టైమ్స్ స్క్వేర్ ఘటన.. వెలుగులోకి భయానక దృశ్యాలు..
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:34 AM
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఓ మహిళ కత్తులతో హల్‌చల్ చేసింది. రోడ్డుపై వెళుతున్న జనంపై దాడికి పాల్పడింది. పోలీసులు మహిళను అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వారిపై కూడా కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నించింది. పోలీసులు ఆమెను కాల్చి చంపారు.
ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఓ మహిళ కత్తులతో హల్‌చల్ చేసింది. రోడ్డుపై వెళుతున్న జనంపై దాడికి పాల్పడింది. కత్తి పోట్ల కారణంగా ఓ వ్యక్తి చనిపోగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు మహిళను అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వారిపై కూడా కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నించింది. పోలీసులు ఆమెను కాల్చి చంపారు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సోమవారం న్యూయార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఓ మహిళ రెండు కత్తులతో జనంపై విరుచుకుపడింది.
ఓ ఇద్దరు వ్యక్తులను గాయపరిచింది. మరింత మందిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. జనం ఆమెనుంచి తప్పించుకుని పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలం వద్దకు వెళ్లారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. మహిళను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే, ఆ మహిళ పోలీసుల హెచ్చరికలను లెక్కచేయలేదు. ఎదురుగా ఉన్న పోలీసులపై కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెపై కాల్పులు జరిపారు.
ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనపై న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీ స్పందించారు. ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘మహిళ దాడిలో గాయపడ్డ ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులకు నా ధన్యవాదాలు. పరిస్థితి మరింత దారుణంగా తయారు కాకుండా వేగంగా స్పందించారు’ అని తెలిపారు.
పోలీసులు మహిళను కాల్చి చంపిన దృశ్యాల తాలూకా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొంతమంది నెటిజన్లు పోలీసులు చేసిన పనిని సమర్థిస్తుంటే మరి కొంతమంది తప్పుబడుతున్నారు.
ఇవి కూడా చదవండి
అర్జెంటీనా జెర్సీ కళ తప్పుతుంది.. మెస్సి రిటైర్‌మెంట్‌పై భావోద్వేగ సందేశాలు
నవోదయలతో పాటు రెండు ఎయిమ్స్‌లు.. నిర్మలా సీతారామన్‌కు ఎంపీ రమేశ్ వినతి