తమీమ్‌కు బంగ్లా బోర్డు బాధ్యతలు
ABN , Publish Date - Apr 08 , 2026 | 03:20 AM
టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్ సంబంధాలను పునరుద్ధరించాలంటూ బీసీసీఐకి బంగ్లా క్రికెట్ విజ్ఞప్తి చేసుకున్న మరుసటి రోజే ఆ దేశ క్రికెట్‌లో కీలక పరిణామం...
బీసీబీ అడ్‌హాక్ కమిటీ చీఫ్‌గా నియామకం
అమీనుల్ ఇస్లామ్ కార్యవర్గం రద్దు
ఢాకా: టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్ సంబంధాలను పునరుద్ధరించాలంటూ బీసీసీఐకి బంగ్లా క్రికెట్ విజ్ఞప్తి చేసుకున్న మరుసటి రోజే ఆ దేశ క్రికెట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) ప్రస్తుత అధ్యక్షుడు అమీనుల్ ఇస్లామ్ బుల్‌బుల్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. బుల్‌బుల్ సారథ్యంలో గతేడాది ఎన్నికైన మొత్తం బోర్డు కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్టు ఆ దేశ జాతీయ క్రీడా మండలి (ఎన్‌ఎ్‌ససీ) మంగళవారం ప్రకటించింది. రద్దయిన బీసీబీ స్థానంలో బంగ్లా క్రికెట్ రోజువారీ కార్యకలాపాల్ని పర్యవేక్షించేందుకు కొత్తగా 11 మందితో అడ్‌హాక్ కమిటీని ఏర్పాటు చేస్తూ.. ఈ కమిటీకి అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్, దిగ్గజ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్‌ను నియమించింది. 90 రోజుల్లోగా బోర్డుకు కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని, అప్పటిదాకా తమీమ్ బృందం బీసీబీ బాధ్యతలు చూసుకుంటుందని వెల్లడించింది. కొత్త ఎన్నికల నిర్వహణ బాధ్యతలను కూడా ఈ కమిటీనే చూసుకోనుంది. ఇదే విషయాన్ని ఐసీసీకి చేరవేశామని ఎన్‌ఎ్‌ససీ డైరెక్టర్ అమీనుల్ ఎహ్‌సాన్ తెలిపారు. ఈ క్రమంలో బంగ్లా క్రికెట్ చీఫ్‌గా నియమితుడైన అత్యంత పిన్న వయస్కుడిగా 37 ఏళ్ల తమీమ్ నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్
ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్