Share News

పంచ్ క్రేజ్ మామూలుగా లేదుగా.. ఎన్‌క్లోజర్‌లోకి దూకిన అమెరికన్లు..

ABN , Publish Date - May 19 , 2026 | 09:57 AM

అమెరికాకు చెందిన 24 ఏళ్ల రియద్ జాహ్నయ్ డేసన్, 27 ఏళ్ల నేల్ జొబాహ్రి డాన్.. ఇచికావా సిటీ జూకు వెళ్లారు. వింత కాస్ట్యూమ్స్ ధరించిన వారు పంచ్ ఎన్‌క్లోజర్‌లోకి దూకారు.

పంచ్ క్రేజ్ మామూలుగా లేదుగా.. ఎన్‌క్లోజర్‌లోకి దూకిన అమెరికన్లు..
Punch the monkey

ఇంటర్‌నెట్ డెస్క్: జపాన్‌, ఇచికావా సిటీ జూలో ఉంటున్న ‘పంచ్’ అనే కోతి పిల్ల సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ కోతి పిల్ల కారణంగా ఇచికావా జూ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. పంచ్‌ను చూడ్డానికి జనం జూకు క్యూ కడుతున్నారు. పంచ్ ఎన్‌క్లోజర్ దగ్గర పర్యాటకుల సందడి భారీగా ఉంటోంది. పంచ్ క్రేజ్ ఎలాంటిదో బయటపెట్టే సంఘటన ఒకటి తాజాగా జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన 24 ఏళ్ల రియద్ జాహ్నయ్ డేసన్, 27 ఏళ్ల నేల్ జొబాహ్రి డాన్.. ఇచికావా సిటీ జూకు వెళ్లారు.


వింత కాస్ట్యూమ్స్ ధరించిన వారు పంచ్ ఎన్‌క్లోజర్‌లోకి దూకారు. ఎన్‌క్లోజర్ లోపల వీడియోలు తీయటం మొదలెట్టారు. వారిని చూసిన కోతులు భయపడిపోయాయి. అటు, ఇటు పరిగెత్తటం మొదలెట్టాయి. సమాచారం అందుకున్న జూ సిబ్బంది వెంటనే స్పందించారు. ఎన్‌క్లోజర్‌లో ఉన్న ఇద్దరినీ బయటకు తీసుకువచ్చారు. జూ రూల్స్ అతిక్రమించినందుకు ఇద్దరినీ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు సోమవారం ఇచికావా జూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో తెలిపింది.


పంచ్ కథ ఏంటంటే..

పంచ్ కున్ అనే కోతి పిల్ల 2025 జులై నెలలో ఇచికావా సిటీ జూలో జన్మించింది. పుట్టిన కొద్దిసేపటికే పంచ్‌ను తల్లి దూరం పెట్టింది. మళ్లీ దగ్గరకు తీసుకోలేదు. కోతి పిల్లను తల్లి దూరం పెట్టడంతో జూ సిబ్బంది 24 గంటలు దాని ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఎమోషనల్‌గా దెబ్బతినకుండా ఉండటానికి బ్లాంకెట్స్, బొమ్మలు ఇచ్చారు. పంచ్ ఒరంగుటాన్ బొమ్మను తనతో పాటు పెట్టుకుంది. ఆ బొమ్మతోటే అటు, ఇటు తిరుగుతూ ఉంది. పంచ్ ఒరంగుటాన్ బొమ్మతో తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పంచ్ ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయింది.


ఇవి కూడా చదవండి

నకిలీ మద్యం కేసులో తుది ఛార్జిషీట్ దాఖలు చేసిన అధికారులు

దొంగల బీభత్సం.. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్

Updated Date - May 19 , 2026 | 10:16 AM