నేలకు దించారు
ABN , Publish Date - Jun 27 , 2026 | 05:59 AM
టీ20 వరల్డ్‌కప్ చాంపియన్స్.. పైగా ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన స్టార్లు.. ఇంకేముంది పసికూన ఐర్లాండ్‌పై ఏ స్థాయిలో విరుచుకుపడతారనే అంచనాలు అభిమానుల్లో నెలకొన్నాయి. కానీ...
తొలి టీ20లో ఐర్లాండ్ సంచలన విజయం
వణికించిన బౌలర్లు జూఅభిషేక్ ఇన్నింగ్స్ వృధా
చాంపియన్ భారత్‌కు షాక్
బెల్‌ఫాస్ట్: టీ20 వరల్డ్‌కప్ చాంపియన్స్.. పైగా ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన స్టార్లు.. ఇంకేముంది పసికూన ఐర్లాండ్‌పై ఏ స్థాయిలో విరుచుకుపడతారనే అంచనాలు అభిమానుల్లో నెలకొన్నాయి. కానీ రెండు టీ20ల సిరీ్‌సలో భాగంగా భారత జట్టుకు శుక్రవారం ఆరంభ మ్యాచ్‌లోనే ఊహించని పరాభవం ఎదురైంది. బ్యాట్‌తోనూ, బంతితోనూ చెలరేగిన ఆతిథ్య జట్టు.. టీమిండియాను ఉక్కిరిబిక్కిరి చేసింది. పెద్దగా అనుభవం లేని ఆ జట్టు బౌలర్ల చేతిలో మనోళ్లు పూర్తి ఓవర్లను కూడా ఆడలేక ఆలౌట్ కావడం గమనార్హం. ఫలితంగా శ్రేయాస్ సేన 34 రన్స్ తేడాతో చిత్తుగా ఓడింది. భారత్‌తో ఆడిన తొమ్మిది టీ20ల్లో ఐర్లాండ్‌కిదే తొలి విజయం కావడం విశేషం. అలాగే ఈ సిరీ్‌సలోనూ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. కెప్టెన్ లోర్కాన్ టక్కర్ (36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50), డెలానీ (32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 49) ఆదుకున్నారు. హర్షిత్‌కు మూడు.. అర్ష్‌దీప్, అక్షర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్ 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. అభిషేక్ (20 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 50), శివమ్ దూబే (14 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 25) మాత్రమే రాణించారు. మాథ్యూ హోలార్డ్, హమ్‌ఫ్రే్‌సలకు మూడేసి.. జై మూండ్రాకు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా హోలార్డ్ నిలిచాడు.
అభిషేక్ మినహా..: ఛేదనలో భారత్ కనీసం 150 పరుగులైనా చేయకుండానే ఆలౌట్ కావడం శోచనీయం. ఐర్లాండ్ బౌలర్ల ధాటికి పవర్‌ప్లేలోనే ఓపెనర్ శాంసన్ (5), ఇషాన్ (1), శ్రేయాస్ (3)ల వికెట్లను కోల్పోవడంతో ఒత్తిడి పెరిగింది. అయితే ఆరంభంలో ఓపెనర్ అభిషేక్ మాత్రం బౌండరీలతో ఎదురుదాడికి దిగాడు. మూడో ఓవర్‌లో నాలుగు ఫోర్లతో 21 రన్స్ అందించాడు. తన జోరుతో పవర్‌ప్లేలో 68/3 స్కోరుతో ఫర్వాలేదనిపించింది. 19 బంతుల్లో అర్ధసెంచరీ చేశాక అభిషేక్ వెనుదిరగడంతో కష్టాలు ఆరంభమయ్యాయి. మధ్య ఓవర్లలోనూ వికెట్ల పతనం ఆగకపోగా, తిలక్ (19) కాసేపు క్రీజులో నిలిచాడు. ఆ తర్వాత దూబే హిట్టింగ్‌తో ఆశలు రేపాడు. కానీ అతను కీలక సమయంలో వెనుదిరగడం దెబ్బతీసింది. టెయిలెండర్లు ఇలా వచ్చి అలా వెళ్లడంతో మరో ఏడు బంతులుండగానే ఐర్లాండ్ మ్యాచ్‌ను గెలిచి సంబరాలు చేసుకుంది.
ఆదుకున్న టక్కర్, డెలానీ: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ ఆరంభంలో ఇబ్బందిపడినా చివర్లో పుంజుకుంది. అలాగే భారత ఫీల్డర్లు మూడు క్యాచ్‌లను వదిలేయడం కూడా కలిసివచ్చింది. ఓ దశలో 51/4తో ఉన్న జట్టును కొత్త కెప్టెన్ టక్కర్ ఆదుకున్నాడు. అతడికి డెలానీ చక్కటి సహకారం అందించడంతో భారీ స్కోరు సాధ్యమైంది. అంతకుముందు పేసర్లు అర్ష్‌దీప్, హర్షిత్ కట్టుదిట్టమైన బంతులకు ఐర్లాండ్ పవర్‌ప్లేలో 36/3తో నిలిచింది. అర్ధసెంచరీ అయ్యాక టక్కర్ వెనుదిరగ్గా.. చివర్లో డెలానీ విజృంభించాడు. 17వ ఓవర్‌లో తను వరుసగా 4,6,6,6 బాదడంతో ఏకంగా 27 పరుగులు రాగా జట్టు స్కోరు కూడా 160 దాటేసింది. ఆ తర్వాత బౌలర్లు కట్టడి చేసినా ఓవరాల్‌గా ఆతిథ్య జట్టు సవాల్ విసిరే స్కోరందుకుంది.
స్కోరుబోర్డు
ఐర్లాండ్: టిమ్ టెక్టర్ (సి) శ్రేయాస్ (బి) హర్షిత్ 17, అడెయిర్ (సి) శాంసన్ (బి) హర్షిత్ 12, హ్యారీ టెక్టర్ (సి) శాంసన్ (బి) అర్ష్‌దీప్ 0, టక్కర్ (సి) తిలక్ (బి) హర్షిత్ 50; కాలిట్జ్ (సి) ప్రసిద్ధ్ (బి) దూబే 15, డెలానీ (సి) అక్షర్ (బి) అర్ష్‌దీప్ 49, డాక్‌రెల్ (సి) అర్ష్‌దీప్ (బి) అక్షర్ 19, మెక్‌కార్తి (సి) తిలక్ (బి) అక్షర్ 7, హమ్‌ఫ్రేస్ (రనౌట్) 2, మూండ్రా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 182/9. వికెట్ల పతనం: 1-20, 2-25, 3-30, 4-51, 5-115, 6-164, 7-178, 8-178, 9-182. బౌలింగ్: అర్ష్‌దీప్ 4-0-28-2, హర్షిత్ 4-0-24-3, ప్రసిద్ధ్ 4-0-57-0, దూబే 3-0-18-1, అక్షర్ 4-0-33-2, సుందర్ 1-0-19-0.
భారత్: అభిషేక్ (సి) కాలిట్జ్ (బి) మెక్‌కార్తి 50, శాంసన్ (బి) మూండ్రా 5, ఇషాన్ (సి) టక్కర్ (బి) హోలార్డ్ 1, శ్రేయాస్ (సి) డాక్‌రెల్ (బి) హోలార్డ్ 3, తిలక్ (సి) అడెయిర్ (బి) హమ్‌ఫ్రేస్ 19, సుందర్ (సి) కాలిట్జ్ (బి) హోలార్డ్ 9, దూబే (సి అండ్ బి) మూండ్రా 25, అక్షర్ (సి) టెక్టర్ (బి) డెలానీ 15, హర్షిత్ (సి) కాలిట్జ్ (బి) హమ్‌ఫ్రేస్ 8, అర్ష్‌దీప్ (సి) టెక్టర్ (బి) హమ్‌ఫ్రేస్ 2, ప్రసిద్ధ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 18.5 ఓవర్లలో 148 ఆలౌట్. వికెట్ల పతనం: 1-16, 2-45, 3-60, 4-80, 5-90, 6-100, 7-135, 8-137, 9-147, 10-148. బౌలింగ్: హమ్‌ఫ్రేస్ 3.5-0-38-3, జై మూండ్రా 4-0-26-2, మెక్‌కార్తి 3-0-29-1, మాథ్యూ హోలార్డ్ 4-0-28-3, టెక్టర్ 3-0-22-0, డెలానీ 1-0-3-1.
ఇవి కూడా చదవండి
విగ్ కారణంగానే కేతన్ హత్య.. తండ్రి ఏమన్నారంటే..