Share News

ఎవరిపైనో వేటు ?

ABN , Publish Date - Feb 24 , 2026 | 01:48 AM

టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌-8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత జట్టు కూర్పుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జట్టులో మార్పులు చేయడానికి మేనేజ్‌మెంట్‌ సిద్ధమవుతున్నట్టుగా...

ఎవరిపైనో వేటు ?

తిలక్‌ వర్మా .. అభిషేక్‌ శర్మా?

ఓపెనర్‌గా సంజూకు చాన్స్‌!

టీమిండియా కూర్పుపై చర్చ

టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌-8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత జట్టు కూర్పుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జట్టులో మార్పులు చేయడానికి మేనేజ్‌మెంట్‌ సిద్ధమవుతున్నట్టుగా సంకేతాలు అందుతున్నాయి. ముఖ్యంగా ఫామ్‌ కోల్పోయి జట్టుకు భారంగా మారిన టాపార్డర్‌ బ్యాటర్లలో ఒకరిపై వేటువేసే ఆలోచనలో ఉన్నట్టు సహాయ కోచ్‌లు టెన్‌ డష్కాటే, సితాన్షు కోటక్‌ మాటలను బట్టి తెలుస్తోంది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌తోపాటు వన్‌డౌన్‌లో వస్తున్న తిలక్‌ వర్మ కూడా లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాటర్లు కావడంతో.. ఈ కాంబినేషన్‌ అంతగా విజయవంతం కావడం లేదన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ క్రమంలో అభిషేక్‌ లేదా తిలక్‌లో ఒకరిపై వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లెఫ్ట్‌-రైట్‌ కాంబినేషన్‌ కోసం వరుసగా విఫలమవుతున్న అభిషేక్‌ స్థానంలో సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు కల్పించవచ్చు. ఇక, తిలక్‌ ఫామ్‌ కూడా మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. అతడి ఆటలో ఆత్మవిశ్వాసం లోపించింది. ఒకవేళ కుడి చేతివాటం బ్యాటర్‌ సంజూతో ఓపెనింగ్‌ చేయిస్తే తిలక్‌ను తప్పించి.. అతడి స్థానంలో అభిషేక్‌ను చాన్సిస్తే ఎలా ఉంటుందనే వ్యూహంపై కూడా జోరుగా చర్చసాగుతోంది. కానీ, శాంసన్‌ వరుస వైఫల్యాల కారణంగానే కిషన్‌ను ఓపెనింగ్‌కు పంపాల్సి వచ్చిందనే విషయాన్ని గమనించాలి. మెగా టోర్నీలో ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ఓపెనర్లలో ఒకరు డకౌట్‌ కావడంతో.. ఆ ఒత్తిడి మిగతా బ్యాటర్లపై పడుతోందని డష్కాటే చెప్పాడు. సూర్యకుమార్‌, దూబేల ఆట నిరాశపర్చినా.. అభిషేక్‌, తిలక్‌ వైఫల్యాలను వెనకేసుకు రాలేమన్నాడు. ఫినిషర్‌గా రింకూకు తగిన అవకాశాలు లభించలేదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో పూర్తిస్థాయిలో సత్తాచాటడమే జట్టుముందున్న ఏకైక లక్ష్యమని పేర్కొన్నాడు. అక్షర్‌కు బదులు సుందర్‌కు అవకాశం కల్పించడం వ్యూహాత్మకమేనని తెలిపాడు. కాగా, అక్షర్‌ను తప్పిస్తున్నట్టు కోచ్‌, కెప్టెన్‌ ముందుగానే సమాచారం ఇచ్చారని కోటక్‌ చెప్పాడు.


88-Sports.jpg

అహం వీడండి - గవాస్కర్‌

భారత ఆటగాళ్లు అహాన్ని పక్కనబెట్టి.. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాలని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ సూచించాడు. అతి విశ్వాసం కొంప ముంచిందన్నాడు. ‘మరో ఆలోచన లేకుండా వచ్చిన వెంటనే బాదేయాలనుకొన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్ల ఉచ్చులోచిక్కి వికెట్లు పారేసుకొన్నారు. అంతకుముందు సఫారీలు ఏదశ నుంచి గట్టెక్కారో గమనించి ఉండాల్సింది. ఎంతో తెలివిగా వ్యవహరించే తిలక్‌ కూడా నిరాశపర్చాడు. అతడు క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకోవాల్సింద’ని గవాస్కర్‌ అన్నాడు. సుందర్‌ స్థానంలో అక్షర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలన్నాడు.

ఇవి కూడా చదవండి..

పాపం.. స్నేహితుడికి సాయం చేయాలనుకున్నాడు.. రూ.7 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నాడు..

Updated Date - Feb 24 , 2026 | 01:48 AM