ఇక్కడా చిత్తే..
ABN , Publish Date - Jul 10 , 2026 | 05:12 AM
ఐర్లాండ్‌తోనే కాదు.. ఇంగ్లండ్ పర్యటనలోనూ టీమిండియాకు చేదు అనుభవమే ఎదురైంది. కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లోనూ మనోళ్ల తీరు మారలేదు. కెప్టెన్ శ్రేయాస్ (49 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో...
ఇంగ్లండ్‌దే నాలుగో టీ20
భారత్ చేజారిన సిరీస్
బ్రిస్టల్: ఐర్లాండ్‌తోనే కాదు.. ఇంగ్లండ్ పర్యటనలోనూ టీమిండియాకు చేదు అనుభవమే ఎదురైంది. కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లోనూ మనోళ్ల తీరు మారలేదు. కెప్టెన్ శ్రేయాస్ (49 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 నాటౌట్) మినహా బ్యాటింగ్‌లో ఎవరూ రాణించకపోగా.. బౌలర్లు అయితే పూర్తిగా తేలిపోయారు. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 నాటౌట్), ఓపెనర్ ఫిల్ సాల్ట్ (42 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 59 నాటౌట్).. బౌలర్లను అలవోకగా ఆడేయడంతో నాలుగో టీ20లో ఇంగ్లండ్ 9 వికెట్లతో ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీ్‌సలో ఇంకో మ్యాచ్ ఉండగానే 3-0 ఆధిక్యం అందుకుంది. ఈ ఫార్మాట్‌లో భారత్‌పై ఇంగ్లండ్‌కిదే తొలి సిరీస్ కావడం విశేషం. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. ఆఖరిదైన ఐదో టీ20 శనివారం జరుగుతుంది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. శివమ్ దూబే (23 బంతుల్లో 2 ఫోర్లతో 22) ఫర్వాలేదనిపించాడు. ఆర్చర్, టంగ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఇంగ్లండ్ 13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 159 పరుగులు చేసి గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా బ్రూక్ నిలిచాడు.
బ్రూక్-సాల్ట్ శతక భాగస్వామ్యం: ఓ మాదిరి ఛేదనలో కెప్టెన్ హ్యారీ బ్రూక్, ఓపెనర్ ఫిల్ సాల్ట్ అదరగొట్టారు. జోస్ బట్లర్ (8) మూడో ఓవర్‌లోనే వెనుదిరగడంతో ఇంగ్లండ్‌కు సైతం తిప్పలు తప్పవేమో అనిపించింది. కానీ బ్రూక్ రాకతో మ్యాచ్ స్వరూపమే మారింది. ఇక ఆ తర్వాత బ్రూక్ హవా సాగింది. మరో 37 బంతులుండగానే ఈ జోడీ మ్యాచ్‌ను ముగించింది. అలాగే రెండో వికెట్‌కు అజేయంగా 146 పరుగులు జత చేయడం విశేషం.
ఆదుకున్న శ్రేయాస్: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఈసారీ శుభారంభం దక్కలేదు. కానీ కెప్టెన్ శ్రేయాస్ నిలకడైన ఆటతీరుతో జట్టు గౌరవప్రదమైన స్కోరందుకుంది. ఆరంభంలో పేసర్ల బౌన్సీ బంతులకు టాపార్డర్ తడబడింది. ఓపెనర్ వైభవ్ (15) మరోసారి పేసర్ ఆర్చర్‌కు దొరికిపోగా, ఇషాన్ (4)ను టంగ్ అవుట్ చేశాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 44/2 స్కోరుతో నిలిచింది. ఏడో ఓవర్‌లో ఓపెనర్ అభిషేక్ (16)కూడా వెనుదిరగడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. ఈ దశలో శ్రేయాస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. బౌలర్లను స్వేచ్ఛగా ఆడుతూ ముందుకు సాగాడు. అతడికి దూబే సహకరించడంతో నాలుగో వికెట్‌కు 53 పరుగులు జత చేరాయి. స్వల్ప వ్యవధిలో దూబే, తిలక్ (11) వెనుదిరిగినా శ్రేయాస్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 18వ ఓవర్‌లో శ్రేయాస్ 6,4,6తో 20 పరుగులు రాబట్టడంతో స్కోరు 150కి చేరింది. కానీ చివరి రెండు ఓవర్లలో పేసర్లు కర్రాన్, ఆర్చర్ కేవలం 8 పరుగులే ఇచ్చి భారత్‌ను కట్టడి చేశారు.
స్కోరుబోర్డు
భారత్: వైభవ్ (సి) కర్రాన్ (బి) ఆర్చర్ 15, అభిషేక్ (సి అండ్ బి) రషీద్ 16, ఇషాన్ (సి) కర్రాన్ (బి) టంగ్ 4, శ్రేయాస్ (నాటౌట్) 80, శివమ్ దూబే (సి) బాంటన్ (బి) జాక్స్ 22, తిలక్ (సి) రేహన్ (బి) టంగ్ 11, వాషింగ్టన్ (సి) రషీద్ (బి) ఆర్చర్ 5, అక్షర్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 158/7; వికెట్ల పతనం: 1-23, 2-33, 3-48, 4-101, 5-130, 6-157, 7-158; బౌలింగ్: ఆర్చర్ 4-0-20-2, టంగ్ 4-0-36-2, జాక్స్ 4-0-28-1, కర్రాన్ 4-0-24-0, రషీద్ 4-0-49-1.
ఇంగ్లండ్: సాల్ట్ (నాటౌట్) 59, బట్లర్ (సి) ఇషాన్ (బి) అర్ష్‌దీప్ 8, బ్రూక్ (నాటౌట్) 79; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 13.5 ఓవర్లలో 159/1; వికెట్ల పతనం: 1-13; బౌలింగ్: అర్ష్‌దీప్ 3.5-1-41-1, ప్రసిద్ధ్ 3-0-26-0, ప్రిన్స్ 3-0-28-0, అక్షర్ 2-0-24-0, వాషింగ్టన్ 1-0-19-0, శివమ్ దూబే 1-0-15-0.
ఇవీ చదవండి:
గొప్ప కెప్టెన్ అవుతాడు.. శ్రేయస్‌కు మద్దతుగా నిలిచిన సోదరి శ్రేష్ఠ