Share News

కఠిన ప్రాక్టీస్‌ చేసి.. 17 కిలోలు తగ్గి..

ABN , Publish Date - Aug 11 , 2026 | 02:21 AM

‘నేనిప్పుడు జట్టులో సరిపోకపోవచ్చు. కానీ నా శక్తినంతా కూడగట్టి పోరాడతాను’.. భారత టెస్టు జట్టులో పునరాగమనానికి కొన్ని రోజుల ముందు సర్ఫరాజ్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్‌ ఇది. టీమిండియాలో...

కఠిన ప్రాక్టీస్‌ చేసి.. 17  కిలోలు తగ్గి..

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

‘నేనిప్పుడు జట్టులో సరిపోకపోవచ్చు. కానీ నా శక్తినంతా కూడగట్టి పోరాడతాను’.. భారత టెస్టు జట్టులో పునరాగమనానికి కొన్ని రోజుల ముందు సర్ఫరాజ్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్‌ ఇది. టీమిండియాలో చోటు కోసం గత రెండేళ్లుగా తను ఎదురుచూస్తున్నాడు. దేశవాళీల్లో టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తూ సెలెక్టర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇన్నాళ్లకు అతడి కోరిక నెరవేరింది. సాయి సుదర్శన్‌ గాయంతో శ్రీలంక సిరీస్‌కు దూరం కావడం సర్ఫరాజ్‌ పాలిట వరమైంది. సాయి స్థానంలో సర్ఫరాజ్‌కు బెర్త్‌ ఖరారైంది. అయితే స్థూలకాయంతో ఇబ్బందిపడ్డ ఈ ముంబైకర్‌ ఏడాదిన్నర కాలంగా జట్టులో చోటే లక్ష్యంగా 17 కిలోల బరువు తగ్గాడు. అంతేకాకుండా కశ్మీర్‌లోని షేర్‌ ఏ కశ్మీర్‌ మైదానంలో గంటల కొద్దీ చేసిన ప్రాక్టీస్‌ కూడా లాభించింది. ముంబైలో ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో తన భార్య స్వరాష్ట్రమైన కశ్మీర్‌ను ఎంచుకున్నాడు. అందుకే అతడి కృషికి ఫలితంగా సరైన సమయంలోనే ప్రతిఫలం దక్కింది.

నిరుత్సాహపడకుండా..

2024లో సర్ఫరాజ్‌ తొలిసారి టెస్టు జట్టులోకి రాగా అదే ఏడాది చివరి టెస్టు కూడా ఆడాడు. ఇంగ్లండ్‌పై అరంగేట్ర మ్యాచ్‌లో రెండు అర్ధసెంచరీలు, కివీ్‌సపై భారీ శతకంతో ఆకట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత విఫలం కావడంతో వేటు పడింది. వాస్తవానికి కివీ్‌సతో సిరీ్‌సలో ఇతర బ్యాటర్లు కూడా రాణించలేదు. తనొక్కడినే పక్కనబెట్టినా సర్ఫరాజ్‌ నిరుత్సాహపడలేదు. సమయం కోసం ఎదురుచూస్తూనే తన బ్యాట్‌కు పనిచెప్పాడు. కానీ జట్టులో సాయి సుదర్శన్‌ పాతుకుపోవడంతో బెర్త్‌ కష్టమైంది. ఈ సారి సాయి స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు రుతురాజ్‌, షేక్‌ రషీద్‌లను కూడా పరిగణనలోకి తీసుకున్నా సర్ఫరాజ్‌ వైపు మొగ్గు చూపారు. ఎందుకంటే ప్రస్తుత జట్టులో గిల్‌, పంత్‌ తర్వాత స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనేది సర్ఫరాజ్‌ మాత్రమే. ముఖ్యంగా రివర్స్‌ స్వీప్‌లను తను అద్భుతంగా ఆడగలడు. కానీ వామప్‌ మ్యాచ్‌లో సెంచరీతో దేవ్‌దత్‌ పడిక్కళ్‌ తుది జట్టులో చోటు ఖాయం చేసుకున్నట్టే. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్‌కు చాన్స్‌పై సందేహాలు నెలకొన్నాయి. అయితే శ్రీలంక పిచ్‌లను లెక్కలోకి తీసుకుని సర్ఫరాజ్‌కు అవకాశం ఇస్తే మాత్రం చెలరేగాలన్న కసితో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి:

2027 వన్డే ప్రపంచకప్.. జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నా: భువనేశ్వర్ కుమార్

Updated Date - Aug 11 , 2026 | 02:21 AM