షూటర్ల గర్జన
ABN , Publish Date - Sep 22 , 2026 | 05:57 AM
ఆసియాడ్‌లో భారత గన్స్ గర్జన కొనసాగుతుండగా.. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో చారిత్రక పతకం లభించినా.. ఆనందం కంటే గుండె కోతనే మిగిల్చింది. ఆటలకు రెండో రోజైన సోమవారం భారత్ రెండు...
షూటింగ్‌లో హిమాన్షు, రుద్రాంక్ష్, పార్థ్ పతక జోరు
రెండో రోజు భారత్‌కు నాలుగు పతకాలు
రెండు రజతాలు, రెండు కాంస్యాలు
మార్షల్ ఆర్ట్స్‌లో సుచిక కంచు మోత
ఆసియా క్రీడల రెండో రోజు భారత్ స్వర్ణం కోసం ఎదురుచూడగా.. షూటర్లు రెండు రజతాలు సహా మూడు పతకాలు అందించారు. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో సుచిక సెమీ్‌సలో వివాదాస్పద రీతిలో ఓడినా.. కాంస్యంతో చరిత్ర సృష్టించింది. మొత్తంగా నాలుగు రజత, రెండు కాంస్యాలు సాధించిన భారత్ ఆరు పతకాలతో పట్టికలో 12వ స్థానంలో ఉంది.
నగోయ: ఆసియాడ్‌లో భారత గన్స్ గర్జన కొనసాగుతుండగా.. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో చారిత్రక పతకం లభించినా.. ఆనందం కంటే గుండె కోతనే మిగిల్చింది. ఆటలకు రెండో రోజైన సోమవారం భారత్ రెండు రజతాలతోపాటు రెండు కాంస్యాలు సాధించింది. షూటింగ్ 10 మీ. ఎయిర్ రైఫిల్‌లో హిమాన్షు ధిల్లాన్, వరల్డ్ చాంపియన్ రుద్రాంక్ష్ పాటిల్ రజత, కాంస్యాలు దక్కించుకోగా.. పార్థ్ మానేతో కలసి టీమ్ సిల్వర్ కొల్లగొట్టారు. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ)లో సుచికా తరియల్ కంచు పతకానికే పరిమితమైంది.
షూటింగ్‌లో మూడు పతకాలు..
షూటింగ్‌లో భారత పతక జోరును కొనసాగిస్తోంది. పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్‌లో హోరాహోరీగా సాగిన పోరులో ఒక దశలో స్వర్ణం పై గురిపెట్టిన రుద్రాంక్ష్ (230.9 పాయింట్లు) చివరకు మూడో స్థానానికి పడిపోగా.. హిమాన్షు (252.4) అనూహ్యంగా రెండో స్థానంలో నిలిచాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో పాటిల్ 631.8 పాయింట్లతో మూడో స్థానంలో, హిమాన్షు 630 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. కాగా, మరో భారత షూటర్ పార్థ్ రాకేష్ మానె 628.3 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచి ఎలిమినేట్ అయ్యాడు. ఫైనల్లో పారిస్ ఒలింపిక్ చాంప్ షెంగ్ లిహావ్ (చైనా), రుద్రాంక్ష్, హిమాన్షు మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా సాగింది. ఒక దశలో షెంగ్‌కు రుద్రాంక్ష్ గట్టిపోటీ ఇచ్చాడు. అయితే, టాప్-3 ఖరారైన తర్వాత.. కీలక షాట్‌లో పాటిల్ 9.7 షూట్ చేయడంతో కాంస్యానికే పరిమతమయ్యాడు. 254.2 పాయింట్లతో ఆసియా రికార్డు సృష్టించిన షెంగ్ అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం నెగ్గగా.. హిమాన్షు రజతం సాధించాడు. ఇక, 10 మీ. ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో రుద్రాంక్ష్, పార్థ్ మానె, హిమాన్షుల త్రయం 1890.1 పాయింట్లతో రజతం దక్కించుకోగా.. చైనా జట్టు 1899 పాయింట్లతో వరల్డ్ రికార్డు స్వర్ణం, కొరియా 1884.2 పాయుంట్లతో కాంస్యం సాధించాయి.

అయ్యో.. సుచిక
మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ)లో ఆసియాడ్ పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా సుచిక రికార్డులకెక్కింది. మహిళల 60 కిలోల విభాగంలో వివాదాస్పద రీతిలో జరిగిన సెమీ్‌సలో సుచిక కాంస్యం దక్కించుకొంది. సింగపూర్ ఫైటర్ హుయ్ హూన్ టియోతో హోరాహోరీగా జరిగిన సెమీ్‌సలో సుచిక 0-2తో పరాజయం పాలైంది. తొలి రెండు రౌండ్లలో ఇద్దరూ హోరాహోరీగా తలపడడంతో టై అయింది. దీంతో బౌట్ ఫలితం అదనపు రౌండ్‌కు దారి తీసింది. ఇందులో సింగపూర్ అథ్లెట్ గెలిచినట్టు ప్రకటించగానే.. భారత్ సవాల్ చేసింది. సమీక్షించిన రెఫరీలు మ్యాచ్‌ను టైగా ప్రకటించారు. అయితే, ఎంఎంఏ నిబంధనల ప్రకారం అథ్లెట్ల బరువు ఆధారంగా విజేతను ప్రకటించారు. తరియల్ కంటే హూన్ టియో 700 గ్రాములు తక్కువ బరువు ఉండడంతో.. ఫైనల్‌కు చేరుకొంది. ఆ తర్వాత అధికారులు హూన్ గెలిచినట్టు అధికారికంగా ధ్రువీకరించారు. జీర్ణించుకోలేకపోయిన సుచిక.. ఏడుస్తూ మ్యా ట్‌పై కుప్పకూలింది. కాగా, నిబంధనల ప్రకారం సెమీ స్‌లో ఓడినా కాంస్యం సొంతం చేసుకొంది.
ఆసియాడ్‌లో నేటి భారత్ షెడ్యూల్
ఈక్వెస్ట్రియన్: ఆశిష్ లిమాయె, ఫవాద్ మీర్జా, అర్జాన్ నగ్రా (ఉ. 5.45); సెపక్‌తక్రా: పురుషుల టీమ్ రెగూ గ్రూప్ బి మ్యాచ్ - భారత్ ్ఠ మలేసియా (ఉ. 5.30); బ్యాడ్మింటన్: మహిళల టీమ్ క్వార్టర్‌ఫైనల్-భారత్ ్ఠ జపాన్ (ఉ. 6), పురుషుల టీమ్ క్వార్టర్‌ఫైనల్-భారత్ఠ్‌జపాన్ (ఉ. 11.30); షూటింగ్: 10 మీ. ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్-పార్థ్ రాకేశ్, ఎలవెనిల్ (ఉ. 6.15), పురుషులు, మహిళల స్కీట్ క్వాలిఫికేషన్స్-అనంత్‌జీత్, భావ్‌తేజ్, మైరాజ్, పరినాజ్, రైజా, మహేశ్వరి (ఉ. 6.30); స్విమ్మింగ్: పురుషుల 1500 మీ. ఫ్రీస్టయిల్-ఆర్యన్ (ఉ. 7.29), పురుషుల 4్ఠ100 మీ. మెడ్లే రిలే హీట్స్-రోహిత్, ధనుష్, రిషభ్, ఆకాశ్ (ఉ. 8.05); టేబుల్ టెన్నిస్: మహిళల టీమ్ రౌండ్ 16-భారత్ఠ్‌థాయ్‌లాండ్ (ఉ. 6.30), పురుషుల రౌండ్ 16-భారత్ఠ్‌థాయ్‌లాండ్ (ఉ. 9);ఉషు: మహిళల నాన్‌కాన్, నన్‌దావో ఫైనల్-హన్జాబామ్ (ఉ. 6.29), మహిళల సాండా (60 కి.) క్వార్టర్స్-రోషిబినా (మ. 2.30), పురుషుల సాండా (56 కి.) క్వార్టర్స్- ఆర్యన్ (మ. 2.30); బాక్సింగ్: మహిళల రౌండ్ 32- సాక్షి (51 కి) (ఉ. 8.30), పురుషుల రౌండ్ 32- జాదుమణి సింగ్ (55 కి.) (మ. 1.30); కరాటే: పురుషుల కుమిటి (84 కి) సెమీస్- చేతన్ (ఉ.7.35), మహిళల కుమిటి (55 కి) ప్రీక్వార్టర్స్- అలిషా (ఉ.9.20); కబడ్డీ: పురుషుల జట్టు గ్రూప్ ఎ మ్యాచ్- భారత్ ్ఠ దక్షిణ కొరియా (ఉ. 7.15); క్రికెట్: మహిళల ఫైనల్- భారత్ ్ఠ శ్రీలంక (ఉ. 10.30); హాకీ: పురుషుల పూల్ ఎ మ్యాచ్-భారత్ ్ఠ శ్రీలంక (మ. 3.30); జిమ్నాస్టిక్స్: మహిళల వాల్ట్ క్వాలిఫికేషన్- ప్రణతి(ఉ.10.30); ఫెన్సింగ్: పురుషుల ఫాయిల్ వ్యక్తిగత విభాగం- సనాసమ్ (ఉ. 6.30), మహిళల ఎపీ వ్యక్తిగత విభాగం-మిత్వా (ఉ. 8.15); సాఫ్ట్ టెన్నిస్: మహిళల సింగిల్స్ - ఆద్య (ఉ. 5.30), జే మీనా (ఉ. 7), పురుషుల సింగిల్స్-ఆర్యన్.
ఆసియాడ్ పతకాల పట్టిక
దేశం స్వ ర కాం మొ
1 చైనా 23 10 5 38
2 జపాన్ 8 12 12 32
3 ద. కొరియా 5 3 15 23
4 కజకిస్థాన్ 4 1 3 8
5 థాయ్‌లాండ్ 3 1 0 4
12 భారత్ 0 4 2 6
గమనిక- స్వ: స్వర్ణం; ర: రజతం
కాం: కాంస్యం; మొ: మొత్తం
ఇవి కూడా చదవండి:
ఆసియా గేమ్స్: కుమారుడి టీమ్ ఓటమి.. మాధవన్ రియాక్షన్ ఇదే!
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. రిజర్వ్ ఓపెనర్ రేసులో సాయి సుదర్శన్