వరుడికి షాకిచ్చిన వధువు.. మేకప్ కిట్ తెచ్చివ్వలేదని..
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:37 PM
వరుడు తనకు మేకప్ కిట్ తెచ్చివ్వలేదన్న కోపంతో ఒక వధువు పెళ్లి రద్దు చేసుకున్న ఘటన యూపీలో ఇటీవల వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లో తాజాగా వింత ఘటన వెలుగు చూసింది. వరుడు తనకు మేకప్ కిట్ తెచ్చివ్వని కారణంగా వధువు పెళ్లికి నో చెప్పింది. దీంతో, నివ్వెరపోవడం వరుడి వంతైంది. బిజ్‌నోర్ జిల్లాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, నూర్‌పూర్ మండలంలోని ఇస్లామ్ నగర్‌లో వధువు కుటుంబం పెళ్లి వేడుకను ఏర్పాటు చేసింది. వరుడు తన కుటుంబం, బంధుమిత్రులతో సహా అక్కడికి కారులో వెళ్లాడు. అంతా సవ్యంగా సాగిపోతోందని అనుకుంటున్న తరుణంలో వధువు సడెన్‌గా పెళ్లికి నో చెప్పింది. తనకు కావాల్సిన మేకప్ కిట్ తెచ్చి పెట్టలేదని వరుడు, అతడి కుటుంబంపై మండిపడింది. కనీస అవసరాలను తీర్చలేని వారు జీవితాంతం తనను ఎలా జాగ్రత్తగా చూసుకుంటారని ప్రశ్నించింది.
వధువు నిర్ణయానికి వరుడు షాకైపోయాడు. పెళ్లి కోసమనే తాను రూ.12 లక్షలు పెట్టి కారు కొన్నట్టు చెప్పుకొచ్చాడు. పెళ్లికి ఒప్పుకోమని వేడుకున్నాడు. పెళ్లికి వచ్చిన పెద్దలు నచ్చచెప్పినా వధువు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈలోపు ఇరు కుటుంబాల మధ్య వివాదం పతాకస్థాయికి చేరుకుంది. వధువు కుటుంబసభ్యులు వరుడి కారుపై రాళ్లు విసరడంతో అది దెబ్బతింది. అద్దాలు పగిలిపోయాయి. చివరకు పోలీసులు వచ్చి ఇరు వర్గాలకు నచ్చచెప్పాల్సి వచ్చింది. ఎవరెన్ని చెప్పినా వధువు పెళ్లికి ససేమిరా అంటుండటంతో చేసేదేమీ లేక వరుడు, తన కుటుంబంతో కలిసి తిరుగుప్రయాణమయ్యాడు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.