ప్రీక్వార్టర్స్‌కు గాయత్రి జోడీ
ABN , Publish Date - Aug 19 , 2026 | 05:37 AM
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేశాడు. అయితే, ప్రత్యర్థిపై గెలిచే క్రమంలో సేన్ మూడు గేమ్‌ల పాటు పోరాడాడు. ఇక, అర్జున పురస్కారానికి...
లక్ష్యసేన్, ఉన్నతి ముందంజ
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేశాడు. అయితే, ప్రత్యర్థిపై గెలిచే క్రమంలో సేన్ మూడు గేమ్‌ల పాటు పోరాడాడు. ఇక, అర్జున పురస్కారానికి ఎంపికైన ఆనందంలో ఉన్న మహిళల డబుల్స్ స్టార్ జోడీ పుల్లెల గాయత్రీ గోపీచంద్/ట్రీసా జాలీ జోడీ వరుసగా రెండో విజయంతో ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సేన్ 16-21, 21-9, 21-4తో ఆస్ట్రియా షట్లర్ కొలిన్స్ వాలెంటైన్ ఫిలిమోన్‌ను 45 నిమిషాల్లో ఓడించాడు. సేన్ రెండో రౌండ్లో అమెరికాకు చెందిన గారెట్ టాన్‌తో తలపడనున్నాడు. లక్ష్యసేన్ 2021 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో అన్‌సీడెడ్ జంట గాయత్రి/ట్రీసా జాలీ 21-15, 21-12తో అమెరికాకు చెందిన 16వ సీడ్ జోడీ లారెన్ లామ్/అలిసన్ కున్హె లీకి షాకిచ్చింది. ఆరంభం నుంచే దూకుడుగా చెలరేగిన భారత ద్వయం కేవలం 38 నిమిషాల్లోనే ప్రత్యర్థిని ఇంటిబాట పట్టించింది. కాగా, మహిళల డబుల్స్‌లో భారత్‌కే చెందిన మరో జోడీ కవిప్రియ సెల్వమ్/సిమ్రన్ సింఘీ పోరాటం ముగిసింది. బల్గేరియాకు చెందిన 9వ సీడ్ గాబ్రియెలా స్టొయేవా/స్టెఫానీ స్టొయేవా జోడీ 21-7, 21-14తో కవిప్రియ/సిమ్రన్ ద్వయంపై గెలిచింది. మహిళల సింగిల్స్‌లో వర్ధమాన షట్లర్ ఉన్నతి హుడా శుభారంభం చేసింది. ఉన్నతి 22-20, 21-16తో తెట్ తార్ తుజార్ (మయన్మార్)పై గెలిచి రెండో రౌండ్ చేరింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. రోహన్ కపూర్/రుత్వికా శివాని జంట 22-20, 19-21, 17-21తో కెనడా జోడీ జొనాథన్ బింగ్/ క్రిస్టల్ లాయ్ చేతిలో, అశిత్ సూర్య/అమృత ప్రముతేశ్ ద్వయం 21-16, 29-30, 22-24తో టర్కీ జంట ఎమ్రె సోన్మెజ్/యాసెమెన్ బెక్టాస్ చేతిలో పోరాడి ఓడి టోర్నీ నుంచి వెనుదిరిగారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు
మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం