ఈసారి గెలిచారు
ABN , Publish Date - Feb 11 , 2026 | 05:32 AM
రెండేళ్ల క్రితం టీ20 ప్రపంచ కప్ సూపర్ ఓవర్‌లో తమకు షాకిచ్చిన అమెరికాపై పాకిస్థాన్ ఈ సారి టోర్నీలో బదులు తీర్చుకుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్...
యూఎస్ఏపై పాక్ ప్రతీకారం
ఫర్హాన్ అర్ధసెంచరీ
టీ20 ప్రపంచ కప్
కొలంబో: రెండేళ్ల క్రితం టీ20 ప్రపంచ కప్ సూపర్ ఓవర్‌లో తమకు షాకిచ్చిన అమెరికాపై పాకిస్థాన్ ఈ సారి టోర్నీలో బదులు తీర్చుకుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 32 పరుగుల తేడాతో అమెరికాపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (41 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 73) మెరుపు బ్యాటింగ్‌తో పాక్ గెలుపులో కీలకంగా నిలిచాడు. బాబర్ ఆజమ్ (32 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 46), షాదాబ్ (12 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 30) రాణించారు. అమెరికా పేసర్ షాక్విక్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. ఛేదనలో అమెరికా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులకే పరిమితమై పరాజయం పాలైంది. పవర్‌ప్లేలో ఫర్వాలేదనిపించినా.. ఆ తర్వాత స్పిన్ ధాటికి అమెరికా బ్యాటర్లు తడబడ్డారు. శుభమ్ (30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51), జహంగీర్ (49), మిలింద్ కుమార్ (29) మినహా అంతా విఫలమయ్యారు. స్పిన్నర్లు ఉస్మాన్ తారిఖ్‌కు మూడు, షాదాబ్ ఖాన్‌కు రెండు వికెట్లు లభించాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా సాహిబ్జాదా ఫర్హాన్ నిలిచాడు.
అదిరే ఆరంభం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ఓపెనర్ ఫర్హాన్ అదిరే ఆరంభాన్నందించాడు. ఎడాపెడా బౌండరీలతో యూఎస్ బౌలర్లపై విరుచుకుపడగా, అటు మరో ఓపెన్ సయీమ్ (19) ఉన్న కాసేపు వేగం చూపాడు. దీంతో తొలి వికెట్‌కు 31 బంతుల్లోనే 54 పరుగులు జత చేరాయి. ఆరో ఓవర్‌లో సయీమ్, కెప్టెన్ సల్మాన్ (1)లను పేసర్ షాక్విక్ అవుట్ చేశాడు. అయితే ఫర్హాన్ జోరు కొనసాగిస్తూ 27 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అటు కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్న బాబర్ 12వ ఓవర్‌లో 6,4,4తో ఆకట్టుకున్నాడు. కాగా, మూడో వికెట్‌కు 81 పరుగులు జత చేశాక బాబర్‌ను స్పిన్నర్ మొహిసిన్ అవుట్ చేశాడు. తర్వాతి ఓవర్‌లోనే ఫర్హాన్ వెనుదిరగ్గా.. షాదాబ్ ఎదురుదాడికి దిగి విలువైన పరుగులందించాడు. కానీ, చివరి రెండు ఓవర్లలో 5 వికెట్లు కోల్పోవడంతో పాక్ స్కోరు 200 లోపే ముగిసింది.
సంక్షిప్త స్కోర్లు
పాకిస్థాన్: 20 ఓవర్లలో 190/9. (ఫర్హాన్ 73, బాబర్ 46, షాదాబ్ 30; షాక్విక్ 4/25).
అమెరికా: 20 ఓవర్లలో 158/8. (శుభమ్ 51, జహంగీర్ 49; ఉస్మాన్ తారిఖ్ 3/27, షాదాబ్ 2/26).
Also Read:
టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..
టీ20 ప్రపంచకప్2026 వేళ బీసీసీఐ కీలక నిర్ణయం..!