సాహో.. సంజూ
ABN , Publish Date - Mar 02 , 2026 | 05:09 AM
టీ20 వరల్డ్‌క్‌పలో భారత జట్టు సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం వెస్టిండీ్‌సతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ఓపెనర్ సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 నాటౌట్) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో...
సెమీఫైనల్ షెడ్యూల్ గమనిక:
మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు
మార్చి 4 (బుధవారం)
దక్షిణాఫ్రిక్ఠా న్యూజిలాండ్ (కోల్‌కతా)
మార్చి 5 (గురువారం)
భారత్ఠ్ ఇంగ్లండ్ (ముంబై)
సెమీఫైనల్స్, ఫైనల్స్‌కు రిజర్వ్‌డే ఉంది
ఇది కదా అభిమానులకు కావాల్సిందనే రీతిలో సంజూ శాంసన్ చెలరేగాడు. ఈ మెగా టోర్నీ ముందు నుంచీ అతడి బెర్త్ విషయంలో ఎన్నో నాటకీయ పరిణామాలు. తుది జట్టులోకి రావడం, పోవడంతో తీవ్ర ఒత్తిడి నెలకొన్నా.. తనలోని అసలైన సత్తాను వెలికితీశాడు. జట్టుకు చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఇదీ నా ఆటతీరంటూ.. విండీ్‌సపై బ్యాట్ ఝుళిపించాడు. ప్రశాంత చిత్తంతో, తడబాటుకు లోనుకాకుండా కళ్లు చెదిరే షాట్లతో అంతా తానై చివరి వరకు క్రీజులో నిలిచాడు. కరీబియన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూనే.. భారత్‌ను ఒంటి చేత్తో సెమీ్‌సకు చేర్చాడు. తద్వారా కోట్లాది మంది భారతీయుల ఉత్కంఠకు ముగింపు పలికాడు.
విండీస్ ఇంటికి
ఇంగ్లండ్‌తో పోరుకు సై
కోల్‌కతా: టీ20 వరల్డ్‌క్‌పలో భారత జట్టు సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం వెస్టిండీ్‌సతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ఓపెనర్ సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 నాటౌట్) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో శతకం ముంగిట నిలిచాడు. ఇక ఈ విజయంతో గ్రూప్ 1లో రెండో స్థానంలో నిలిచిన భారత జట్టు సెమీ్‌సలో ఇంగ్లండ్‌తో తలపడనుంది. గురువారం ఈ మ్యాచ్ జరుగనుంది. అటు విండీస్ ఈ ఓటమితో ఇంటిముఖం పట్టగా.. 2016 సెమీస్‌లో కరీబియన్ల చేతిలో ఎదురైన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ముందుగా విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. చేజ్ (25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 40), హోల్డర్ (22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 నాటౌట్), పోవెల్ (19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 నాటౌట్), హోప్ (33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 32), హెట్‌మయెర్ (12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 27) రాణించారు. బుమ్రాకు 2 వికెట్లు లభించాయి. ఛేదనలో భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసి గెలిచింది. తిలక్ (27) ఫర్వాలేదనిపించాడు. హోల్డర్, జోసె్‌ఫలకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా సంజూ శాంసన్ నిలిచాడు.
సంజూ అంతా తానై: ఛేదనలో ఓపెనర్ శాంసన్ ఆరంభం నుంచి ముగింపు వరకు అంతా తానై కదం తొక్కాడు. మరో ఎండ్‌లో పెద్దగా సహకారం లభించకపోయినా ఎలాంటి తడబాటుకు లోనుకాకుండా జట్టును సెమీస్‌కు చేర్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా నిలకడను ప్రదర్శిస్తూ చెలరేగాడు. ఇక జింబాబ్వేపై హాఫ్ సెంచరీతో ఫామ్ చాటుకున్న అభిషేక్ (10) మళ్లీ నిరాశపరిచాడు. ఇషాన్ (10) ఆట ఆరు బంతులకే పరిమితమైంది. వాస్తవానికి తొలి 10 బంతుల వరకు శాంసన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ మూడో ఓవర్‌లో మాత్రం 4,6,4తో తన ఉద్దేశాన్ని చాటుకున్నాడు. తన జోరుతో పవర్‌ప్లేలో స్కోరు 53/2తో మెరుగ్గా కనిపించింది. సూర్య (18) ఆచితూచి ఆడినా మరోవైపు శాంసన్ మాత్రం ధాటిని కొనసాగించాడు. షెఫర్డ్ ఓవర్‌లో 6,4తో ఆకట్టుకున్నాడు. అటు ఓసారి క్యాచ్ అవుట్ నుంచి తప్పించుకున్న సూర్యను 11వ ఓవర్‌లో జోసెఫ్ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో మూడో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించింది. అయితే 13వ ఓవర్‌లో తిలక్ హ్యాట్రిక్ ఫోర్లతో 17 రన్స్ సమకూరాయి. హెట్‌మయెర్ సూపర్ క్యాచ్‌తో తను పెవిలియన్‌కు చేరినా నాలుగో వికెట్‌కు 26 బంతుల్లోనే 42 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత హార్దిక్ (17), దూబే (8 నాటౌట్) సహకరించారు. మరోవైపు శాంసన్ శతకం పూర్తి చేయకపోయినా 6,4తో మ్యాచ్‌కు అద్భుత ముగింపునిచ్చాడు.
హోల్డర్-పోవెల్ ఎదురుదాడి: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఆరంభం ఓ మాదిరిగా సాగగా, మధ్య ఓవర్లలోనూ పెద్దగా మెరుపులు కనిపించలేదు. కానీ చివరి ఐదు ఓవర్లలో హోల్డర్, పోవెల్ బ్యాట్లకు పనిచెప్పారు. దీంతో విండీస్ స్కోరు 200 దరిదాపుల్లోకి రాగలిగింది. తొలి వికెట్‌కు ఓపెనర్లు హోప్, చేజ్ 68 పరుగులు జోడించినా.. బంతికో పరుగు చొప్పున అన్నట్టుగా వీరి ఆట సాగింది. ముఖ్యంగా షాట్లు ఆడేందుకు ఇబ్బందిపడిన హోప్ 17 డాట్ బాల్స్ ఆడాడు. మరోవైపు చేజ్ మూడో ఓవర్‌లో రనౌట్, ఐదో ఓవర్‌లో క్యాచ్ అవుట్ నుంచి బతికిపోయాడు. పవర్‌ప్లేలో 45 పరుగులతో నిలిచిన విండీస్ తొమ్మిదో ఓవర్‌లో తొలి వికెట్‌ను కోల్పోయింది. హోప్‌ను వరుణ్ బౌల్డ్ చేయడంతో ఈడెన్‌లో హుషారు కనిపించింది. ఆ తర్వాత హెట్‌మయెర్ ఉన్నది కాసేపైనా ధనాధన్ ఆట ఆడాడు. వరుణ్ ఓవర్‌లో 6,4తో 17 రన్స్ రాబట్టాడు. అయితే 12వ ఓవర్‌లో పేసర్ బుమ్రా డబుల్ ఝలక్ ఇచ్చాడు. జోరు మీదున్న హెట్‌మయెర్‌తో పాటు క్రీజులో నిలదొక్కుకున్న చేజ్‌ను సైతం పెవిలియన్‌కు చేర్చాడు.
కాసేపటికే రూథర్‌ఫోర్డ్ (14)ను హార్దిక్ దెబ్బతీయడంతో విండీ్‌సకు 150 కూడా కష్టమేనేమో అనిపించింది. ఈ స్థితిలో ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ అండగా నిలవగా, అతడికి పోవెల్ సహకరించాడు. 16వ ఓవర్‌లో పోవెల్ 6,6,4 బాదగా మొత్తం 24 రన్స్ సమకూరాయి. ఆ తర్వాత హోల్డర్ 6,4తో 14 రన్స్ రాగా, స్కోరు 150 దాటింది. కానీ 19వ ఓవర్‌లో అర్ష్‌దీప్ 6 పరుగులే ఇచ్చి కట్టడి చేశాడు. దీంతో ఆఖరి ఓవర్‌లో 14 రన్స్ వచ్చినా స్కోరు 200 లోపే ముగిసింది. ఐదో వికెట్‌కు హోల్డర్-పోవెల్ జోడీ అజేయంగా 76 రన్స్ జత చేసింది.
స్కోరుబోర్డు
వెస్టిండీస్: హోప్ (బి) వరుణ్ 32, చేజ్ (సి) సూర్య (బి) బుమ్రా 40, హెట్‌మయెర్ (సి) శాంసన్ (బి) బుమ్రా 27, రూథర్‌ఫోర్డ్ (సి) శాంసన్ (బి) హార్దిక్ 14, పోవెల్ (నాటౌట్) 34, హోల్డర్ (నాటౌట్) 37; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 195/4; వికెట్ల పతనం: 1-68, 2-102, 3-103, 4-119; బౌలింగ్: అర్ష్‌దీప్ 4-0-43-0, హార్దిక్ 4-0-40-1, అక్షర్ 4-0-35-0, బుమ్రా 4-0-36-2, వరుణ్ 4-0-40-1.
భారత్: అభిషేక్ (సి) హెట్‌మయెర్ (బి) హొసీన్ 10, శాంసన్ (నాటౌట్) 97, ఇషాన్ (సి) హెట్‌మయెర్ (బి) హోల్డర్ 10, సూర్య (సి) రూఽథర్‌ఫోర్డ్ (బి) జోసెఫ్ 18; తిలక్ (సి) హెట్‌మయెర్ (బి) హోల్డర్ 27, హార్దిక్ (సి) హోల్డర్ (బి) జోసెఫ్ 17, దూబే (నాటౌట్) 8, ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 19.2 ఓవర్లలో 199/5. వికెట్ల పతనం: 1-29, 2-41, 3-99, 4-141, 5-179. బౌలింగ్: హొసీన్ 2-0-22-1, ఫోర్డ్ 3-0-22-0, హోల్డర్ 4-0-38-2, మోటీ 2-0-18-0, షెఫర్డ్ 2.2-0-34-0, జోసెఫ్ 4-0-42-2, చేజ్ 2-0-18-0.
విలువైన ఇన్నింగ్స్..
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
సంజూ శాంసన్..ఈ కేరళ వికెట్‌కీపర్, బ్యాటర్ ఎంతో సత్తా కలిగినోడు. దేశవాళీ క్రికెట్‌తోపాటు ఐపీఎల్‌లో తానేమిటో నిరూపించుకున్నాడు. అయితే 2015లోనే జింబాబ్వేపై టీ20ల ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కానీ ఆదిలో అతడు అంచనాలను అందుకోలేకపోయాడు. దాంతో జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. తానేంటో నిరూపించుకొని టీమిండియాలోకి మళ్లీ వచ్చేందుకు సంజూకు నాలుగున్నర సంవత్సరాలు పట్టింది. అయితే సంజూ కెరీర్‌ను మలుపు తిప్పింది 2024 సంవత్సరం. ఆ ఏడాది బంగ్లాదేశ్‌పై టీ20 సెంచరీ (47 బంతుల్లో 111)తో భళా అనిపించిన సంజూ..బలమైన దక్షిణాఫ్రికా జట్టు పై రెండు టీ20 శతకాలతో ఔరా అనిపించాడు. 2025లో తిరిగి ఆట ఆట గాడి తప్పింది. ఈసారి టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు లభించినా అంతకుముందు న్యూజిలాండ్‌తో పొట్టి సిరీస్‌లో విఫలం కావడంతో ఆరంభ మ్యాచ్‌ల్లో శాంసన్‌ను పక్కనబెట్టారు. అనారోగ్యంతో నమీబియా మ్యాచ్‌కు ఓపెనర్ అభిషేక్ దూరం కావడంతో సంజూకు తుది జట్టులో స్థానం దక్కింది. కానీ ఆ మ్యాచ్‌లో రాణించలేకపోవడంతో తదుపరి మూడు మ్యాచ్‌లకు శాంసన్ మళ్లీ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. శుభారంభాలను భారీ స్కోర్లుగా మలచకపోవడమే సంజూ బలహీనతగా మారింది. దాంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. జింబాబ్వేతో మ్యాచ్‌లోనూ (15 బంతుల్లో 24) అదే సీన్ రిపీట్ కావడంతో అతడికి జట్టులో చోటెందుకనే ప్రశ్న లేవనెత్తిన వారు లేకపోలేదు. కానీ వెస్టిండీ్‌సతో నాకౌట్ పోరులో సంజూ విశ్వరూపం ప్రదర్శించాడు. ఒక విధంగా చెప్పాలంటే ఒంటిచేత్తో టీమిండియాను సెమీఫైనల్‌కు చేర్చాడు. జట్టుకు తన విలువేమిటో ఒక్క ఇన్నింగ్స్‌తో తెలియజెప్పాడు. ఇదే జోరులో టీమిండియా మరోసారి టీ20 ప్రపంచ కప్‌ను సాధించడంలో సంజూ తన పాత్రను సమర్థంగా పోషిస్తాడని ఆశిద్దాం.
ఈ మెగా టోర్నీలో ఎక్కువ సార్లు (6) సెమీ్‌సకు చేరిన జట్టుగా భారత్. పాక్, ఇంగ్లండ్ జట్లతో సమంగా నిలిచింది.
1
టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్ ఛేదనలో భారత్ తరఫున ఎక్కువ రన్స్ చేసిన బ్యాటర్‌గా సంజూ శాంసన్. కోహ్లీ(82)ని దాటాడు.
1
టీ20 వరల్డ్‌క్‌పలో భారత్ తరఫున రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు (97 నాటౌట్) చేసిన శాంసన్. రైనా (101) ముందున్నాడు.
పాయింట్ల పట్టిక
గ్రూప్-1
జట్టు మ్యా గె ఓ ర పా ర.రే
దక్షిణాఫ్రికా 3 3 0 0 6 2.259
భారత్ 3 2 1 0 4 0.106
వెస్టిండీస్ 3 1 2 0 2 0.993
జింబాబ్వే 3 0 3 0 0 -3.415
గ్రూప్-2
జట్టు మ్యా గె ఓ ర పా ర.రే
ఇంగ్లండ్ 3 3 0 0 6 1.096
న్యూజిలాండ్ 3 1 1 1 3 1.390
పాకిస్థాన్ 3 1 1 1 3 -0.123
శ్రీలంక 3 0 3 0 0 -1.950
మ్యా: మ్యాచ్‌లు; గె: గెలుపు; ఓ: ఓటమి;
ర: రద్దు; పా: పాయింట్లు; ర.రే: రన్‌రేట్
ఇవి కూడా చదవండి:
టీ20 డబ్ల్యూసీ: విండీస్‌తో పదేళ్ల నాటి పగ.. తీర్చుకునేందుకు సూర్య సేన రెడీ
టీ20 డబ్ల్యూసీ: పాకిస్థాన్ ఓపెనర్ విధ్వంసం.. కోహ్లీ వరల్డ్ రికార్ట్ బ్రేక్