Share News

వైరల్ పెంగ్విన్ వీడియో వెనుక కన్నీళ్లు పెట్టించే కథ

ABN , Publish Date - Jan 25 , 2026 | 04:32 PM

ఓ పెంగ్విన్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. 2007లో రికార్డు చేసిన ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్ చక్కర్లు కొడుతోంది.

వైరల్ పెంగ్విన్ వీడియో వెనుక కన్నీళ్లు పెట్టించే కథ
nihilist penguin meme

ఇంటర్‌నెట్ డెస్క్: అంటార్కిటికా మంచు కొండల్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న ఓ పెంగ్విన్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. 2007లో రికార్డు చేసిన ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్ చక్కర్లు కొడుతోంది. జర్మనీకి చెందిన ఫిల్మ్ మేకర్ వెర్నర్ హెర్‌జోగ్ 2007లో ‘ఎన్‌కౌంటర్స్ యాట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్’ పేరిట డాక్యుమెంటరీ తీశారు. ఆ వీడియోలో సదరు పెంగ్విన్ తన కాలనీని వదలి దూరంగా నడుచుకుంటూ పోతూ కనిపించింది. సాధారణంగా పెంగ్విన్‌లు సమూహంలో మాత్రమే జీవిస్తాయి. అది కూడా సముద్రం దగ్గర మాత్రమే ఉంటాయి. సముద్రం దగ్గర వాటికి ఆహారం, కుటుంబం ఉంటుంది.


కానీ, ఆ పెంగ్విన్ మాత్రం అన్నిటినీ వదలి దూరంగా వెళ్లిపోతూ కనిపించింది. ఒకరకంగా చెప్పాలంటే చావును వెతుక్కుంటూ వెళ్లింది. దాన్ని ‘డెత్ మార్చ్’ అంటారు. అలా సముద్రానికి, కాలనీకి దూరంగా వెళ్లిన పెంగ్విన్‌లు బతకటం అన్నది అసాధ్యం. డాక్యుమెంటరీ వీడియోలో డాక్టర్ డేవిడ్ ఎయిన్‌లే మాట్లాడుతూ.. ‘ఒక వేళ ఆ పెంగ్విన్ అక్కడి నుంచి తిరిగి కాలనీకి వచ్చేద్దామని అనుకున్నా కూడా సాధ్యపడదు. తిరిగి రావటం కూడా ‘డెత్ మార్చ్’ అవుతుంది. మార్గం మధ్యలోనే అది చనిపోయే అవకాశం ఉంది’ అని అన్నారు. ఆ డాక్యుమెంటరీ వీడియో తీసిన ఫిల్మ్ మేకర్ వెర్నర్ హెర్‌జోగ్ మాట్లాడుతూ...


‘వీడియో తీసిన కొంత సేపటికే ఆ పెంగ్విన్ చనిపోయి ఉంటుంది. అది చనిపోవడానికి ముందు అంటార్కిటికా మంచు పర్వతాల్లో దాదాపు 70 కిలోమీటర్లు ఒంటరిగా నడిచింది’ అని చెప్పారు. అయితే, ఆ పెంగ్విన్ అలా అన్నిటినీ వదలి చావును వెతుక్కుంటూ వెళ్లిపోవటం వెనుక ఉన్న సరైన కారణం ఇంత వరకు తెలియరాలేదు. తన భాగస్వామి చనిపోవటం వల్ల ఆ పెంగ్విన్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని, ఆ బాధలో డెత్ మార్చ్ చేసి ప్రాణాలు తీసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పెంగ్విన్ వీడియోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఆ పెంగ్విన్‌తో తాను కూడా నడుచుకుంటూ వెళుతున్నట్లు ఓ ఏఐ ఫొటో క్రియేట్ చేశారు.


ఇవి కూడా చదవండి

ప్రియుడు చనిపోయాడని ఆ ఆడపాము ఏం చేసిందంటే.. షాకింగ్ వీడియో వైరల్..

తిరుపతిలో దళిత యువతిపై అత్యాచారం

Updated Date - Jan 25 , 2026 | 04:42 PM