Share News

బెంగళూరు బాదుడు

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:58 AM

ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లోనే డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అదరగొట్టింది. 202 పరుగుల ఛేదనను మరో 26 బంతులుండగానే ముగించి వహ్వా అనిపించింది...

బెంగళూరు బాదుడు

నేటి మ్యాచ్‌

ముంబై X కోల్‌కతా

రా.7.30 నుంచి వేదిక ముంబై

చెలరేగిన కోహ్లీ, దేవ్‌దత్‌

ఆరంభ పోరులో సన్‌రైజర్స్‌ ఓటమి

బెంగళూరు: ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లోనే డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అదరగొట్టింది. 202 పరుగుల ఛేదనను మరో 26 బంతులుండగానే ముగించి వహ్వా అనిపించింది. ఏడాది తర్వాత టీ20 మ్యాచ్‌ ఆడినా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 నాటౌట్‌) ఆటలో ఏమాత్రం జోరు తగ్గలేదు. గత సీజన్‌ ఫామ్‌ను కొనసాగిస్తూనే అజేయంగా నిలిచాడు. అటు ఇషాన్‌ కిషన్‌ నేతృత్వంలో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేలవ బౌలింగ్‌తో నిరాశపర్చింది. దీంతో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో అలవోకగా గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఇషాన్‌ (38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 80), అనికేత్‌ (18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43), క్లాసెన్‌ (22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 31) రాణించారు. ఐపీఎల్‌ అరంగేట్ర పేసర్‌ డఫీ, షెఫర్డ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో బెంగళూరు 15.4 ఓవర్లలోనే 4 వికెట్లకు 203 పరుగులు చేసి గెలిచింది. దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (26 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 61), కెప్టెన్‌ రజత్‌ పటీదార్‌ (12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 31) వేగంగా ఆడారు. పైన్‌కు రెండు వికెట్లు లభించాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా డఫీ నిలిచాడు.


విరాట్‌ అండగా..: భారీ ఛేదనలో బెంగళూరు ఎక్కడా తడబడలేదు. పిచ్‌ ఫ్లాట్‌గా మారడంతో ఆరంభం నుంచే పరుగుల వరద పారించింది. రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ సాల్ట్‌ (8) వెనుదిరిగినా.. దేవ్‌దత్‌, విరాట్‌ జోడీ చెలరేగింది. ముఖ్యంగా దేవ్‌దత్‌ ఎడాపెడా భారీ షాట్లతో అదరగొట్టాడు. నాలుగో ఓవర్‌లో అతను 18 రన్స్‌ రాబట్టడంతో స్కోరు 50కి చేరింది. అటు విరాట్‌ బౌండరీల సహాయంతో పవర్‌ప్లేలో ఆర్‌సీబీ 76/1 స్కోరుతో పటిష్టంగా నిలిచింది. విరాట్‌ క్యాచ్‌ను క్లాసెన్‌ వదిలేయడం కలిసొచ్చింది. 21 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసిన దేవ్‌దత్‌ తొమ్మిదో ఓవర్‌లో 4,6తో మరింత జోరు చూపినా హర్ష్‌ దూబేకి చిక్కాడు. దీంతో రెండో వికెట్‌కు 45 బంతుల్లోనే 101 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రజత్‌ పటీదార్‌ సైతం క్రీజులో ఉన్నంతసేపు ధాటిని కనబర్చగా.. విరాట్‌ కళ్లు చెదిరే సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. 12వ ఓవర్‌లో పటీదార్‌ 4,6,6తో 22 రన్స్‌ రాబట్టాడు. తర్వాతి ఓవర్‌లోనే రజత్‌ పటీదార్‌, జితేశ్‌ (0)లను డేవిడ్‌ పైన్‌ వరుస బంతుల్లో అవుట్‌ చేసి రైజర్స్‌కు కాస్త ఊరటనిచ్చాడు. ఈ దశలో విరాట్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసిన కోహ్లీ.. విజయానికి కావాల్సిన 17 పరుగులను వరుసగా 6,4,4,4 బాది 16వ ఓవర్‌లోనే మ్యాచ్‌ను ముగించాడు.

00-Sports.jpg

ఆదుకున్న ఇషాన్‌.. అనికేత్‌: సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ మెరుపు ఆరంభం.. అనికేత్‌ వర్మ సూపర్‌ ఫినిషింగ్‌ కీలకంగా నిలిచాయి. మధ్యలో క్లాసెన్‌ కాస్త నిలకడ చూపాడు. ఈ ముగ్గురే రెండంకెల స్కోర్లు సాధించినా.. రైజర్స్‌ 200+ స్కోరుతో సవాల్‌ విసిరింది. విధ్వంసకర ఓపెనర్లు హెడ్‌ (11), అభిషేక్‌ (7)లను పేసర్‌ డఫీ మూడో ఓవర్‌లోనే పెవిలియన్‌ చేర్చాడు. అనంతరం నితీశ్‌ (1) కూడా డఫీకే చిక్కడంతో 29/3 స్కోరుతో జట్టు కష్టాల్లో పడింది. అయితే ఆరో ఓవర్‌లో ఇషాన్‌ 6,4,6తో 16 రన్స్‌ రాబట్టి పవర్‌ప్లేను 49 పరుగులతో ముగించాడు. ఈ దశలో అతనికి క్లాసెన్‌ సహకరించాడు. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని ఇద్దరూ పరుగులు రాబట్టారు. 12వ ఓవర్‌లో 3 ఫోర్లు బాదిన ఇషాన్‌ 27 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. క్రునాల్‌ ఓవర్‌లోనూ ఇషాన్‌ రెండు, క్లాసెన్‌ ఒక సిక్సర్‌తో 21 రన్స్‌ అందించారు. అయితే క్లాసెన్‌ క్యాచ్‌ను బౌండరీ లైన్‌ దగ్గర సాల్ట్‌ అద్భుతంగా పట్టేయడంతో నాలుగో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే ఇషాన్‌ క్యాచ్‌ను సైతం సాల్ట్‌ ఒంటి చేత్తో డైవింగ్‌ చేస్తూ పట్టేశాడు. ఇక చివర్లో అనికేత్‌ ఎడాపెడా షాట్లతో జట్టు స్కోరు తగ్గకుండా చూశాడు. 19వ ఓవర్‌లో 6,4,6 బాదిన అనికేత్‌.. కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. చివరి ఓవర్‌లో 9 పరుగులతో రైజర్స్‌ స్కోరు 200 దాటింది.


స్కోరుబోర్డు

సన్‌రైజర్స్‌: హెడ్‌ (సి) సాల్ట్‌ (బి) డఫీ 11, అభిషేక్‌ (సి) జితేశ్‌ (బి) డఫీ 7, ఇషాన్‌ (సి) సాల్ట్‌ (బి) అభినందన్‌ 80, నితీశ్‌ (సి) అభినందన్‌ (బి) డఫీ 1, క్లాసెన్‌ (సి) సాల్ట్‌ (బి) షెఫర్డ్‌ 31, సలీల్‌ (సి) దేవ్‌దత్‌ (బి) సుయాష్‌ 9, అనికేత్‌ (సి) విరాట్‌ (బి) ఫెఫర్డ్‌ 43, హర్ష్‌ దూబే (సి) దేవ్‌దత్‌ (బి) షెఫర్డ్‌ 3, హర్షల్‌ (సి) దేవ్‌దత్‌ (బి) భువనేశ్వర్‌ 0, పైన్‌ (నాటౌట్‌) 6, ఉనాద్కట్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 201/9. వికెట్ల పతనం: 1-18, 2-23, 3-29, 4-126, 5-137, 6-155, 7-167, 8-174, 9-192. బౌలింగ్‌: డఫీ 4-0-22-3, భువనేశ్వర్‌ 4-0-31-1, అభినందన్‌ 3-0-38-1, షెఫర్డ్‌ 4-0-54-3, సుయాష్‌ 3-0-28-1, క్రునాల్‌ 2-0-26-0.

బెంగళూరు: సాల్ట్‌ (సి) క్లాసెన్‌ (బి) ఉనాద్కట్‌ 8, విరాట్‌ (నాటౌట్‌) 69, దేవ్‌దత్‌ (సి) క్లాసెన్‌ (బి) హర్ష్‌ 61, రజత్‌ (సి) హర్ష్‌ (బి) పైన్‌ 31, జితేశ్‌ (సి) ఉనాద్కట్‌ (బి) పైన్‌ 0, టిమ్‌ డేవిడ్‌ (నాటౌట్‌) 16, ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 15.4 ఓవర్లలో 203/4. వికెట్ల పతనం: 1-9, 2-110, 3-163, 4-163. బౌలింగ్‌: నితీశ్‌ 2-0-19-0, ఉనాద్కట్‌ 3-0-29-1, పైన్‌ 3-0-35-2, హర్ష్‌ 3-0-35-1, మలింగ 2-0-35-0, హర్షల్‌ 2.4-0-39-0.

1

ఛేదనలో 4 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఐపీఎల్‌ బ్యాటర్‌గా విరాట్‌ కోహ్లీ.

సన్‌రైజర్స్‌పై 190+ పరుగులను ఛేదించడం ఆర్‌సీబీకిదే తొలిసారి.

ఇవీ చదవండి:

పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!

గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

Updated Date - Mar 29 , 2026 | 12:58 AM