికపై భారత పతాకను రెపరెపలాడించాడు. ప్రతిష్ఠాత్మక ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్లో ఈ తెలుగు కుర్రాడు స్వర్ణ పతకం కొల్లగొట్టాడు. ఆదివారం ఇక్కడ హోరాహోరీగా జరిగిన పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఫైనల్ షూటౌట్‌లో విజయవాడకు చెందిన 25 ఏళ్ల ధీరజ్ 6-5తో నకనిషి జున్యా (జపాన్)ను ఓడించాడు. తద్వారా ప్రపంచ కప్ ఆర్చరీ ఫైనల్ రికర్వ్ కేటగిరీలో పసిడి పతకం సొంతం చేసుకున్న తొలి భారత పురుష ఆర్చర్‌గా ధీరజ్ చరిత్ర సృష్టించాడు. మెటె గజోజ్ (టర్కీ) కాంస్య పతకం దక్కించుకున్నాడు.. ప్రపంచ టాప్ ఎనిమిది మంది ఆర్చర్లు బరిలో దిగిన పోటీలో క్వార్టర్‌ఫైనల్ నుంచి తుదిపోరు వరకు ధీరజ్ అదరగొట్టాడు. క్వార్టర్‌ఫైనల్లో 7-1తో బెర్కిన్ ట్యూమర్ (టర్కీ)ని చిత్తు చేసిన ధీరజ్ సెమీఫైనల్లో 7-1తో జీన్ చార్లెస్ (ఫ్రాన్స్)పై ఘన విజయం సాధించాడు. నకనిషితో నరాలు తెగే ఉత్కంఠతో జరిగిన ఫైనల్ 5-5తో టై అయ్యింది. దాంతో నిర్వహించిన షూటా్‌ఫలో ఒత్తిడి దరిచేరనీయని ధీరజ్ పసిడి పతకంతో జయకేతనం ఎగుర వేశాడు.
ఇవి కూడా చదవండి:
పురుషుల జూనియర్ హాకీ ఆసియా కప్: వరుసగా నాలుగోసారి.. విజేతగా భారత్
ఆసియా కప్ జూనియర్ హాకీ: భారత మహిళల హ్యాట్రిక్ విజయం