భళా..బంగ్లా
ABN , Publish Date - Aug 17 , 2026 | 05:47 AM
దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ జట్టు చరిత్ర సృష్టించింది. అంచనాలకు మించిన ఆటతీరుతో తమ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిరస్మరణీయ...
ఆస్ట్రేలియా గడ్డపై ‘తొలి’ టెస్టు విజయం
డార్విన్: దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ జట్టు చరిత్ర సృష్టించింది. అంచనాలకు మించిన ఆటతీరుతో తమ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిరస్మరణీయ విజయాన్నందుకుంది. అత్యంత పటిష్ఠమైన కంగారూలపై తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో భారీ గెలుపు సాధించింది. ఆస్ట్రేలియాలో బంగ్లాకిదే తొలి విజయం కావడం విశేషం. 2003లో తొలిసారి ఇక్కడ పర్యటించిన బంగ్లా 0-2తో ఓడింది. అటు పూర్తి స్థాయి ఆటగాళ్లతో బరిలోకి దిగిన ఆసీస్ ఆదివారం నాలుగో రోజే మ్యాచ్‌ను అప్పగించడం గమనార్హం. ముందుగా తమ ఓవర్‌నైట్ స్కోరు 161/4తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీ్‌సను స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో దెబ్బతీశాడు. చివరకు కామెరూన్ గ్రీన్ (104) శతకం సహాయంతో 284 పరుగులు చేయగలిగింది. హసన్ మహమూద్‌కు 3 వికెట్లు దక్కాయి. ఇక ఆసీస్ విధించిన 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లా 14.2 ఓవర్లలో వికెట్ నష్టానికి అన్నే పరుగులతో చేధించింది. మోమినుల్ హక్ (30 నాటౌట్), షాద్‌మన్ ఇస్లాం (25 నాటౌట్) రాణించారు. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 198, బంగ్లా 426 పరుగులు సాధించాయి.
ఆసీస్ గడ్డపై తక్కువ టెస్టుల్లోనే (3) నెగ్గిన జట్టుగా బంగ్లాదేశ్. ఓవరాల్‌గా ఆసీస్‌తో ఆడిన ఏడు టెస్టుల్లో బంగ్లాకిది రెండో విజయం.
భారత్‌తో కాకుండా మరో ఆసియా జట్టు చేతిలో స్వదేశంలో ఓడడం 1995 తర్వాత ఆసీ్‌సకిదే తొలిసారి.
గ్రెగ్ చాపెల్ తర్వాత స్వదేశంలో రెండు ఆసియా జట్ల (భారత్, బంగ్లా) చేతిలో ఓడిన ఆసీస్ కెప్టెన్‌గా కమిన్స్.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియాపై గెలుపు .. స్పందించిన బంగ్లా కెప్టెన్ నజ్ముల్
సిన్సినాటి ఓపెన్‌లో జకోవిచ్‌కు షాక్