Share News

అభిషేక్‌ తుఫాన్‌

ABN , Publish Date - Oct 28 , 2026 | 01:18 AM

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌ హ్యాట్రిక్‌ కొట్టింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (38 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 113) మెరుపు ఆటతీరుతో పలు రికార్డులు బద్దలైన వేళ.. మంగళవారం జరిగిన మూడో టీ20లో భారత్‌ 6 వికెట్లతో ఘనవిజయం సాధించింది.

అభిషేక్‌ తుఫాన్‌
Abhishek Sharma

  • 35 బంతుల్లోనే శతకంతో విజృంభణ

  • కివీ‌స్‌పై 6 వికెట్లతో భారత్‌ విజయం

  • 3-0తో సిరీస్‌ కైవసం

  • 199 ఛేదన.. 13.2 ఓవర్లలోనే ఖతం

  • అదరగొట్టిన వైభవ్‌

    Untitled-1 copy.jpg

తొలి 2.2 ఓవర్లలో 50.. 5 ఓవర్లలోనే 100 పరుగులు.. గల్లీ క్రికెట్‌ స్కోర్లు కావివి. టీ20 వరల్డ్‌ చాంపియన్‌ భారత జట్టు.. న్యూజిలాండ్‌పై సాగించిన ఊచకోత. ఇందుకు కారణం.. డాషింగ్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ. రాకెట్‌ వేగంతో పోటీ పడిన అతడి బ్యాటింగ్‌ విన్యాసాలకు స్టేడియం హోరెత్తిపోయింది. చూస్తున్నది మ్యాచా.. లేక హైలైట్సా అన్నట్టుగా సాగిన అతడి విజృంభణకు 15 బంతుల్లో హాఫ్‌ సెంచరీ.. 35 బంతుల్లోనే శతకం కూడా పూర్తయ్యింది. అంతేనా.. బౌలర్లను అభి‘షేక్‌’ చేసిన తీరుకు భారత జట్టు కేవలం 80 బంతుల్లోనే 199 పరుగులను ఛేదించి ఔరా.. అనిపించింది. వరుసగా మూడో విజయంతో ఐదు టీ20ల సిరీ‌స్‌ను శ్రేయాస్‌ సేన సొంతం చేసుకుంది.


వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌ హ్యాట్రిక్‌ కొట్టింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (38 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 113) మెరుపు ఆటతీరుతో పలు రికార్డులు బద్దలైన వేళ.. మంగళవారం జరిగిన మూడో టీ20లో భారత్‌ 6 వికెట్లతో ఘనవిజయం సాధించింది. దీంతో మరో రెండు మ్యాచ్‌లుండగానే 3-0తో సిరీస్‌ను కూడా భారత్‌ దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. డారిల్‌ మిచెల్‌ (89 నాటౌట్‌), ఫిన్‌ ఆలెన్‌ (40), బెవాన్‌ జాకబ్స్‌ (39 నాటౌట్‌) రాణించారు. అర్ష్‌దీప్‌, అక్షర్‌, నితీశ్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ఛేదనలో భారత్‌ 13.2 ఓవర్లలోనే 199/4 స్కోరు చేసిగెలిచింది. మరో ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 45) మెరుపు ఆటతో ఆకట్టుకున్నాడు. జేమిసన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా అభిషేక్‌ శర్మ నిలిచాడు.


బౌలర్ల కట్టడి: టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేపట్టిన కివీస్‌ తొలి పది ఓవర్లలో 100/2 పరుగులతో పటిష్టంగానే కనిపించింది. ఓపెనర్‌ ఫిన్‌ ఆలెన్‌, డారిల్‌ మిచెల్‌ రెండో వికెట్‌కు 86 పరుగులు జోడించారు. కానీ ఆ తర్వాత భారత బౌలర్లు పుంజుకుని పరుగులను కట్టడి చేశారు. కివీస్‌ వికెట్లు కాపాడుకున్నా 200 మార్క్‌ను చేరుకోలేకపోయింది. మిచెల్‌, జాకబ్‌ చివరి వరకు నిలిచారు. అయితే వారి ఆటలో వేగం కరువైంది. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 75 పరుగులు జత చేసింది.


Untitled-1 copy.jpg

ఓపెనర్ల దంచుడు: ఛేదనలో భారత ఓపెనర్లు అభిషేక్‌, వైభవ్‌ కివీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలి ఓవర్‌లోనే వైభవ్‌ 4,6 అభిషేక్‌ 6తో ఏకంగా 26 రన్స్‌ సమకూరాయి. ఇక ఆ తర్వాత అభిషేక్‌ బాదుడు మొదలైంది. రెండో ఓవర్‌లో 6,6,4.. మూడో ఓవర్‌లో 4,6,4తో పరుగుల వరద పారించాడు. ఇక జేమిసన్‌ ఓవర్‌లో 6,6,4తో 15 బంతుల్లోనే ఫిఫ్టీని కూడా పూర్తి చేశాడు. ఈ దూకుడుకు 5 ఓవర్లలోనే జట్టు 100 రన్స్‌తో సగం ఛేదనను పూర్తి చేసింది. అటు డఫీ ఓవర్‌లో వైభవ్‌ 4,4,4,6 కొట్టడంతో భారత్‌ పవర్‌ప్లేను 118 రన్స్‌తో పూర్తి చేసింది. ఎనిమిదో ఓవర్‌లో వైభవ్‌ను ఫిషర్‌ అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 42 బంతుల్లోనే 133 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. పదో ఓవర్‌లో ఫోర్‌తో 35 బంతుల్లో శతకం పూర్తి చేసిన అభిషేక్‌ తన ట్రేడ్‌మార్క్‌ ధ్యానముద్రతో సంబరాలు చేసుకున్నాడు. ఆ వెంట నే జేమిసన్‌ బౌలింగ్‌లో మరో 6,4 బాది ఫిలిప్స్‌ క్యాచ్‌తో వెనుదిరిగాడు. అప్పటికి పది ఓవర్లలో గెలుపునకు మరో 21 రన్స్‌ మాత్రమే కావాల్సి ఉండగా, భారత్‌కు ఇబ్బంది లేకపోయింది. శ్రేయాస్‌ (5), శాంసన్‌ (18)ల వికెట్లు కోల్పోయినా, 13.2 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది.


రికార్డుల సునామీ

అభిషేక్‌, వైభవ్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో టీ20 పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు (118) చేసిన జట్టుగా భారత్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అలాగే ఈ మ్యాచ్‌లో టీ20ల్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ (2.2 ఓవర్లలో).. ఫాస్టెస్ట్‌ హండ్రెడ్‌ (5 ఓవర్లలో) రికార్డు కూడా చేసింది.

టీ20ల్లో అత్యధిక రన్‌రేట్‌ (18.13)తో తొలి వికెట్‌కు 100+ భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా అభిషేక్‌-వైభవ్‌ ప్రపంచ రికార్డు. ఈ క్రమంలో గతేడాది దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్‌ జోడీ బట్లర్‌, సాల్ట్‌ (16.08) నెలకొల్పిన రికార్డు బద్దలైంది.

భారత్‌ నుంచి టీ20 ఫార్మాట్‌లో ఎక్కువ శతకాలు (11) బాదిన బ్యాటర్‌గా విరాట్‌ కోహ్లీ (10)ని దాటేసిన అభిషేక్‌. ఇక, అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం అభిషేక్‌కు ఇది నాలుగో సెంచరీ.


యువీ రికార్డు అంత సులువు కాదు

ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసిన అభిషేక్‌ తన మెంటార్‌ యువరాజ్‌ సింగ్‌ రికార్డును అందుకోవడం అంత సులువు కాదంటున్నాడు. 2007లో ఇంగ్లండ్‌పై యువీ 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. శాశ్వత సభ్య దేశాలపై ఇప్పటికీ ఇది రికార్డుగానే ఉంది. ‘అప్పట్లో యువీ ఎలాంటి క్రికెట్‌ ఆడేవాడో అర్థం కావడం లేదు. 12 బంతుల్లో 50 రన్స్‌ రికార్డును అధిగమించడం అంత సులువు కాదు. అలాంటి అద్భుతం ఒక్కసారే జరుగుతుంది’ అని అభిషేక్‌ అన్నాడు. మరోవైపు 30 లేక 35 బంతుల్లో శతకం బాదడం తనవల్ల అయ్యే పని కాదంటూ తన శిష్యుడిని యువరాజ్‌ ప్రశంసించాడు.


స్కోరుబోర్డు

న్యూజిలాండ్‌: సైఫర్ట్‌ (సి) అక్షర్‌ (బి) అర్ష్‌దీప్‌ 2, ఆలెన్‌ (సి) నమన్‌ (బి) నితీశ్‌ 40, మిచెల్‌ (నాటౌట్‌) 89, ఫిలిప్స్‌ (సి అండ్‌ బి) అక్షర్‌ 17, జాకబ్స్‌ (నాటౌట్‌) 39; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 198/3. వికెట్ల పతనం: 1-4, 2-90, 3-123; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-40-0, అర్ష్‌దీప్‌ 4-0-33-1, ప్రిన్స్‌ 4-0-44-0, అక్షర్‌ 4-0-36-1, నితీశ్‌ 4-0-38-1.

భారత్‌: వైభవ్‌ (సి) మిచెల్‌ (బి) ఫిషెర్‌ 45, అభిషేక్‌ (సి) ఫిలిప్స్‌ (బి) జేమిసన్‌ 113, శాంసన్‌ (బి) జేమిసన్‌ 18, శ్రేయాస్‌ (సి) ఫిలిప్స్‌ (బి) శాంట్నర్‌ 5, తిలక్‌ (నాటౌట్‌) 1, నమన్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 13.2 ఓవర్లలో 199/4; వికెట్ల పతనం: 1-133, 2-178, 3-193, 4-195; బౌలింగ్‌: డఫీ 2-0-44-0, మిల్నే 2-0-33-0, బ్రేస్‌వెల్‌ 2-0-36-0, జేమిసన్‌ 3.2-0-45-2, ఫిషర్‌ 1-0-23-1, శాంట్నర్‌ 3-0-17-1.

భారత్‌ x జింబాబ్వే

మహిళల మూడో వన్డే నేడు

మ. 2 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో


ఇవి కూడా చదవండి:

ప్రమాదకర పిచ్‌పై కోహ్లీ పట్టుదల గురించి డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు!

యువ ఆల్ రౌండర్ నమన్ ధీర్‌పై అజింక్య రహానే ప్రశంసలు..

Updated Date - Oct 28 , 2026 | 02:13 AM