వార్ వన్‌సైడ్
ABN , Publish Date - Feb 16 , 2026 | 05:58 AM
సంచలనమేమీ లేదు. టీ20 వరల్డ్‌క్‌పలో పాకిస్థాన్‌పై భారత జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77) తుఫాన్ ఇన్నింగ్స్‌కు జతగా బౌలింగ్ విభాగం దుమ్ము రేపడంతో...
నేటి మ్యాచ్‌లు
అఫ్ఘానిస్థాన్ X యూఏఈ (ఉ. 11 గం. నుంచి)
ఇంగ్లండ్ X ఇటలీ (మ.3 గం.)
ఆస్ట్రేలియా X శ్రీలంక (రా.7 గం.)
వార్ వన్‌సైడ్
టీమిండియా చేతిలో పాక్ చిత్తు
సూపర్-8లో సూర్యసేన
ఇషాన్ కిషన్ తుఫాన్ ఇన్నింగ్స్
బెదరగొట్టిన బౌలర్లు
యూఎస్ఏ 132.. నమీబియా 116. ఈ టీ20 వరల్డ్‌క్‌పలో భారత్‌పై పసికూన జట్లు సాధించిన స్కోర్లివి. కానీ ఎప్పుడెప్పుడా అని క్రికెట్ ప్రేమికులు ఆత్రుతగా ఎదురుచూసిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చేసింది 114 పరుగులే. టోర్నీ ఆరంభానికి ముందు.. ఆ తర్వాత కూడా భారత్-పాక్ పోరుపై ఎంత హైడ్రామా సాగిందో! కానీ బరిలోకి దిగాక మాత్రం మనోళ్ల దెబ్బకు.. వార్ వన్‌సైడ్ అయిపోయింది. 176 పరుగుల ఛేదనలో పాక్ జట్టు ఏమాత్రం పోటీ ఇవ్వకుండానే బ్యాట్లెత్తేసింది. ఫలితం..మహా శివరాత్రి పర్వదినాన భారత అభిమానులు పులకించిపోగా, పాక్ ఫ్యాన్స్‌కు ఆదివారం కాళరాత్రిగా మిగిలింది. మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ హైలైట్. ఈ ఘనవిజయంతో భారత్ సగర్వంగా సూపర్-8కు చేరింది.
కొలంబో: సంచలనమేమీ లేదు. టీ20 వరల్డ్‌క్‌పలో పాకిస్థాన్‌పై భారత జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77) తుఫాన్ ఇన్నింగ్స్‌కు జతగా బౌలింగ్ విభాగం దుమ్ము రేపడంతో సూర్య సేన 61 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్ ‘ఎ’ నుంచి జట్టు సూపర్-8కి చేరింది. అంతేకాకుండా ఈ మెగా టోర్నీలో పాక్‌పై భారత్ ఆధిక్యం 8-1కి పెరిగింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. సూర్య (32), దూబే (27), తిలక్ (25) ఫర్వాలేదనిపించారు. స్పిన్నర్ సయీమ్ అయూబ్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో పాక్ 18 ఓవర్లలో 114 పరుగులకు కుప్పకూలింది. ఉస్మాన్ ఖాన్ (44), షహీన్ (23 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. బుమ్రా, వరుణ్, హార్దిక్, అక్షర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఇషాన్ నిలిచాడు.
పోటీ లేకుండానే..
‘మా బ్యాటర్లు కచ్చితంగా ఈ స్కోరును ఛేదిస్తారు’.. భారత్ ఇన్నింగ్స్ ముగిశాక స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ అన్న మాటలివి. కానీ బరిలోకి దిగాక పాక్ బ్యాటర్లు పోటీ కాదు కదా.. ఆ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. 0, 6, 4, 5 పాక్ టాప్-4 బ్యాటర్ల స్కోర్లివి. పేసర్లు హార్దిక్, బుమ్రాల ధాటికి తొలి రెండు ఓవర్లలోనే ముగ్గురు పెవిలియన్‌లో కూర్చోవడంతో పాక్ పరిస్థితి అర్థమైంది. మిడిలార్డర్‌లో ఉస్మాన్ ఖాన్ ఒక్కడే కాసేపు నిలదొక్కుకున్నాడు. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు ప్రభావం చూపడంతో పాటు వికెట్ల వేట సాగించడంతో ఓ దశలో వంద పరుగులు కూడా కష్టమే అనిపించింది. కానీ చివర్లో షహీన్ బౌండరీలతో కాస్త పరువు కాపాడాడు. హార్దిక్ ఆఖరి వికెట్‌తో పాక్ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లోనే ముగిసింది.

అటు ఇషాన్.. ఇటు స్పిన్నర్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఇన్నింగ్స్ పాక్ స్పిన్నర్ల ధాటికి రెండు రకాలుగా సాగింది. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తున్నా ఓపెనర్ ఇషాన్ ధనాధన్ ఆటతీరుతో వహ్వా అనిపించాడు. అతడి ఎడాపెడా షాట్లతో స్కోరుబోర్డు దూసుకెళ్లింది. కానీ తన నిష్క్రమణ తర్వాత అదే పిచ్‌పై మిగతా బ్యాటర్లకు టర్నింగ్ బంతిని ఎదుర్కోవడం చాలా కష్టంగా మారింది. పాక్ ఏకంగా ఆరుగురు స్పిన్నర్లను బరిలోకి దించి 18 ఓవర్లను వేయించడం విశేషం. దీంతో క్రీజులో తిలక్, సూర్య, దూబే ఉన్నప్పటికీ ఆశించిన మేర పరుగులు సాధించలేకపోయింది. వారు భారీ షాట్లకు ప్రయత్నించినా మైదానం పెద్దది కావడంతో బంతి బౌండరీ దాటడం గగనమైంది. ముఖ్యంగా సయీమ్ అయూబ్ బంతిని అద్భుతంగా టర్న్ చేసి భారత్‌పై ఒత్తిడి పెంచాడు. ఇదంతా ఓ వైపు.. కానీ ఆరంభంలో ఇషాన్ ఆడిన తీరుకు పాక్ బౌలర్లలో వణుకు పుట్టింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను కెప్టెన్ సల్మాన్ వేయడమే కాకుండా ప్రమాదకర అభిషేక్‌ను డకౌట్ చేశాడు. తన చివరి ఆరు ఇన్నింగ్స్‌లో అభిషేక్‌కిది నాలుగో డకౌట్ కావడం గమనార్హం. రెండో ఓవర్ పేసర్ షహీన్‌కు ఇవ్వగా.. ఇషాన్ 6,4 తిలక్ 4తో 15 రన్స్ వచ్చాయి. స్పిన్నర్ అబ్రార్ తొలి ఓవర్‌లోనూ ఇషాన్ 6,4తో చెలరేగడంతో పవర్‌ప్లేలో జట్టు 52/1 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. అందులో ఇషాన్‌వే 42 పరుగులుండడం విశేషం. ఆ తర్వాతా తన ధాటిని కొనసాగిస్తూ ఏడో ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లతో విరుచుకుపడిన ఇషాన్.. స్పిన్నర్ షాదాబ్ ఓవర్‌లో 6,4తో 17 రన్స్ రాబట్టాడు. ఓవర్‌కు పది పరుగుల రన్‌రేట్‌తో స్కోరుబోర్డు దూసుకెళుతున్న వేళ స్పిన్నర్ సయీమ్ భారత్‌కు షాక్ ఇచ్చాడు. తొమ్మిదో ఓవర్‌లో అతడు ఇషాన్‌ను బౌల్డ్ చేయడంతో రెండో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత ఒక్కసారిగా స్కోరు నెమ్మదించింది. స్పిన్నర్లు ప్రభావం చూపడంతో తిలక్-సూర్య జోడీ భారీ షాట్లకు వెళ్లే సాహసం చేయలేదు. దీనికి తోడు 15వ ఓవర్‌లో సయీమ్ డబుల్ ఝలక్ ఇస్తూ వరుస బంతుల్లో తిలక్, హార్దిక్ (0)ల వికెట్లు తీశాడు. 18వ ఓవర్‌లో సూర్య 4, దూబే (27) 6 తో 14 రన్స్‌తో స్కోరు 150 దాటింది. కానీ తర్వాతి ఓవర్‌లోనే సూర్యను తారిఖ్ అవుట్ చేయగా.. చివరి ఓవర్‌లో జట్టు 16 రన్స్ సాధించి రెండు వికెట్లను కోల్పోయింది.
స్కోరుబోర్డు
భారత్: ఇషాన్ (బి) సయీమ్ 77, అభిషేక్ (సి) షహీన్ (బి) సల్మాన్ 0, తిలక్ (ఎల్బీ) సయీమ్ 25, సూర్యకుమార్ (సి) సయీమ్ (బి) తారిఖ్ 32, హార్దిక్ (సి) బాబర్ (బి) సయీమ్ 0, దూబే (రనౌట్) 27, రింకూ (నాటౌట్) 11, అక్షర్ (సి) సయీమ్ (బి) షహీన్ 0; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 175/7. వికెట్ల పతనం: 1-1, 2-88, 3-126, 4-126, 5-159, 6-175, 7-175. బౌలింగ్: సల్మాన్ ఆఘా 2-0-10-1, షహీన్ 2-0-31-1, సయీమ్ 4-0-25-3, అబ్రార్ 3-0-38-0, షాదాబ్ 1-0-17-0, నవాజ్ 4-0-28-0, తారిఖ్ 4-0-24-1.
పాకిస్థాన్: సాహిబ్‌జాదా (సి) రింకూ (బి) హార్దిక్ 0, సయీమ్ (ఎల్బీ) బుమ్రా 6, సల్మాన్ (సి) హార్దిక్ (బి) బుమ్రా 4, బాబర్ (బి) అక్షర్ 5, ఉస్మాన్ (స్టంప్) ఇషాన్ (బి) అక్షర్ 44, షాదాబ్ (సి) దూబే (బి) తిలక్ 14, నవాజ్ (సి) దూబే (బి) కుల్దీప్ 4, ఫహీమ్ (సి) రింకూ (బి) వరుణ్ 10, షహీన్ (నాటౌట్) 23, ఎబ్రార్ (ఎల్బీ) వరుణ్ 0, ఉస్మాన్ (బి) హార్దిక్ 0; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 18 ఓవర్లలో 114 ఆలౌట్. వికెట్ల పతనం: 1-0, 2-6, 3-13, 4-34, 5-73, 6-78, 7-78, 8-97, 9-97, 10-114. బౌలింగ్: హార్దిక్ 3-1-16-2, బుమ్రా 2-0-17-2, అక్షర్ 4-0-29-2, వరుణ్ 3-0-17-2, కుల్దీప్ 3-0-14-1, తిలక్ 2-0-11-1, రింకూ 1-0-9-0.

మ్యాచ్‌కు ముందు ట్రోఫీతో టోర్నీ అంబాసిడర్ రోహిత్ శర్మ, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్
1
భారత్-పాక్ మధ్య జరిగిన టీ20ల్లో పవర్‌ప్లేలో ఎక్కువ పరుగులు (42) చేసిన బ్యాటర్‌గా ఇషాన్
1
టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఆరుగురు స్పిన్నర్లను ఉపయోగించిన ఏకైక జట్టుగా పాక్.
2
టీ20 వరల్డ్‌క్‌పలో పాక్ జట్టుకిది రెండో (61 రన్స్‌తో) భారీ ఓటమి. గతంలో విండీ్‌సపై 84 రన్స్‌తో ఓడింది.
3
టీ20 వరల్డ్‌కప్ అరంగేట్రంలో తామాడిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ డకౌటైన మూడో బ్యాటర్‌గా అభిషేక్. గతంలో నెహ్రా, ఇమ్రుల్ కయేస్ ఉన్నారు.

నో షేక్‌హ్యాండ్..
ఆసియాకప్ సంప్రదాయాన్నే టీమిండియా ఇక్కడా కొనసాగించింది. టాస్ సమయంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘాతో భారత సారథి సూర్యకుమార్ కరచాలనం చేయలేదు. ఇదే విషయమై మ్యాచ్‌కు ముందు రోజు ఇరు జట్ల కెప్టెన్లను విలేకరులు అడిగితే.. వేచి చూడాల్సిందిగా బదులిచ్చారు. అయితే మ్యాచ్ రోజు అందరూ ఆసక్తిగా గమనించినప్పటికీ ఎప్పటిలాగే ఎవరికి వారు ప్రజెంటర్‌తో మాట్లాడి వెళ్లిపోయారు. ఇదే ఆనవాయితీ అటు మహిళల వన్డే వరల్డ్‌కప్, అండర్-19 వరల్డ్‌క్‌పల్లోనూ కొనసాగించిన విషయం తెలిసిందే.

అతిరథుల సందడి
భారత్-పాక్ మ్యాచ్‌ను తిలకించేందుకు శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే తరలివచ్చారు. వీవీఐపీ గ్యాలరీలో ఆయనతో పాటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మొహిసిన్ నఖ్వీ, శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎఎల్‌సీ) అధ్యక్షుడు షమ్మి సిల్వ, పీసీబీ సీఓఓ సల్మాన్ నసీర్ కూడా ఉన్నారు. అయితే ఐసీసీ చైర్మన్ జైషా, టోర్నీ అంబాసిడర్ రోహిత్ శర్మ, ఐపీఎల్ చైర్మన్ ధూమల్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాత్రం వీళ్లతో కాకుండా మరో గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ను తిలకించడం గమనార్హం.

ఎన్ని డ్రామాలాడినా..
మ్యాచ్‌కు ముందు ఎంత డ్రామా! ఎన్ని రోజుల సస్పెన్స్! భారత్‌తో ఐసీసీ టోర్నీ మ్యాచ్ అనగానే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ ) ఎప్పుడూ వివాదం సృష్టిస్తూనే ఉంటుంది. అయితే ఈసారి పీసీబీకి బదులు ఏకంగా ఆ దేశ ప్రభుత్వమే వివాదంలో తలదూర్చింది. భారత్‌లో ఆడేందుకు ససేమిరా అన్న బంగ్లాదేశ్‌ను టీ20 వరల్డ్ కప్‌నుంచి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తప్పిస్తే..ఆ దేశానికి మద్దతుగా పాకిస్థాన్ ప్రభుత్వం రంగంలోకి దిగింది! బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా ప్రపంచ కప్‌లో భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తున్నట్టు సాక్షాత్తూ పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే బహిష్కరణ నిర్ణయాన్ని కనుక మార్చుకోకుంటే నిబంధనల ప్రకారం పాకిస్థాన్‌పై కఠిన చర్యలకు వెనుకాడబోమని ఐసీసీ హెచ్చరించింది. మరోవైపు పాకిస్థాన్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. అప్పులు చేస్తే తప్ప దేశం నడవలేని గడ్డు పరిస్థితి. ఇక పీసీబీ ఆర్థిక పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బోర్డు కాంట్రాక్టులో ఉన్న ఆటగాళ్లకు కూడా జీతాలు చెల్లించలేని దైన్య స్థితి. ఈ నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్ ఆడకుండే ఆర్థికంగా ఏర్పడే విపరిణామాలు భయపెట్టిన వేళ పాకిస్థాన్ దిగివచ్చింది. మరోవైపు శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు కూడా నచ్చజెప్పడంతో టీమిండియాతో తలపడేందుకు పాకిస్థాన్ అంగీకరించింది. దాంతో వరల్డ్ కప్‌లో అసలు సిసలు సమరానికి మార్గం సుగమమైంది. కానీ మ్యాచ్ ఫలితం మాత్రం అదే. ఐసీసీ టోర్నమెంట్లలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై తన సంపూర్ణ ఆధిపత్యాన్ని భారత్ మరోసారి ప్రదర్శించింది. మిస్టరీ స్పిన్నర్ పేరిట ఉస్మాన్ తారిఖ్‌ను బరిలోకి దించినా, టీమిండియా బ్యాటర్లకు కళ్లెం వేసేందుకు మరో ఐదుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. 20 ఓవర్లలో 18 ఓవర్లు స్పిన్నర్లతోనే వేయించింది. అయితే ఈ వ్యూహం బెడిసి కొట్టింది. సూపర్ ఫామ్‌లో ఉన్న భారత బ్యాటర్లు పాక్ స్పిన్నర్లను ఆడేసుకున్నారు. స్లో బౌలర్లకు సహకరించిన ప్రేమదాస స్టేడియం పిచ్‌పై 176 పరుగుల లక్ష్యం క్లిష్టమైనదే. దాంతో ఛేదనలో మన స్పిన్నర్ల ఎదుట పాకిస్థాన్ పూర్తిగా తేలిపోయింది. బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వికెట్లు అప్పగించేసి వెళ్లడంతో భారత్ మరో ఘన విజయం అందుకుంది. పాకిస్థాన్‌పై తనకు తిరుగులేదని నిరూపించింది. ఇక..అంతర్జాతీయ క్రికెట్‌పై భారత పెత్తనమేమిటంటూ, బీసీసీఐకి ఐసీసీ పూర్తిగా లొంగిపోయిందంటూ, ఐసీసీకి ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ క్రికెట్ పాలనకు మరో సంస్థ రావాలంటూ బీరాలు పలికిన పాకిస్థాన్ చిత్తుగా ఓటమిపాలై చివరకు నవ్వుల పాలైంది.
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
పాయింట్ల పట్టిక
గ్రూప్-ఎ
జటు ఆ గె ఓ పా ర.రే
భారత్ 3 3 0 6 3.050
అమెరికా 4 2 2 4 0.788
పాకిస్థాన్ 3 2 1 4 -0.403
నెదర్లాండ్స్ 3 1 2 2 -1.352
నమీబియా 3 0 3 0 -2.443
గ్రూప్-సి
వెస్టిండీస్ 3 3 0 6 1.820
ఇంగ్లండ్ 3 2 1 4 -0.143
స్కాట్లాండ్ 3 1 2 2 0.359
ఇటలీ 2 1 1 2 -0.352
నేపాల్ 3 0 3 0 -1.942
ఇవి కూడా చదవండి..
ఈ ఫొటోల్లోని ఏడు తేడాలను 16 సెకెన్లలో కనిపెట్టండి.. మీ కళ్ల పవర్ సరి చూసుకోండి ..
ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్..