Share News

అమోఘం అద్వితీయం!

ABN , Publish Date - Jun 01 , 2026 | 03:27 AM

పదిహేడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గత సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తొలిసారి ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడింది. ఇక..ఈసారి డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి...

అమోఘం అద్వితీయం!

పదిహేడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గత సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తొలిసారి ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడింది. ఇక..ఈసారి డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆ జట్టు అంచనాలను నిలబెట్టుకొంటూ లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో ఘన విజయంతో మెప్పించింది. మధ్యలో కొన్ని పరాజయాలు మినహా లీగ్‌ ఆసాంతం అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంది. ప్లేఆఫ్స్‌, ఫైనల్లో అయితే బెంగళూరు ఆట మరో స్థాయికి చేరింది. తుదిపోరును పూర్తి ఏకపక్షం చేస్తూ గుజరాత్‌ టైటాన్స్‌ సొంతగడ్డపై ఆ జట్టును మట్టి కరిపించింది. వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవడం ద్వారా..చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ తర్వాత ఈ ఘనత సాధించిన జట్టుగా రికార్డుకెక్కి అ‘ద్వితీయ’ం అనిపించుకుంది. రాయల్‌ చాలెంజర్స్‌ టైటిల్‌ విజయం ఆ జట్టు సమష్టి ఆటతీరుకు అద్దంపట్టింది. బ్యాటర్లు, బౌలర్లు ఏమాత్రం పట్టుసడలించడకుండా టోర్నమెంట్‌ ఆసాంతం నిలకడైన ప్రదర్శన చేశారు. ఈసారి లీగ్‌లో తొమ్మిదిసార్లు ఆ జట్టు 200కు పైగా పరుగులు చేయడం బెంగళూరు బ్యాటర్లు ఏస్థాయిలో చెలరేగారో తెలియజేస్తుంది. ముఖ్యంగా స్టార్‌ విరాట్‌ కోహ్లీ ఆరు వందలకుపైగా రన్స్‌తో తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. టైటిల్‌ ఫైట్‌లో హాఫ్‌ సెంచరీతో ‘చేజింగ్‌ కింగ్‌’నని మరోసారి చాటాడు. బెంగళూరు బౌలింగ్‌ విభాగం గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా వెటరన్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కెరీర్‌లో తన తొలినాళ్ల బౌలింగ్‌ను గుర్తుకు తెచ్చాడు. ఆస్ట్రేలియా పేసర్‌ హాజెల్‌వుడ్‌ ఆలస్యంగా జట్టులో చేరినా వికెట్ల వేటలో భువనేశ్వర్‌తో పోటీపడ్డాడు. యువ పేసర్‌ రసిఖ్‌దార్‌ ఫ్రాంచైజీ తనపై వెచ్చించిన రూ. ఆరు కోట్లకు పూర్తి న్యాయం చేకూర్చాడు. మరో ఫాస్ట్‌బౌలర్‌ జాకబ్‌ డఫీ మిగిలిన పేసర్లకు అండగా నిలిచాడు. మరోవైపు లీగ్‌ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన గుజరాత్‌ టైటాన్స్‌ టోర్నీ సాగుతున్నకొద్దీ విజృంభించింది. క్వాలిఫయర్‌-1లో బెంగళూరు చేతిలో చిత్తయినా..క్వాలిఫయర్‌-2లో అదిరే ఆటతో ఫైనల్‌కు దూసుకొచ్చింది. దాంతో సొంత మైదానంలో టైటిల్‌ ఫైట్‌లో బెంగళూరును అడ్డుకుంటుందని అంచనా వేశారు. కానీ బెంగళూరు బౌలర్ల ధాటికి గుజరాత్‌ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఫలితంగా రెండోసారి ట్రోఫీ దక్కించుకోవాలన్న ఆ జట్టు ఆశ నెరవేరలేదు.

10-Sports.jpg

ఐపీఎల్‌ ఫైనల్‌కు హాజరైన టీమిండియా సెలెక్షన్‌ కమిటీ చీఫ్‌ అజిత్‌ అగార్కర్‌తో వీవీఎస్‌ లక్ష్మణ్‌, చాముండి

ఇవి కూడా చదవండి:

ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్

ఐపీఎల్ ఫైనల్‌: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 01 , 2026 | 03:27 AM