మెట్రో స్టేషన్‌లోనే తన కొడుకు నిశ్చితార్థాన్ని జరిపించిన తల్లి.. వైరల్ వీడియో
ABN , Publish Date - Feb 08 , 2026 | 10:07 PM
ఓ తల్లి తన బిడ్డ, అతడి గర్ల్‌ఫ్రెండ్‌కు మెట్రో స్టేషన్‌లోనే నిశ్చితార్థం జరిపించేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఓ తల్లి తన బిడ్డ, అతడి గర్ల్‌ఫ్రెండ్‌కు మెట్రో స్టేషన్‌లోనే నిశ్చితార్థం జరిపించేసింది.అందరూ చూస్తుండగా ఇదంతా జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారడంతో జనాలు షాకైపోతున్నారు. ఇది నిజమా? లేక ఏదైనా ఫన్నీ వీడియోనా? అనేది అర్థంకాక తలపట్టుకుంటున్నారు (Engagement in Metro Station).
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, స్టేషన్‌లో తల్లిని చూడగానే ఆ యువకుడు షాకైపోయాడు. అతడి పక్కనే కూర్చున్న యువతికి కూడా నోటమాట రాలేదు. ఈలోపు యువకుడి తల్లి పద్ధతి ప్రకారం వారి నిశ్చితార్థం చేసేసింది. వీడియోను జాగ్రత్తగా తీయాలంటూ పక్కనే ఉన్న వ్యక్తికి సూచించింది. యువకుడేమో తల్లిని బతిమలాడాడు. తన పరువు తీయొద్దని ప్రాథేయపడ్డాడు. అతడి తల్లి కూడా దీటుగా బదులిచ్చింది. పరువు నీకే ఉంటుందా? మాకు ఉండదా? అని ప్రశ్నించింది. పక్కనే ఉన్న యువతికి సంప్రదాయం ప్రకారం స్వీటు తినిపించింది. చేతిలో దుస్తులు, పండ్లు, పూలు పెట్టింది. వారిద్దరూ కలకాలం సుఖంగా ఉండాలని కూడా దీవించింది. ఇదంతా మెట్రో స్టేషన్‌లోనే జరిగిపోయింది.
ఇక ఈ వీడియో నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్‌గా మారింది. వీడియో చూసిన జనాలు కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. తాము చూస్తున్నది నిజమా? లేక ఎవరైనా వైరల్ వీడియోను రికార్డు చేసి జనాల మీదకు వదిలారా? అని కొందరు ప్రశ్నించారు. మరికొందరు మాత్రం తల్లిని ప్రశంసించారు. తల్లిదండ్రులు ఇలా ఉంటే ఎలాంటి గొడవలు జరగవని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.