Share News

ఉద్యోగమే జీవితంగా బతికా.. కానీ.. యువతికి జ్ఞానోదయం.. వీడియో వైరల్

ABN , Publish Date - Apr 19 , 2026 | 09:26 PM

జాబ్ పోయాక తనకు తెలిసివచ్చిన విషయాలపై ఒక యువతి పెట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

ఉద్యోగమే జీవితంగా బతికా.. కానీ.. యువతికి జ్ఞానోదయం.. వీడియో వైరల్
work life balance story

ఇంటర్నెట్ డెస్క్: జీవితం అంటే జాబ్ మాత్రమే అని అనుకున్నానంటూ ఒక యువతి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. చివరకు తనకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో చెబుతూ ఆమె ఇన్‌స్టా వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఉద్యోగం కోల్పోయాక తనకు జీవితం బోధపడిందంటూ ఆ యువతి ఈ వీడియోను షేర్ చేశారు. జాబ్ ఉన్నంత కాలం తాను టార్గెట్స్, డెడ్‌లైన్స్, మీటింగ్స్‌ లోకంగా గడిపేశానని అన్నారు. తన గురించి తాను అస్సలు పట్టించుకోలేదని వాపోయారు. చివరకు ఉద్యోగం కోల్పోయాక తెలుసుకున్న విషయాలు మనసులో గుబులు పుట్టించాయని అన్నారు. ‘ఈ మధ్య నన్ను జాబ్‌లోంచి తీసేశారు. జీవితం అంటే జాబ్ అన్నట్టు ఇంతకాలం గడిపాను’


‘పనిలో పడిపోయి నా గురించి నేను పట్టించుకోవడం మానేశాను. స్నేహితులను కలవడం, ఫంక్షన్‌లకు వెళ్లడం వంటివి ఉండేవి కావు. జిమ్‌కు వెళ్లడం కూడా తక్కువే. నా ప్రపంచం మొత్తం పని చుట్టూ అల్లుకుని ఉండేది. రోజూ ఆఫీసుకు వెళ్లేదాన్ని. ఇంటికి వచ్చిన తరువాత కూడా పనిలో మునిగిపోయే దాన్ని. నాలాగే ఎంతో మంది బతుకుతున్నారని కూడా తెలుసు. అయితే, అసలు లైఫ్ అంటే ఇదేనా? అని నాకిప్పుడు అనిపిస్తోంది’ అని ఆమె అన్నారు. ‘జాబ్ పోయాక లైఫ్ ఇలా..’ అనే క్యాప్షన్‌తో ఆమె ఈ వీడియోను షేర్ చేశారు.

ఈ వీడియోపై జనాలు పెద్ద ఎత్తున తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తామూ ఉద్యోగాలకు బందీగా మారిపోయామని అనేక మంది చెప్పారు. జాబ్ పోయిన సందర్భాల్లో లైఫ్ కష్టంగా మారినా ఇలాంటప్పుడే జీవితాన్ని తరచి చూసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. కెరీర్‌ కంటే ముఖ్యమైన అంశాలు లైఫ్‌లో అనేకం ఉన్నాయని కొందరు చెప్పారు. తామర ఆకు మీద నీటి బొట్టులా ఉండటమే అసలైన జీవితమని తనకు జాబ్ పోయాక తెలిసివచ్చిందని మరొక వ్యక్తి కామెంట్ చేశారు.

Updated Date - Apr 19 , 2026 | 09:42 PM