Share News

నెలకు రూ.2 లక్షల ఆదాయం.. ఎలాగో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ABN , Publish Date - Feb 09 , 2026 | 09:11 PM

డ్రైక్లీనింగ్ షాపు నిర్వహించే ఓ జంట నెలకు రూ.2 లక్షలకు పైగా సంపాదిస్తోందంటూ ఓ మహిళ షేర్ చేసిన ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది. 10 సంవత్సరాల అనుభవం ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో సమానంగా వారు సంపాదిస్తున్నారని చెబుతూ మహిళ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

నెలకు రూ.2 లక్షల ఆదాయం.. ఎలాగో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Drycleaning Business - Viral Incident

ఇంటర్నెట్ డెస్క్: పెద్ద పెద్ద చదువులు చదివినా సరైన సంపాదన లేక ఇక్కట్ల పాలయ్యేవారు కొందరు ఉంటారు. తమకు తెలిసిన వృత్తిని నమ్ముకుని సునాయాసంగా లక్షలు ఆర్జించే వారు మరికొందరు ఉంటారు. ఇలాంటి ఓ జంటను చూసి షాకైపోయిన కంటెంట్ క్రియేటర్ ఒకరు ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్నారు. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

నళినీ ఉనాగర్ అనే కంటెంట్ క్రియేటర్ ఈ పోస్టును పెట్టారు. తమ ఇంటి పక్కన డ్రైక్లీనింగ్ షాపు నిర్వహించే ఓ జంట నెలకు రూ.2 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తోందని చెప్పారు. అదెలాగో కూడా వివరించారు.

‘వాళ్లది సొంత షాపే. అద్దె బాధ లేదు. ఆ దంపతులు ఇద్దరూ కలిసి రోజుకు 350 జతల దుస్తులకు పైగా ఇస్త్రీ చేస్తారు. ఒక్కో జతకు రూ.10 చొప్పున తీసుకుంటారు. ఇక సూట్స్, ఛోళీ, ఖరీదైన చీరలు వంటివాటిని డ్రైక్లీనింగ్ చేసేందుకు ఒక్కోదానికి రూ.350 చొప్పున తీసుకుంటారు. ఇలాంటివి రోజుకు 20 వరకూ డ్రైక్లీనింగ్ చేస్తారు. ఇలా ఇస్త్రీలపై రోజుకు రూ.3500, డ్రైక్లీనింగ్‌పై మరో రూ.7000 వరకూ వారికి వస్తాయి. అంటే.. ఒక్క రోజు ఆదాయమే పది వేలు దాటిందన్నమాట. నెలకు మూడు రోజులు మాత్రమే సెలవు తీసుకుంటారు. దీంతో, వారి నెల వారీ ఆదాయం దాదాపు రూ.2.83 లక్షలు ఉంటుంది.


ఇక వారి వద్ద ఇద్దరు సహాయకులు కూడా పనిచేస్తున్నారు. ఇద్దరికీ కలిపి జీతాల కింద రూ.40 వేలు పోతుంది. వారిది సొంత ఇల్లే కాబట్టి అద్దె ఖర్చు లేదు. కరెంటు ఖర్చు మరో రూ.6 వేలు. ఇవన్నీ పోతే చేతిలో వారికి రూ.2.3 లక్షల వరకూ మిగులుతున్నాయి. ఇది పదేళ్ల అనుభవం ఉన్న టెకీ సంపాదనకు సమానం’ అని చెప్పారు.

ఈ పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. చదువుకు, సంపాదనకు సంబంధం లేదనేందుకు ఇంతకు మించిన ఉదాహరణ లేదని అనేక మంది అభిప్రాయపడ్డారు.

Updated Date - Feb 09 , 2026 | 09:59 PM