Share News

ముంబై మురిసింది

ABN , Publish Date - Apr 21 , 2026 | 02:40 AM

ఎట్టకేలకు మాజీ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ విజయం రుచి చూసింది. గత నెల 29న తమ ఆరంభ మ్యాచ్‌లో నెగ్గిన ఈ జట్టు వరుసగా ఐదు ఓటములతో డీలా పడింది. ఇక ప్లేఆఫ్స్‌...

ముంబై మురిసింది

నేటి మ్యాచ్‌

సన్‌రైజర్స్‌ X ఢిల్లీ

వేదిక హైదరాబాద్‌ రా.7.30 నుంచి

ఐదు ఓటముల తర్వాత విజయం

తిలక్‌ వర్మ సూపర్‌ శతకం

99 రన్స్‌ తేడాతో గుజరాత్‌ చిత్తు

అహ్మదాబాద్‌: ఎట్టకేలకు మాజీ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ విజయం రుచి చూసింది. గత నెల 29న తమ ఆరంభ మ్యాచ్‌లో నెగ్గిన ఈ జట్టు వరుసగా ఐదు ఓటములతో డీలా పడింది. ఇక ప్లేఆఫ్స్‌ అవకాశాలు కూడా ప్రమాదంలో పడుతున్న వేళ.. సోమవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జూలు విదిల్చింది. పరుగుల కోసం ఇబ్బందిపడుతున్న తిలక్‌ వర్మ (45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 101 నాటౌట్‌) కళ్లు చెదిరే శతకంతో అదుర్స్‌ అనిపించుకున్నాడు. అటు బౌలర్లు కూడా ముప్పేట దాడికి దిగడంతో టైటాన్స్‌పై 99 పరుగుల తేడాతో ముంబై ఘనవిజయం సాధించింది. ఇక హ్యాట్రిక్‌ విజయాలతో ఊపు మీదున్న గుజరాత్‌ను బ్యాటింగ్‌ వైఫల్యం దెబ్బతీసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసింది. నమన్‌ ధిర్‌ (32 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 45) రాణించాడు. రబాడకు 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదన లో గుజరాత్‌ తిలక్‌ వర్మ ఒక్కడి స్కోరును కూడా సాధించలేకపోయింది. అశ్వని (4/24) ధాటికి 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలింది. సుందర్‌ (26) టాప్‌స్కోరర్‌. శాంట్నర్‌, ఘజన్‌ఫర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా తిలక్‌ నిలిచాడు.

తొలి బంతి నుంచే తడబాటు: భారీ ఛేదనలో గుజరాత్‌కు తొలి బంతికే ఝలక్‌ తగిలింది. ఓపెనర్‌ సుదర్శన్‌ను గోల్డెన్‌ డకౌట్‌ చేసిన పేసర్‌ బుమ్రా ఈ సీజన్‌లో మొదటి వికెట్‌ తీశాడు. ఆ తర్వాత బట్లర్‌ (5), కెప్టెన్‌ గిల్‌ (14) కూడా నిరాశపర్చగా.. శాంట్నర్‌ ఎనిమిదో ఓవర్‌లో సుందర్‌, ఫిలిప్స్‌ (6)లను అవుట్‌ చేశాడు. దీంతో జీటీ 55/5 స్కోరుతో ఓటమి దిశగా పయనించింది. తెవాటియా (8), సుందర్‌ జోడీ కాసేపు క్రీజులో నిలిచి ఆరో వికెట్‌కు 24 పరుగులు జోడించింది. ఆ తర్వాత వరుస ఓవర్లలో పేసర్‌ అశ్వని.. తెవాటియా, రషీద్‌ (4), షారుక్‌ (17)ల పనిబట్టాడు. తిలక్‌ హవా: ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్న తిలక్‌ వర్మ కసిదీరా బ్యాట్‌ ఝుళిపించాడు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి.. ఈ మ్యాచ్‌లోనూ శుభారంభం దక్కలేదు. రబాడ వరుస ఓవర్లలో వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచాడు. డానిష్‌ మలేవర్‌ (2) రెండో ఓవర్‌లోనే వెనుదిరగ్గా..


గత మ్యాచ్‌లో శతకం బాదిన డికాక్‌ (13)ను రిటర్న్‌ క్యాచ్‌తో రబాడ అవుట్‌ చేశాడు. అటు సూర్య (15)ను కూడా రబాడే అవుట్‌ చేయడంతో ముంబై పవర్‌ప్లేలో 46/3 స్కోరుతో ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలో నమన్‌ ధిర్‌కు తిలక్‌ అండగా నిలవడంతో నాలుగో వికెట్‌కు 52 పరుగులు జత చేరాయి. 13వ ఓవర్‌లో నమన్‌ను పేసర్‌ ప్రసిద్ధ్‌ అవుట్‌ చేశాక తిలక్‌ హవా ఆరంభమైంది. 15వ ఓవర్‌లో 6,4,4తో ఎదురుదాడికి తెర లేపాడు. అటు హార్దిక్‌ (15) మాత్రం షాట్లు ఆడలేకపోయాడు. రషీద్‌ ఓవర్‌లో 6,4 బాదిన తిలక్‌ 18వ ఓవర్‌లో పేసర్‌ అశోక్‌కు చుక్కలు చూపించాడు. వరుసగా 6,4,4,6,6తో 26 పరుగులు అందించాడు. అంతేకాకుండా 15 ఇన్నింగ్స్‌ తర్వాత ఫిఫ్టీ పూర్తి చేయగలిగాడు. అటు హార్దిక్‌ను సిరాజ్‌ అవుట్‌ చేయడంతో ఐదో వికెట్‌కు 81 పరుగుల తుఫాన్‌ భాగస్వామ్యం ముగిసింది. ఇందులో తిలక్‌వే 64 పరుగులున్నాయి. ఇక చివరి ఓవర్‌కు ముందు తిలక్‌ 80 రన్స్‌తో ఉండగా అతడి సెంచరీపై ఉత్కంఠ నెలకొంది. కానీ పేసర్‌ ప్రసిద్ధ్‌ వేసిన ఈ ఓవర్‌లో మరోసారి విరుచుకుపడి 4,6,6,4తో చివరి బంతికి ఐపీఎల్‌లో తొలి సెంచరీని నమోదు చేసి సంబరాల్లో మునిగాడు. తానెదుర్కొన్న తొలి 22 బంతుల్లో 19 పరుగులే సాధించిన తిలక్‌ ఆఖరి 23 బంతుల్లో 82 పరుగులు చేయడం విశేషం.

స్కోరుబోర్డు

ముంబై: డికాక్‌ (సి అండ్‌ బి) రబాడ 13, డానిష్‌ (ఎల్బీ) రబాడ 2, నమన్‌ (సి) రబాడ (బి) ప్రసిద్ధ్‌ 45, సూర్యకుమార్‌ (బి) రబాడ 15, తిలక్‌ (నాటౌట్‌) 101, హార్దిక్‌ (సి) ఫిలిప్స్‌ (బి) సిరాజ్‌ 15, రూథర్‌ఫోర్డ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 199/5; వికెట్ల పతనం: 1-10, 2-25, 3-44, 4-96, 5-177; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-25-1, రబాడ 4-0-33-3, అశోక్‌ 3-0-38-0, రషీద్‌ 4-0-31-0, ప్రసిద్ద్‌ 4-0-54-1, సుందర్‌ 1-0-13-0.


గుజరాత్‌: సాయి సుదర్శన్‌ (సి) క్రిష్‌ (బి) బుమ్రా 0, గిల్‌ (సి) నమన్‌ (బి) అశ్వని 14, బట్లర్‌ (ఎల్బీ) హార్దిక్‌ 5, సుందర్‌ (సి) నమన్‌ (బి) శాంట్నర్‌ 26, ఫిలిప్స్‌ (సి అండ్‌ బి) శాంట్నర్‌ 6, తెవాటియా (సి) డికాక్‌ (బి) అశ్వని 8, షారుక్‌ (సి) నమన్‌ (బి) అశ్వని 17, రషీద్‌ (సి సబ్‌) రాజ్‌ బవా (బి) అశ్వని 4, రబాడ (స్టంప్‌) డికాక్‌ (బి) ఘజన్‌ఫర్‌ 12, అశోక్‌ (నాటౌట్‌) 1, సిరాజ్‌ (ఎల్బీ) ఘజన్‌ఫర్‌ 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 15.5 ఓవర్లలో 100 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-0, 2-5, 3-40, 4-54, 5-55, 6-79, 7-85, 8-86, 9-99, 10-100.బౌలింగ్‌: బుమ్రా 3-0-15-1, హార్దిక్‌ 1-0-18-1, క్రిష్‌ భగత్‌ 2-0-10-0, అశ్వని 4-0-24-4, ఘజన్‌ఫర్‌ 2.5-0-17-2, శాంట్నర్‌ 3-0-16-2.

1

ముంబై ఇండియన్స్‌ తరఫున వేగవంతమైన శతకం (45 బంతుల్లో)తో జయసూర్య సరసన నిలిచిన తిలక్‌

Also Read:

ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత

జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం

For More Latest News

Updated Date - Apr 21 , 2026 | 02:40 AM