మరీ ఇంత దారుణమా.. 2బీహెచ్‌కే ఫ్లాట్ రెంటు లక్ష రూపాయలు
ABN , Publish Date - Mar 09 , 2026 | 10:42 AM
ముంబైలోని పారెల్ ఏరియాలో ఇళ్ల అద్దెలు చాలా దారుణంగా ఉంటున్నాయి. కొందరు 2బీహెచ్‌కే కోసం ఏకంగా లక్ష రూపాయలు చెల్లిస్తున్నారు.
ముంబై, మార్చి 9: నగరాల్లో అద్దె ఇళ్లలో జీవితం ఎంత ఖర్చుతో కూడుకున్నదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సింగిల్ రూమ్‌కు కూడా 10 వేల రూపాయలు రెంటు కడుతున్న వారు ఉన్నారు. ఏరియాను బట్టి రెంట్ మారుతూ ఉంటుంది. 2 బీహెచ్‌కే ఇంటికి 50 వేల రూపాయల దాకా రెంట్ ఉంటోంది. అయితే, ముంబైలోని పారెల్ ఏరియాలో ఇళ్ల అద్దెలు చాలా దారుణంగా ఉంటున్నాయి. కొందరు 2బీహెచ్‌కే కోసం ఏకంగా లక్ష రూపాయలు చెల్లిస్తున్నారు. ఆర్య కొతారీ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ముంబైలోని ఇళ్ల రెంట్‌లపై వీడియోలు చేస్తున్నాడు.
తాజాగా, సముద్రం దగ్గర జాగింగ్ చేస్తున్న ఓ లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ఇంటి రెంట్ ఎంత అని అడిగాడు. ఆమె లక్ష రూపాయలు అని చెప్పటంతో షాక్ అయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌లోని 2బీహెచ్‌కే ఫ్లాట్‌లో ఉంటున్నానని ఆమె చెప్పింది. ఆమె లక్ష రూపాయలు రెంట్ కడుతున్న ఆ 2బీహెచ్‌కే ఫ్లాట్‌ను ఆర్య చూడాలనుకున్నాడు. ఆమెతో పాటు ఫ్లాట్‌కు వెళ్లాడు. ఆ ఫ్లాట్ అత్యంత సాధారణంగానే ఉంది. 700 చదరపు గజాలు ఉన్న ఆ ఇంట్లో ఆమెతో పాటు మరో అమ్మాయి కూడా ఉంటోంది. ఇద్దరూ 50 వేల రూపాయల చొప్పున రెంట్ కడుతున్నారు.
ఆ ఇద్దరమ్మాయిలు మాట్లాడుతూ.. ‘మేము ఇద్దరమూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. మాకు ఈ ఇంట్లో లివింగ్ రూమ్ అంటే చాలా ఇష్టం ఎక్కువ సమయం అక్కడే గడుపుతూ ఉంటాము. అక్కడే రిలాక్స్ అవుతుంటాం.. మాట్లాడుకుంటూ ఉంటాం. రెంట్ విషయంలో మేము ఎప్పుడూ బాధపడలేదు. మా వయసు ఇప్పుడు 23 ఏళ్లు. ఈ వయసులో ముంబైలో ఉండాలని అనుకుంటే ఇదే సరైన ప్రదేశం’ అని చెప్పుకొచ్చారు. ఆర్య పోస్ట్ చేసిన వీరి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ.. ‘2బీహెచ్‌కే ఇంటికి లక్ష రూపాయల రెంటా?.. మా ఏరియాలో పది వేలకే ఇస్తారు’..‘ఆ ఇంటి ఆల్మారాలు చాలా చిన్నగా.. దారుణంగా ఉన్నాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఎక్కువగా ఆలోచించడం వల్ల వచ్చే సమస్యలు ఇవే
టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ ఆ ఇద్దరికి అంకితం: గౌతమ్ గంభీర్