Share News

బాదేసి.. తిప్పేసి

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:26 AM

టీ20 వరల్డ్‌క్‌పలో భారత్‌ జైత్రయాత్ర సాగుతోంది. 2024 టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడని టీమిండియా.. ఈసారి కూడా అదే జోరును కొనసాగిస్తోంది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా నమీబియాతో..

బాదేసి.. తిప్పేసి

టీ20 వరల్డ్‌కప్‌

  • భారత్‌ ఘనవిజయం

  • ఇషాన్‌, హార్దిక్‌ అర్ధసెంచరీలు

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌క్‌పలో భారత్‌ జైత్రయాత్ర సాగుతోంది. 2024 టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడని టీమిండియా.. ఈసారి కూడా అదే జోరును కొనసాగిస్తోంది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో స్పిన్నర్లు రాణించగా 93 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మెగా టోర్నమెంట్‌లో భారత జట్టుకు ఇది వరుసగా పదో విజయం. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 61), హార్దిక్‌ (28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 52), తిలక్‌ (21 బంతుల్లో 3 ఫోర్లతో 25) రాణించారు. స్పిన్నర్‌ ఎరాస్మ్‌సకు నాలుగు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్లు స్టీన్‌కాం్‌ప (29), ఫ్రిలింక్‌ (22) మాత్రమే ఫర్వాలేదనిపించారు. వరుణ్‌కు మూడు.. అక్షర్‌, హార్దిక్‌కు రెండేసి వికెట్లు లభించాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గాహార్దిక్‌ నిలిచాడు.

స్పిన్‌కు దాసోహం: భారీ ఛేదనను నమీబియా మెరుగ్గానే ఆరంభించింది. కానీ మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని ఎదుర్కోలేక తడబడ్డారు. అటు అక్షర్‌ సైతం తిప్పేయడంతో లక్ష్యానికి చాలా దూరంలోనే ఆగిపోయారు. ఓపెనర్‌ ఫ్రిలింక్‌ని అర్ష్‌దీప్‌ నాలుగో ఓవర్‌లో అవుట్‌ చేశాడు. ఎనిమిదో ఓవర్‌ నుంచి నమీబియా ఆట గతి తప్పింది. వరుణ్‌ తన తొలి బంతికే ఊపు మీదున్న స్టీన్‌కాంప్‌ను బౌల్డ్‌ చేయడంతో రెండో వికెట్‌కు 34 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక తన తర్వాతి ఓవర్‌లో ఇంకో రెండు వికెట్లు తీయగా.. మరో ఎండ్‌లో స్పిన్నర్‌ అక్షర్‌ వరుస ఓవర్లలో ఎరాస్మస్‌ (18), క్రుగర్‌ (5)ల పనిబట్టాడు. ఈ దెబ్బకు 94/6 స్కోరుతో మరిక కోలుకోలేకపోయింది. మిగిలిన వికెట్లను బుమ్రా, హార్దిక్‌ల ధాటికి 5 పరుగుల తేడాతో కోల్పోయింది.


చెలరేగిన ఇషాన్‌, హార్దిక్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌ మెరుపు వేగంతో ఆరంభమైంది. అలాగే ఓపెనర్‌ ఇషాన్‌, హార్దిక్‌ ధనాధన్‌ షాట్లతో చెలరేగి అర్ధ సెంచరీలు సాధించారు. 7 ఓవర్లలోనే 100 రన్స్‌ దాటడంతో 250 స్కోరు కూడా సులువే అనిపించింది. కానీ కెప్టెన్‌ ఎరాస్మస్‌ సైడ్‌ ఆర్మ్‌ ఆఫ్‌ స్పిన్‌ బంతులతో ఇతర బ్యాటర్లు ఇబ్బందిపడ్డారు. దీనికి తోడు ఆఖరి రెండు ఓవర్లలో భారత్‌ 10 పరుగుల తేడాలో ఐదు వికెట్లు కోల్పోవడం గమనార్హం. శాంసన్‌ (23) మెరుపు ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే ముగిసింది. అయితే ఇషాన్‌ ఆరో ఓవర్‌లో 6,6,6,6,4తో 28 రన్స్‌ రాబట్టడంతో పవర్‌ప్లేలో జట్టు 86/1కి చేరింది. అటు 20 బంతుల్లోనే ఇషాన్‌ ఫిఫ్టీ కూడా పూర్తి చేశాడు. అయితే ఎనిమిదో ఓవర్‌లో ఇషాన్‌ను ఎరాస్మస్‌ అవుట్‌ చేయడంతో రెండో వికెట్‌కు తిలక్‌తో 79 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అక్కడినుంచి తిలక్‌, సూర్య (12) జాగ్రత్తగా ఆడడంతో 17 బంతుల పాటు బౌండరీ కూడా రాలేదు. ఇక వరుస ఓవర్లలో వీరిద్దరు వెనుదిరగ్గా హార్దిక్‌ రాకతో స్కోరుబోర్డులో ఊపు కనిపించింది. అయితే 19వ ఓవర్‌లో హార్దిక్‌, అక్షర్‌ (0)లను ఎరాస్మస్‌ అవుట్‌ చేయగా, దూబే రనౌటయ్యాడు. ఇక చివరి ఓవర్‌లో 3 పరుగులే చేసిన జట్టు రింకూ సింగ్‌ (1), అర్ష్‌దీప్‌ (2) వికెట్లను కోల్పోవడం గమనార్హం.

స్కోరుబోర్డు

భారత్‌: ఇషాన్‌ (సి) షికోంగో (బి) ఎరాస్మస్‌ 61, శాంసన్‌ (సి) స్టీన్‌కాం్‌ప (బి) షికోంగో 22, తిలక్‌ (సి) స్మిట్‌ (బి) ఎరాస్మస్‌ 25, సూర్యకుమార్‌ (స్టంప్‌) గ్రీన్‌ (బి) షాల్జ్‌ 12, హార్దిక్‌ (సి సబ్‌) లీచర్‌ (బి) ఎరాస్మస్‌ 52, దూబే (రనౌట్‌) 23, రింకూ (సి) ఎరాస్మస్‌ (బి) స్మిట్‌ 1, అక్షర్‌ (బి) ఎరాస్మస్‌ 0, వరుణ్‌ (నాటౌట్‌) 1, అర్ష్‌దీప్‌ (రనౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 209/9. వికెట్ల పతనం: 1-25, 2-104, 3-120, 4-124, 5-205, 6-205, 7-206, 8-206, 9-209; బౌలింగ్‌: ట్రంపెల్మన్‌ 4-0-38-0, షికోంగో 3-0-41-1, స్మిట్‌ 4-0-50-1, హీంగో 1-0-18-0, ఎరాస్మస్‌ 4-0-20-4, షాల్జ్‌ 4-0-41-1.


నమీబియా: స్టీన్‌కాం్‌ప (బి) వరుణ్‌ 29, ఫ్రిలింక్‌ (సి) దూబే (బి) అర్ష్‌దీప్‌ 22, లాఫ్టీ ఈటన్‌ (సి) అక్షర్‌ (బి) వరుణ్‌ 13, ఎరాస్మస్‌ (సి) తిలక్‌ (బి) అక్షర్‌ 18, స్మిట్‌ (బి) వరుణ్‌ 0, గ్రీన్‌ హిట్‌ వికెట్‌ (బి) దూబే 11, క్రుగర్‌ (సి) బుమ్రా (బి) అక్షర్‌ 5, ట్రంపెల్‌మన్‌ (బి) బుమ్రా 6, షాల్జ్‌ (సి) అక్షర్‌ (బి) హార్దిక్‌ 4, షికోంగో (ఎల్బీ) హార్దిక్‌ 0, హీంగో (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 18.2 ఓవర్లలో 116 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-33, 2-67, 3-86, 4-86, 5-88, 6-94, 7-111, 8-116, 9-116, 10-116; బౌలింగ్‌: హార్దిక్‌ 4-0-21-2, అర్ష్‌దీప్‌ 3-0-36-1, దూబే 2.2-0-11-1, బుమ్రా 4-0-20-1, వరుణ్‌ 2-0-7-3, అక్షర్‌ 3-1-20-2.

1

టీ20 వరల్డ్‌క్‌పలో భారత్‌కిదే అతి పెద్ద (93 రన్స్‌) విజయం

1

టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో భారత జట్టు 6.5 ఓవర్లలోనే 100 పరుగుల మైలురాయిని చేరి రికార్డుల్లోకి ఎక్కింది.

2

భారత్‌ తరఫున టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ ఆడిన రెండో పెద్ద వయస్కుడిగా (31 ఏళ్ల 93 రోజులు) శాంసన్‌. అమిత్‌ మిశ్రా (31 ఏళ్ల 117) ముందున్నాడు.

2

పవర్‌ప్లేలో రెండుసార్లు హాఫ్‌ సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్‌గా ఇషాన్‌. గతంలో అభిషేక్‌ (3), రోహిత్‌ (2) ఉన్నారు. అలాగే టీ20 వరల్డ్‌క్‌పలో ఈ ఫీట్‌ సాధించి రోహిత్‌, రాహుల్‌ సరసన నిలిచాడు.


పాక్‌తో మ్యాచ్‌కూ అభిషేక్‌ డౌటే

న్యూఢిల్లీ: కడుపు నొప్పి నుంచి కోలుకొంటున్న అభిషేక్‌ శర్మ ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. గురువారం నమీబియాతో మ్యాచ్‌ టాస్‌ సమయంలో అభిషేక్‌ గురించి సూర్య షాకింగ్‌ విషయం చెప్పాడు. ‘అభిషేక్‌ ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడలేదు. అతడు ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు దూరమవుతాడ’ని సూర్య అన్నాడు. దీంతో పాక్‌తో మ్యాచ్‌కు కూడా శర్మ డౌటేనని ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. కాగా, అభిషేక్‌ ఆరోగ్యంపై బీసీసీఐ అప్‌డేట్‌ ఇచ్చింది. ‘అనారోగ్యం నుంచి శర్మ కోలుకొంటున్నాడు. మెడికల్‌ టీమ్‌ పర్యవేక్షిస్తోంద’ని ఎక్స్‌లో తెలిపింది.

ఇవి కూడా చదవండి:

అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో అర్ష్‌దీప్ సింగ్

కొలంబో పిచ్‌ను టీమిండియాకు అనుకూలంగా మార్చేస్తారు.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..

Updated Date - Feb 13 , 2026 | 03:26 AM