ఆ మెరుపులు ఎక్కడ?
ABN , Publish Date - Jun 19 , 2026 | 05:31 AM
మెస్సీ.. ఎంబప్పే.. ఎర్లిన్ హాలాండ్.. హ్యారీ కేన్ ఇలా స్టార్ ప్లేయర్లు వరల్డ్‌క్‌పలో ఆడిన తొలి మ్యాచ్‌ల్లోనే గోల్స్ వర్షం కురిపించి.. సూపర్ హిట్ అనిపించుకొన్నారు. దీంతో మెస్సీతో సమానంగా..
రొనాల్డో ప్రదర్శనపై నిరాశ
అభిమానుల ఆక్రోశం
హూస్టన్: మెస్సీ.. ఎంబప్పే.. ఎర్లిన్ హాలాండ్.. హ్యారీ కేన్ ఇలా స్టార్ ప్లేయర్లు వరల్డ్‌క్‌పలో ఆడిన తొలి మ్యాచ్‌ల్లోనే గోల్స్ వర్షం కురిపించి.. సూపర్ హిట్ అనిపించుకొన్నారు. దీంతో మెస్సీతో సమానంగా ఆరోసారి మెగా టోర్నీ బరిలోకి దిగిన పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (41) కూడా ఇదే తరహాలో గోల్స్‌తో హోరెత్తిస్తాడని ఫ్యాన్స్ ఎంతగానో ఆశించారు. కానీ, రొనాల్డో ఆ అంచనాలను ఏ మాత్రం అందుకోలేక పోయాడు. దీంతో 52 ఏళ్ల తర్వాత మెగా టోర్నీకి అర్హత సాధించిన పసికూన డీఆర్ కాంగోతో పోర్చుగల్ పేలవంగా డ్రా చేసుకొంది. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన తర్వాత రొనాల్డో ఎంతో నిర్వేదంతో కనిపించగా.. అతడి ఆటను విమర్శకులు తూర్పారబడుతున్నారు. మేటి స్ట్రయికర్‌గా పేరెన్నికగన్న రొనాల్డో.. మ్యాచ్ మొత్తంలో 25 సార్లు మాత్రమే బంతిని టచ్ చేయగా.. ఒక్కసారి కూడా టార్గెట్‌ను షూట్ చేయలేక పోయాడు. ఆరో నిమిషంలోనే తొలి గోల్ చేసిన పోర్చుగల్.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేక పోయింది. మ్యాచ్ ఆసాంతం కాంగో పెనాల్టీ ఏరియాలో రొనాల్డో ఎప్పుడు చొరబడినా.. ప్రత్యర్థి డిఫెండర్లు అతడిని సులువుగా టాకిల్ చేయడం మరింత అసహనాన్ని పెంచింది. ఈ మ్యాచ్‌లో వైఫల్యంతో.. క్రిస్టియానో వరుసగా 10వ మ్యాచ్‌లో గోల్ లెస్‌గా నిలిచాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ‘మేం అనుకొన్న ఆరంభమైతే ఇది కాదు. ఇదేమీ ముగింపు కాదు. తర్వాతి మ్యాచ్‌పై దృష్టిసారిస్తామ’ని రొనాల్డో ఎక్స్‌లో పోస్టు చేశాడు. కాగా, క్రిస్టియానో ఆటతో విసిగి పోయిన ప్రేక్షకులు.. మైదానంలో మెస్సీ.. మెస్సీ అని అరుస్తూ తమ నిరసనను తెలియజేయడం కొసమెరుపు!
పోర్చుగల్‌ను నిలువరించిన పసికూన
హూస్టన్: సుదీర్ఘ విరామం తర్వాత వరల్డ్‌క్‌పకు అర్హత సాధించిన డీఆర్ కాంగో.. తొలి మ్యాచ్‌లోనే ఫేవరెట్ జట్లలో ఒకటైన పోర్చుగల్‌కు ఝలక్ ఇచ్చింది. గ్రూప్-కెలో గురువారం పోర్చుగల్-డీఆర్ కాంగో మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. మ్యాచ్ మొదలైన ఆరో నిమిషంలోనే పోర్చుగల్ ప్లేయర్ పెడ్రో నీటో ఇచ్చిన క్రాస్‌ను మిడ్‌ఫీల్డర్ జావో నివెస్ హెడర్‌తో గోల్‌గా మలిచాడు. కానీ, కాంగో ఆటగాడు యోవానే విస్సా (45+5వ) హెడర్ గోల్‌తో స్కోరు సమం చేశాడు. దీంతో ప్రపంచకప్‌లో తొలిసారి కాంగో పాయింట్ సాధించింది. 1974లో జర్మనీలో జరిగిన వరల్డ్‌కప్‌లో కాంగో జట్టు జైరీ పేరుతో బరిలోకి దిగింది. స్కాట్లాండ్, యుగోస్లేవియా, బ్రెజిల్ చేతిలో ఓటమి పాలైంది.
ఇవీ చదవండి:
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో మార్పు!
జులన్ గోస్వామి రికార్డును సమం చేసిన దీప్తి శర్మ