Share News

ప్రతిభకు పట్టం

ABN , Publish Date - Aug 19 , 2026 | 05:48 AM

అంతర్జాతీయ వేదికపై అలరిస్తున్న క్రీడాకారుల ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం క్రీడా అవార్డుల విజేతలను మంగళవారం ప్రకటించింది. 2025 క్రీడా పురస్కారాల్లో భాగంగా మొత్తం 17 మందిని అర్జున అవార్డుకు ఎంపిక చేసింది...

ప్రతిభకు పట్టం

తెలుగు తేజాలు గాయత్రి, ధనుష్‌కు ‘అర్జున’

చెస్‌ చాంపియన్‌ దివ్య సహా 17 మందికి క్రీడా పురస్కారాలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై అలరిస్తున్న క్రీడాకారుల ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం క్రీడా అవార్డుల విజేతలను మంగళవారం ప్రకటించింది. 2025 క్రీడా పురస్కారాల్లో భాగంగా మొత్తం 17 మందిని అర్జున అవార్డుకు ఎంపిక చేసింది. కాగా, అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్నకు మాత్రం ఎవరినీ ఎంపిక చేయలేదు. 2024 అవార్డుల్లో ఏకంగా నలుగురికి ఖేల్‌రత్నను ప్రకటించగా.. ఈసారి మాత్రం ఒక్కరికి కూడా అవకాశమివ్వకపోవడం గమనార్హం. చివరిగా ఖేల్‌రత్నను 2014లో ఎవరికీ ప్రకటించలేదు. ఆ తర్వాత మళ్లీ ఈ అవార్డును ఇవ్వకపోవడం ఈసారే. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్‌కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ ప్యానెల్‌.. ఖేల్‌రత్న కోసం హాకీ స్టార్‌ హార్దిక్‌ సింగ్‌ పేరును పరిశీలించినా, ఆఖర్లో అతడిని రేసు నుంచి తప్పించారు. ఇక, ఈసారి అర్జునకు ఎంపికైన అవార్డు విజేతల్లో తెలుగు షట్లర్‌ పుల్లెల గాయత్రీ గోపీచంద్‌, హైదరాబాద్‌కే చెందిన బధిర షూటర్‌ ధనుష్‌ శ్రీకాంత్‌ ఉండడం విశేషం. బ్యాడ్మింటన్‌లో అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్న గాయత్రితో పాటు డబుల్స్‌లో ఆమె భాగస్వామి అయిన ట్రీసా జాలీకి కూడా అర్జున అవార్డు లభించింది. చెస్‌లో గతేడాది మహిళల ప్రపంచకప్‌ గెలిచి చరిత్ర సృష్టించిన దివ్యా దేశ్‌ముఖ్‌, రెండేళ్ల క్రితం చెస్‌ ఒలింపియాడ్‌ గెలిచిన భారత పురుషుల జట్టులో సభ్యుడైన గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ గుజరాతీ, 2023 ఆసియా క్రీడల డెకాథ్లాన్‌లో చరిత్రాత్మక రజతం గెలిచిన హైజంపర్‌ తేజస్విన్‌ శంకర్‌లాంటి స్టార్లు ఈసారి అర్జున గౌరవం అందుకోనున్న వారిలో ఉన్నారు. పారా క్రీడల నుంచి ఈసారి పారా క్లబ్‌ త్రోయర్‌ ఏక్తా భ్యాన్‌, షూటర్‌ రుద్రాంశ్‌ ఖండేల్‌వాల్‌కు అర్జున జాబితాలో చోటు దక్కింది. 2024లో రికార్డుస్థాయిలో మొత్తం 32 మందికి అర్జున ప్రకటిస్తే, వారిలో పారా స్పోర్ట్స్‌ నుంచే 17 మంది ఉన్నారు. సెలెక్షన్‌ కమిటీ ఈమారు మొత్తం 24 మంది క్రీడాకారులను అర్జున అవార్డుకు ప్రతిపాదిస్తే, క్రీడాశాఖ 17 పేర్లకే ఆమోదం తెలిపింది. అర్హులైన క్రీడాకారులకు మాత్రమే అవార్డులు దక్కాలన్న ఉద్దేశంతో ఈ జాబితాను కట్టుదిట్టంగా స్ర్కీనింగ్‌ చేశారు. దీంతో అవార్డుల ప్రకటన కూడా దాదాపు ఆరు నెలలు ఆలస్యమైంది. అంతేకాదు.. వరుసగా రెండో ఏడాది కూడా క్రికెటర్‌కు అర్జున జాబితాలో చోటు దక్కలేదు. అర్జున విజేతలకు జ్ఞాపికతో పాటు రూ. 15 లక్షల నగదును అందజేయనున్నారు. కాగా, లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ (జీవన సాఫల్య) పురస్కారాన్ని మాజీ ఫుట్‌బాలర్‌, 1962 ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జట్టులో సభ్యుడైన అరుమైనాయగంకు ప్రకటించారు. కోచ్‌లు చోటేలాల్‌ యాదవ్‌, పర్వీర్‌ సింగ్‌, నేహా నందకుమార్‌ చవాన్‌లకు ద్రోణాచార్య అవార్డులు దక్కగా.. ద్రోణాచార్య జీవన సాఫల్య పురస్కారాలకు ధర్మేంద్ర యాదవ్‌, వీరేందర్‌ కుమార్‌ ఎంపికయ్యారు. జాతీయ క్రీడా దినోత్సవమైన ఈనెల 29న విజేతలకు అవార్డులను అందజేసే అవకాశముంది.


0-Business.jpg

ఈసారి ఖేల్‌రత్నకు నో చాన్స్‌

అర్జున అవార్డు గ్రహీతల జాబితా

పుల్లెల గాయత్రీ గోపీచంద్‌, ట్రీసా జాలీ (బ్యాడ్మింటన్‌), ధనుష్‌ శ్రీకాంత్‌ (బధిర షూటింగ్‌), తేజస్విన్‌ శంకర్‌, మహ్మద్‌ అజ్మల్‌, ప్రియాంక గోస్వామి (అథ్లెటిక్స్‌), నరేందర్‌ బేనీవాల్‌ (బాక్సింగ్‌), దివ్యా దేశ్‌ముఖ్‌, విదిత్‌ గుజరాతి (చెస్‌), లాల్‌రేమ్సియామి, రాజ్‌కుమార్‌ పాల్‌ (హాకీ), పూజ, సుర్జీత్‌ (కబడ్డీ), రుద్రాంశ్‌ ఖండేల్‌వాల్‌ (పారా షూటింగ్‌), ఏక్తా భ్యాన్‌ (పారా అథ్లెటిక్స్‌), అర్వింద్‌ సింగ్‌ (రోయింగ్‌), అఖిల్‌ షెరాన్‌ (షూటింగ్‌).

అర్జున అవార్డు (లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌): అరుమైనాయగమ్‌ (ఫుట్‌బాల్‌). ద్రోణాచార్య అవార్డు: పర్వీర్‌ సింగ్‌ (అథ్లెటిక్స్‌), చోటేలాల్‌ యాదవ్‌ (బాక్సింగ్‌), నేహా నందకుమార్‌ చవాన్‌ (షూటింగ్‌). ద్రోణాచార్య (లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌): ధర్మేంద్రసింగ్‌ యాదవ్‌ (బాక్సింగ్‌), వీరేందర్‌ కుమార్‌ (రెజ్లింగ్‌).

సీఎం రేవంత్‌ అభినందనలు

గాయత్రీ గోపీచంద్‌, ధనుష్‌ శ్రీకాంత్‌లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. అర్జున అవార్డులకు ఎంపికైన గాయత్రి, ధను్‌షలు తెలంగాణకు, దేశానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. వారు కనబర్చిన అంకితభావం, పట్టుదల, కృషి యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. భవిష్యత్‌లో వారు మరిన్ని విజయాలు సాధించి, ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు

మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం

Updated Date - Aug 19 , 2026 | 05:50 AM