షూటింగ్‌లో రజతం, సుచికకు పతకం ఖాయం.. ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట షురూ..
ABN , Publish Date - Sep 20 , 2026 | 10:24 AM
జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు-2026లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో ఎలవెనిల్ వలరివన్, సోనం మాస్కర్, విదర్శ వినోద్ రజత పతకం సాధించారు.
ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు-2026లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో ఎలవెనిల్ వలరివన్, సోనం మాస్కర్, విదర్శ వినోద్ రజత పతకం సాధించారు. మరోవైపు మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA)లో సుచికా తరివాల్ సెమీఫైనల్‌కు చేరుకుని భారత్‌కు మరో పతకం ఖాయం చేసింది (India Asian Games live).
భారత్‌కు తొలి పతకం షూటింగ్ నుంచి వచ్చింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో ఎలవెనిల్ వలరివన్, సోనం మాస్కర్, విదర్శ వినోద్‌తో కూడిన భారత బృందం మొత్తం 1,898.0 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. దీంతో భారత్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. చైనా 1,904.2 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించింది. ఆతిథ్య జపాన్ 1,897.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. చైనా స్కోరు ప్రపంచ రికార్డుగా నమోదైంది.
టీమ్ ఈవెంట్‌లో రజతం సాధించిన భారత షూటర్లలో ఎలవెనిల్ వలరివన్ 633.5 పాయింట్లతో వ్యక్తిగత ఫైనల్‌కు అర్హత సాధించింది. సోనం మాస్కర్ కూడా వ్యక్తిగత ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. దీంతో షూటింగ్‌లో భారత్ మరో పతకం సాధించే అవకాశం కనబడుతోంది (Asian Games 2026 Day 1).
మహిళల సాంప్రదాయ 60 కిలోల ఎంఎంఏ విభాగంలో సుచికా తరివాల్, మంగోలియాకు చెందిన ఆల్టాంచిమెగ్ బైగాల్మాను 2-0తో ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఆసియా క్రీడల ఎంఎంఏ చరిత్రలో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. క్వార్టర్‌ఫైనల్‌లో ప్రత్యర్థి నుంచి ఒత్తిడి ఎదురైనప్పటికీ సుచిక కీలక సమయంలో పట్టు సాధించి పోరును తనకు అనుకూలంగా మలుచుకుంది. సెమీఫైనల్ ఫలితాన్ని బట్టి ఆమె రజతం లేదా స్వర్ణం కోసం పోటీ చేసే అవకాశం ఉంటుంది (Aichi Nagoya Asian Games).
ఆసియా క్రీడల్లో ఆదివారం భారత్‌కు క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, వుషు తదితర క్రీడల్లో పోటీలు ఉన్నాయి. మహిళల క్రికెట్‌లో భారత్-బంగ్లాదేశ్ సెమీఫైనల్ కూడా జరగనుంది. వుషులో అపర్ణ మహిళల 52 కిలోల విభాగంలో, విక్రాంత్ బలియాన్ పురుషుల 75 కిలోల విభాగంలో బరిలోకి దిగుతున్నారు.
ఇవి కూడా చదవండి..
రియాద్ విమానాశ్రయం సమీపంలో మంటలు.. సౌదీలో కీలక ప్రాంతాలపై హౌతీల దాడులు..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..