రైజర్స్ గెలిచినా..
ABN , Publish Date - May 23 , 2026 | 02:52 AM
టాప్-2లో చోటు దక్కించుకోవాలనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలు ఫలించలేదు. మరోవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు...
నేటి మ్యాచ్
లఖ్‌నవూ X పంజాబ్
వేదిక : లఖ్‌నవూ, రా.7.30
ఎలిమినేటర్ బరిలో హైదరాబాద్
టాప్‌లోనే ఆర్‌సీబీ
చెలరేగిన ఇషాన్, అభిషేక్, క్లాసెన్
55 రన్స్‌తో బెంగళూరు చిత్తు
హైదరాబాద్: టాప్-2లో చోటు దక్కించుకోవాలనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలు ఫలించలేదు. మరోవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) 55 పరుగులతో చిత్తుగా ఓడినప్పటికీ.. ఆ జట్టు టేబుల్ టాపర్‌గానే నిలిచింది. దీంతో ఈనెల 26న జరిగే క్వాలిఫయర్-1లో ఆర్‌సీబీ-గుజరాత్ పోటీ ఖాయమైంది. ఇక సన్‌రైజర్స్ కూడా 18 పాయుంట్లతోనే ఉన్నా రన్‌రేట్ పరంగా మూడో స్థానంలో నిలిచింది. తద్వారా సన్‌రైజర్స్ ఈనెల 27న ఎలిమినేటర్ పోరులో తలపడనుంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 79), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56), క్లాసెన్ (24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51), నితీశ్ (12 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 29 నాటౌట్) వేగంగా ఆడారు. రసిఖ్‌కు 2 వికెట్లు దక్కాయి. అయితే ఛేదనలో బెంగళూరు 166 పరుగులు చేస్తే తమ అగ్రస్థానానికి ఢోకా లేని పరిస్థితి ఉండగా.. ఆ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులు చేసింది. దీంతో ఫలితం ఎలా ఉన్నా ఆర్‌సీబీ టాప్ స్థానానికి ముప్పు లేకుండాపోయింది. కెప్టెన్ రజత్ పటీదార్ (39 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 56), వెంకటేశ్ అయ్యర్ (19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 44), క్రునాల్ పాండ్యా (31 బంతుల్లో 5 ఫోర్లతో 41 నాటౌట్) రాణించారు. మలింగకు రెండు వికెట్లు లభించాయి. ఇషాన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
రజత్ అర్ధసెంచరీ: భారీ ఛేదనలో ఆర్‌సీబీ తడబడింది. హిట్టింగ్ కోసం ఓపెనర్‌గా బరిలోకి దిగిన వెంకటేశ్ అయ్యర్‌తో పాటు మధ్య ఓవర్లలో రజత్ పటీదార్, క్రునాల్ పాండ్యా ఆకట్టుకున్నారు. కానీ రైజర్స్ బౌలర్లు ఆరంభం నుంచే మ్యాచ్‌ను అదుపులో ఉంచారు. దీంతో సాధించాల్సిన రన్‌రేట్ భారీగా పెరగడంతో బెంగళూరు చేసేదేమీ లేకపోయింది. తొలి ఓవర్‌లోనే అయ్యర్ 4,6 బాదగా.. నాలుగో ఓవర్‌లో 6,4,6,6తో 23 రన్స్ రాబట్టాడు. కానీ తర్వాతి ఓవర్‌లోనే అతడిని పేసర్ మలింగ అవుట్ చేశాడు. అటు వచ్చీ రాగానే దేవ్‌దత్ పడిక్కళ్ 4,6తో జోరు చూపాడు. ఇక ఆరో ఓవర్‌లో కోహ్లీ(15)ని పేసర్ సకీబ్ దెబ్బతీయగా.. పవర్‌ప్లేలో ఆర్‌సీబీ 75/2తో నిలిచింది. అనంతరం పరుగులు నెమ్మదించగా.. దేవ్‌దత్ (21)ను మలింగ అవుట్ చేశాడు. ఈ దశలో రజత్-క్రునాల్ జోడీ రైజర్స్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంది. గెలుపుపై ఆశలు లేకపోవడంతో వీరు వికెట్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నించారు. అడపాదడపా బౌండరీలతో ముందుకు సాగారు. మరోవైపు 17వ ఓవర్‌లో స్కోరు 166 దగ్గర ఆర్‌సీబీ టాప్-2 బెర్త్ ఖాయమైంది. హాఫ్ సెంచరీ తర్వాత రజత్ 19వ ఓవర్‌లో వెనుదిరిగాడు. నాలుగో వికెట్‌కు క్రునాల్-రజత్ 84 రన్స్ జోడించారు. 6 బంతుల్లో 71 రన్స్ కావాల్సిన వేళ.. 15 రన్స్‌కే పరిమితమైన బెంగళూరు 200 స్కోరు చేసి ఓడింది.
అదరగొట్టిన టాపార్డర్: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. వారి వ్యూహానికి తగ్గట్టుగానే టాపార్డర్ కదం తొక్కింది. ఇషాన్ కిషన్, ఓపెనర్ అభిషేక్, క్లాసెన్ మెరుపు అర్ధసెంచరీలతో విరుచుకుపడడంతో రైజర్స్ రయ్‌మంటూ దూసుకెళ్లింది. కొత్త బంతితో పేసర్లు భువనేశ్వర్, హాజెల్‌వుడ్ వికెట్లు తీయలేకపోయారు. కానీ డెత్ ఓవర్లలో ఆర్‌సీబీ కాస్త పట్టు సాధించినా, అప్పటికే రైజర్స్ ఖాతాలో 250+ పరుగుల భారీ స్కోరు చేరింది. నాలుగో ఓవర్‌లో 3 ఫోర్లు బాదిన ఓపెనర్ హెడ్ (26) అదే ఓవర్‌లో వెనుదిరిగాడు. పవర్‌ప్లేలో 63/1 పరుగులతో రైజర్స్ ఓ మాదిరిగానే కనిపించింది. కానీ ఆ తర్వాత అభిషేక్ జోరుకు స్కోరులో వేగం పెరిగింది. ఏడో ఓవర్‌లో 2 సిక్సర్లు, ఎనిమిదో ఓవర్‌లో 6,6,4తో 20 బంతుల్లోనే అభిషేక్ ఫిఫ్టీ పూర్తి చేశాడు. అప్పటికే రెండుసార్లు క్యాచ్ అవుట్ నుంచి తప్పించుకున్న అభిషేక్‌ను 9వ ఓవర్లో స్పిన్నర్ సుయాష్ అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు ఇషాన్‌తో కలిసి అందించిన 52 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం ఇషాన్-క్లాసెన్ జోడీ బ్యాట్ ఝుళిపించింది. హాజెల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో క్లాసెన్ 6,6,4,6తో 27 రన్స్ రాబట్టాడు. అటు 31 బంతుల్లో ఆర్‌సీబీపై ఇషాన్ వరుసగా నాలుగో ఫిఫ్టీని పూర్తి చేశాడు. 16వ ఓవర్‌లో 6,4,4తో ఇషాన్ 20 రన్స్ అందించడంతో స్కోరు 200 దాటేసింది. తర్వాతి ఓవర్‌లోనే స్పిన్నర్ క్రునాల్ లోఆర్మ్ బంతికి క్లాసెన్ దొరికిపోయాడు. దీంతో మూడో వికెట్‌కు 113 పరుగుల భారీ భాగస్వామ్యానికి చెక్ పడింది. కానీ నితీశ్ అదే ఓవర్‌లో తానెదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. అయితే చివరి మూడు ఓవర్లలో 30 పరుగులే రావడంతో స్కోరు 260లోపే ముగిసింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఇషాన్ వెనుదిరగడంతో నాలుగో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
స్కోరుబోర్డు
సన్‌రైజర్స్: అభిషేక్ (సి/సబ్) కాక్స్ (బి) సుయాష్ 56, హెడ్ (బి) రసిఖ్ 26, ఇషాన్ కిషన్ (సి) పడిక్కళ్ (బి) రసిఖ్ 79, క్లాసెన్ (సి) వెంకటేశ్ (బి) క్రునాల్ 51, నితీశ్ (నాటౌట్) 29, ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 255/4; వికెట్ల పతనం: 1-45, 2-97, 3-210, 4-255; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-51-0, హాజెల్‌వుడ్ 4-0-55-0, రసిఖ్ 4-0-52-2, సుయాష్ 3-0-36-1, షెఫర్డ్ 3-0-37-0, క్రునాల్ 2-0-24-1.
బెంగళూరు: వెంకటేష్ (సి) అభిషేక్ (బి) మలింగ 44, కోహ్లీ (సి) స్మరణ్ (బి) సకీబ్ 15, పడిక్కళ్ (సి) అభిషేక్ (బి) మలింగ 21, పటీదార్ (సి) స్మరణ్ (బి) హెడ్ 56, క్రునాల్ (నాటౌట్) 41, డేవిడ్ (నాటౌట్) 15, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 200/4; వికెట్ల పతనం: 1-60, 2-74, 3-94, 4-178; బౌలింగ్: కమిన్స్ 4-0-48-0, మలింగ 4-0-33-2, శివాంగ్ 2-0-32-0, సకీబ్ 4-0-31-1, హర్షల్ 4-0-37-0, నితీశ్ 1-0-10-0, హెడ్ 1-0-7-1.
1
నాలుగు అంతకన్నా తక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి ఒకే సీజన్‌లో ఎక్కువ పరుగులు (606) సాధించిన బ్యాటర్‌గా క్లాసెన్.
1
ఐపీఎల్‌లో ఎక్కువసార్లు (6) 250+ స్కోర్లు సాధించిన జట్టుగా సన్‌రైజర్స్.

ఇవి కూడా చదవండి:
బిహార్‌కీ ఓ ఐపీఎల్ టీమ్ ఉండాలి: బిలియనీర్ అనిల్ అగర్వాల్
సీఎస్కే వైఫల్యానికి అసలు కారణం ఇదే: సెహ్వాగ్