Share News

పంజాబ్‌ జైత్రయాత్ర

ABN , Publish Date - Apr 20 , 2026 | 01:41 AM

ఈ ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ అంచనాలకు మించి రాణిస్తోంది. వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ ఓటమనేదే లేకుండా పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య...

పంజాబ్‌ జైత్రయాత్ర

నేటి మ్యాచ్‌

గుజరాత్‌ X ముంబై

(రా.7.30) వేదిక అహ్మదాబాద్‌

  • చెలరేగిన ప్రియాన్ష్‌, కూపర్‌

  • 54 రన్స్‌తో లఖ్‌నవూ చిత్తు

మల్లన్‌పూర్‌: ఈ ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ అంచనాలకు మించి రాణిస్తోంది. వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ ఓటమనేదే లేకుండా పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య (37 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 93), కూపర్‌ కనోలి (46 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆపై బౌలర్లు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ను కట్టుదిట్టం చేయడంతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో పంజాబ్‌ భారీ విజయాన్నందుకుంది. ప్రస్తుతం పంజాబ్‌ 11 పాయింట్లతో టాప్‌లో ఉంది. ముందుగా పంజాబ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో ఈ జట్టుకిది రెండో అత్యధిక స్కోరు. ప్రిన్స్‌, సిద్ధార్థ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో లఖ్‌నవూ 20 ఓవర్లలో 200/5 స్కోరుకే పరిమితమై ఓడింది. సారథి రిషభ్‌ పంత్‌ (23 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లతో 43), మార్‌క్రమ్‌ (22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), మార్ష్‌ (28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), ఆయుష్‌ బదోని (21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) రాణించారు. యాన్సెన్‌ 2 వికెట్లు తీశాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ప్రియాన్ష్‌ నిలిచాడు.

పోరాటం లేకుండా..: కష్టసాధ్యమైన ఛేదనలో లఖ్‌నవూ ఆటతీరు ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేదు. వికెట్లను వేగంగా కోల్పోకపోయినా.. సాధించాల్సిన రన్‌రేట్‌ను అందుకోలేకపోయింది. చివర్లో మార్‌క్రమ్‌ జోరు సరిపోలేదు. వాస్తవానికి పంజాబ్‌ ఫీల్డర్లు సులువైన క్యాచ్‌లు వదిలేశారు. లేకుంటే ఓటమి తేడా మరింత భారీగానే ఉండేది. ఓపెనర్లు మార్ష్‌, బదోని పవర్‌ప్లేలో 61 పరుగులే రాబట్టారు. బదోనిని వైశాక్‌ అవుట్‌ చేయగా.. పంత్‌తో కలిసి మార్ష్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ వీరి ఆటలోనూ వేగం కనిపించలేదు. చాహల్‌ ఓవర్‌లో మార్ష్‌ వెనుదిరగడంతో రెండో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ వెంటనే పంత్‌ను అర్ష్‌దీప్‌ అవుట్‌ చేయడంతో లఖ్‌నవూ కోలుకోలేకపోయింది. పూరన్‌ (9) ఎప్పటిలాగే విఫలం కాగా.. చివర్లో మార్‌క్రమ్‌, ముకుల్‌ (17 బంతుల్లో ఓ ఫోర్‌, ఓ సిక్స్‌తో 21 నాటౌట్‌) జోరు ఓటమి అంతరాన్ని తగ్గించింది. వీరి మధ్య ఐదో వికెట్‌కు 60 రన్స్‌ జత చేరాయి.


ప్రియాన్ష్‌-కూపర్‌ మోత: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ (0) వికెట్‌ను కోల్పోయింది. కానీ మరో వికెట్‌ను తీసేందుకు లఖ్‌నవూ బౌలర్లు ఏకంగా 13 ఓవర్లపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య, కూపర్‌ జోడీ అసాధారణ బ్యాటింగ్‌తో లఖ్‌నవూ బౌలర్లను వేటాడింది. కొడితే ఫోర్‌ లేదా సిక్స్‌ అన్నట్టుగా పరుగుల వర్షం కురిపించింది. వీళ్ల విధ్వంసానికి స్కోరుబోర్డు రాకెట్‌ను మించిన వేగంతో సాగింది. ఆరో ఓవర్‌లో ప్రియాన్ష్‌ 4,6,6తో 20 రన్స్‌ రాబట్టడంతో పవర్‌ప్లేలో పంజాబ్‌ 63/1 స్కోరుతో నిలిచింది. ఆ తర్వాత 19 బంతుల్లోనే ప్రియాన్ష్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. మరో ఎండ్‌లో కూపర్‌, షమి ఓవర్‌లో 6,6,4 బాది అర్ధసెంచరీని పూర్తి చేశాడు. ఇక 13వ ఓవర్‌లో కూపర్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లు, ప్రియాన్ష్‌ రెండు సిక్సర్లు బాదడంతో ఏకంగా 32 రన్స్‌ సమకూరాయి. అప్పటికే జట్టు స్కోరు 179/1కి చేరగా, ఇద్దరూ శతకాలకు సమీపంలో ఉన్నారు. కానీ కూపర్‌ను ప్రిన్స్‌ అవుట్‌ చేయడంతో రెండో వికెట్‌కు 80 బంతుల్లో 182 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత వరుస ఓవర్లలో ప్రియాన్ష్‌, కెప్టెన్‌ శ్రేయాస్‌ (5), నేహల్‌ (13)ల వికెట్లు కోల్పోవడంతో పరుగులు నెమ్మదించాయి. కానీ ఆఖరి మూడు ఓవర్లలో స్టొయినిస్‌ (16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29), శశాంక్‌ సింగ్‌ (6 బంతుల్లో ఓ ఫోర్‌, 2 సిక్స్‌లతో 17) భారీ షాట్లతో జట్టు స్కోరును 250 దాటించారు.

స్కోరుబోర్డు

పంజాబ్‌: ప్రియాన్ష్‌ (బి) మార్ష్‌ (బి) సిద్దార్థ్‌ 93, ప్రభ్‌సిమ్రన్‌ (సి) మార్ష్‌ (బి) షమి 0, కూపర్‌ (సి) సిద్దార్థ్‌ (బి) ప్రిన్స్‌ 87, శ్రేయాస్‌ (సి) షమి (బి) మొహిసిన్‌ 5, స్టొయినిస్‌ (రనౌట్‌) 29, నేహల్‌ వధేరా (సి) పూరన్‌ (బి) సిద్దార్థ్‌ 13, శశాంక్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) ప్రిన్స్‌ 17, యాన్సెన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 254/7; వికెట్ల పతనం: 1-3, 2-185, 3-187, 4-193, 5-208, 6-252, 7-254; బౌలింగ్‌: షమి 4-0-56-1, మొహిసిన్‌ 4-0-43-1, ప్రిన్స్‌ 4-0-25-2, బదోని 1-0-14-0, అవేశ్‌ 3-0-46-0, సిద్దార్థ్‌ 3-0-35-2, మార్‌క్రమ్‌ 1-0-32-0.


లఖ్‌నవూ: మార్ష్‌ (సి) బార్ట్‌లెట్‌ (బి) చాహల్‌ 40, బదోని (సి) బార్ట్‌లెట్‌ (బి) వైశాక్‌ 35, పంత్‌ (సి) ప్రభ్‌సిమ్రన్‌ (బి) అర్ష్‌దీప్‌ 43, పూరన్‌ (సి) శ్రేయాస్‌ (బి) యాన్సెన్‌ 9, మార్‌క్రమ్‌ (సి) స్టొయినిస్‌ (బి) యాన్సెన్‌ 42, ముకుల్‌ చౌదరి (నాటౌట్‌) 21, హిమ్మత్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 200/5; వికెట్ల పతనం: 1-61, 2-109, 3-128, 4-139, 5-199; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-41-1, బార్ట్‌లెట్‌ 4-0-54-0, యాన్సెన్‌ 4-0-37-2, వైశాఖ్‌ 4-0-30-1, చాహల్‌ 4-0-36-1.

1

ఐపీఎల్‌ చరిత్రలో తొలి ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓటమి ఎరుగని మొదటి జట్టుగా పంజాబ్‌

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

పంజాబ్‌ 6 5 0 1 11 1.420

బెంగళూరు 6 4 2 0 8 1.171

రాజస్థాన్‌ 6 4 2 0 8 0.599

హైదరాబాద్‌ 6 3 3 0 6 0.566

ఢిల్లీ 5 3 2 0 6 0.310

గుజరాత్‌ 5 3 2 0 6 0.018

చెన్నై 6 2 4 0 4 -0.780

లఖ్‌నవూ 6 2 4 0 4 -1.173

కోల్‌కతా 7 1 5 1 3 -0.879

ముంబై 5 1 4 0 2 -1.076

ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ఎట్టకేలకు.. తొలి విజయాన్ని నమోదు చేసిన కేకేఆర్

Updated Date - Apr 20 , 2026 | 01:41 AM