Share News

శాంసన్‌ కొనసాగేనా?

ABN , Publish Date - Jul 04 , 2026 | 05:18 AM

ఐర్లాండ్‌తో సిరీస్‌ ఓటమి తర్వాత.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత బ్యాటర్లు ఫర్వాలేదనిపించారు. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్‌ రద్దయిన విషయం తెలిసిందే. ఇక శనివారం...

శాంసన్‌ కొనసాగేనా?

రాత్రి 7 గంటల నుంచి

సోనీస్పోర్ట్స్‌లో

  • ఫామ్‌లేమితో తంటాలు

  • వైభవ్‌ బెర్త్‌పై ఒత్తిడి

  • తిలక్‌ ఆటపైనా విమర్శలు

  • నేడు ఇంగ్లండ్‌తో భారత్‌ రెండో టీ20

మాంచెస్టర్‌: ఐర్లాండ్‌తో సిరీస్‌ ఓటమి తర్వాత.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత బ్యాటర్లు ఫర్వాలేదనిపించారు. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్‌ రద్దయిన విషయం తెలిసిందే. ఇక శనివారం ఇరుజట్ల మధ్య జరిగే రెండో మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఎందుకం టే.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్‌ సంజూ శాంసన్‌ నిరాశపర్చగా, తిలక్‌ వర్మ నిదానంగా ఆడుతున్నాడన్న విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మరోవైపు 15ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీని ఆడించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందుకే ఈ మ్యాచ్‌కు జట్టు కూర్పు ఎలా ఉండనున్నదనే ఆరాటం అభిమానుల్లో కనిపిస్తోంది. అటు ఇంగ్లండ్‌ ఎలాంటి ఒత్తిడీ లేకుండా బోణీ కోసం ఎదురుచూస్తోంది.

దక్కని శుభారంభాలు: వరుసగా మూడు టీ20ల్లో భారత్‌కు శుభారంభాలు దక్కలేదు. ముఖ్యంగా ఓపెనర్‌ సంజూ శాంసన్‌ నిలకడలేమి జట్టుకు సమస్యగా మారింది. అద్భుత ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకోవడం.. ఆ వెంటనే వరుస వైఫల్యాలతో నిరాశపర్చడం అతనికి పరిపాటిగా మారింది. టీ20 వరల్డ్‌క్‌పలో ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీగా నిలిచిన తను ఈ టూర్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో చేసింది ఆరు పరుగులే. అయితే ఈ సీనియర్‌పై నమ్మకముంచి మరో అవకాశం ఇచ్చే ఆలోచనలో జట్టు ఉంది. కానీ చాన్స్‌ కోసం చిచ్చరపిడుగు వైభవ్‌ సిద్ధంగా ఉన్న వేళ.. శాంసన్‌ మళ్లీ విఫలమైతే కష్టమే. అలాగే తిలక్‌ వర్మ మధ్య ఓవర్లలో ఆడే విధానంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. స్లో బౌలింగ్‌లో తను ఇబ్బందిపడుతున్నాడు. ఈ ఏడాది ఆడిన 12 టీ20ల్లో తను 12 సిక్సర్లు మాత్రమే బాదడం గమనార్హం. ఐర్లాండ్‌పై నెమ్మదిగా ఆడి రన్‌రేట్‌ పెరగడానికి కారణమయ్యాడని కామెంట్స్‌ వినిపించాయి. ఈ సిరీ్‌సలో ఫినిషర్‌గా తానేమిటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మరో ఓపెనర్‌ అభిషేక్‌ మాత్రం జోరు చూపుతున్నాడు. కెప్టెన్‌ శ్రేయాస్‌ హాఫ్‌ సెంచరీతో ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. బౌలింగ్‌ విభాగంలో మార్పులు చే యాల్సిన అవసరం లేదని కోచ్‌ భావిస్తున్నాడు. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది.


ఆర్చర్‌ జట్టులోకి..: రెండో టీ20 కోసం ఇంగ్లండ్‌ ఇప్పటికే తమ తుది జట్టును ప్రకటించింది. తొలి మ్యాచ్‌కు దూరమైన పేసర్‌ ఆర్చర్‌ నేటి మ్యాచ్‌లో ఆడబోతున్నాడు. అలాగే జోష్‌ టంగ్‌ అరంగేట్రం చేయనున్నాడు. మహ్మూద్‌, ల్యూక్‌ ఉడ్‌లను తప్పించారు. వర్షం కారణంగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్లకు ఆడే అవకాశం రాలేదు. దీంతో నేటి మ్యాచ్‌లో తమ సత్తా చూపాలనుకుంటున్నారు. ఓపెనర్లు సాల్ట్‌, బట్లర్‌ మెరుపు ఆరంభాన్నిస్తే.. మిడిలార్డర్‌లో బ్రూక్‌, బెథెల్‌, బాన్‌టన్‌లతో పాటు విల్‌ జాక్స్‌ ఫినిషింగ్‌తో భారీ స్కోరుపై జట్టు కన్నేసింది.

తుది జట్లు

భారత్‌ (అంచనా): శాంసన్‌/వైభవ్‌, అభిషేక్‌, ఇషాన్‌, శ్రేయాస్‌ (కెప్టెన్‌), తిలక్‌, దూబే, అక్షర్‌, హర్షిత్‌, అర్ష్‌దీప్‌, బిష్ణోయ్‌, వరుణ్‌.

ఇంగ్లండ్‌: సాల్ట్‌, బట్లర్‌, బ్రూక్‌ (కెప్టెన్‌), బెథెల్‌, బాన్‌టన్‌, సామ్‌ కర్రాన్‌, విల్‌ జాక్స్‌, డాసన్‌, రషీద్‌, ఆర్చర్‌, టంగ్‌.

పిచ్‌, వాతావరణం: ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ పిచ్‌ సహజంగా బౌలింగ్‌కు అనుకూలిస్తుంటుంది. కానీ బ్యాటర్లు కూడా చెలరేగే అవకాశం ఉంది. గతేడాది ఇంగ్లండ్‌ ఇక్కడ 304 పరుగులు చేసింది. చిరు జల్లులకు ఆస్కారం ఉంది.

ఈ వార్తలనూ చదవండి:

వీధులు శుభ్రం చేసినట్టు ఏఐ చిత్రాలు.. మున్సిపల్ సిబ్బందిపై వేటు

సింధు జలాలపై భారత్‌ కఠిన వైఖరి.. ఉగ్రవాదం ఆగేదాకా..

Updated Date - Jul 04 , 2026 | 05:18 AM