ఐసీసీ పీఠంపై మళ్లీ జై
ABN , Publish Date - Nov 17 , 2026 | 04:23 AM
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా జై షా మరోసారి నియమితుడయ్యారు. ఈమేరకు ఇక్కడ జరిగిన సమావేశంలో ఐసీసీ బోర్డు..
చైర్మన్‌గా షా ఏకగ్రీవం ఆమోదించిన బోర్డు
బాలీ (ఇండోనేసియా): అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా జై షా మరోసారి నియమితుడయ్యారు. ఈమేరకు ఇక్కడ జరిగిన సమావేశంలో ఐసీసీ బోర్డు.. షా నియామకాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. మరో రెండేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. ‘క్రికెట్‌కు కీలకమైన ఈ తరుణంలో ఆయనను కొనసాగించాలని నిర్ణయించాం’ అని ఐసీసీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టకముందు 38 ఏళ్ల షా..బీసీసీఐ కార్యదర్శిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 2024 డిసెంబరులో ఆయన ఐసీసీ చైర్మన్‌గా మొదటిసారి ఎన్నికయ్యారు. తొలిదఫాలో న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్‌లేనుంచి జై షా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2021 నుంచి 2024 వరకు షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పని చేశారు. ‘జై షా నియామకం ఆయన నాయకత్వంపై ఐసీసీ బోర్డుకున్న నమ్మకాన్ని ప్రతిఫలిస్తుంది. అంతర్జాతీయ విస్తరణ, అభిమానుల సంఖ్య పెరుగుదల, వాణిజ్య అభివృద్ధికి వ్యూహాలు రచించాల్సిన ఈ దశలో జై షా కొనసాగింపు అనివార్యం’ అని ఐసీసీ వివరించింది. కాగా..2028 లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం చేస్తున్న విషయం విదితమే. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌కు కీలకమైన తరుణంలో జై షా పునర్‌నియామకం జరిగిందని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు చైర్మన్ రిచర్డ్ థాంప్సన్ వ్యాఖ్యానించారు. బోర్డు సభ్యులను ఒక్కతాటిపైకి తేవడం ద్వారా జై షా తన సమర్థ నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారని ఐసీసీ వైస్ చైర్మన్, జింబాబ్వే క్రికెట్ చైర్మన్ తవెంగ్వా ముకులానీ ప్రశంసించారు. న్యూజిలాండ్ క్రికెట్ డైరెక్టర్ రోజర్ ట్వోస్, ఐసీసీ అసోసియేట్ మెంబర్ చైర్మన్ గురుమూర్తి పళని కూడా జై షాను అభినందించారు.
ఎంతో గౌరవంగా భావిస్తున్నా: జైషా
‘ఐసీసీ బోర్డు నాపై ఉంచిన నమ్మకాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఇందుకు తోడ్పడిన బోర్డు ప్రతి డైరెక్టర్‌కూ కృతజ్ఞతలు. ఐసీసీ చైర్మన్ పదవి గౌరవంతో కూడిన బాధ్యత. క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు సభ్యులందరితో కలిసి పని చేస్తా’ అని జై షా పేర్కొన్నారు.
సచిన్, బింద్రా శుభాకాంక్షలు
దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్, ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత షూటర్ అభినవ్ బింద్రా..జైషాకు అభినందనలు తెలియజేశారు. ‘అవకాశాలు సృష్టించడం ద్వారా క్రికెట్ అభివృద్ధికి బాటలు పడతాయి. తద్వారా కొత్త అభిమానులు ఏర్పడతారు. ఇందుకోసం జై షా విశేషంగా కృషి చేశారు’ అని ఎక్స్‌లో సచిన్ కొనియాడాడు. ‘2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం చేస్తున్న తరుణంలో జై షా పునర్‌నియామకం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది’ అని బింద్రా పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
ధోనీని గుర్తు చేశాడు.. మోహిత్ ఉల్వాపై సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం