ఢిల్లీలో పుట్టి పెరిగా.. హైదరాబాద్‌కు వచ్చాకే.. వ్యక్తి వీడియో వైరల్
ABN , Publish Date - May 06 , 2026 | 10:22 PM
హైదరాబాద్ నగరంపై ప్రశంసలు కురిపిస్తూ ఒక ఢిల్లీ వాస్తవ్యుడు పెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్ నగరంపై ప్రశంసలు కురిపిస్తూ ఒక ఢిల్లీ వ్యక్తి నెట్టింట షేర్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీలో పుట్టిన పెరిగిన తనకు హైదరాబాద్‌కు వచ్చాకే మానసిక ప్రశాంతత లభించిందని ఆయన కామెంట్ చేశారు. పర్వ్ శర్మ అనే వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశారు.
తాను 30 ఏళ్ల పాటు దేశరాజధానిలో గడిపానని అన్నారు. కానీ రెండున్నర ఏళ్ల క్రితం తన భార్యతో కలిసి హైదరాబాద్‌కు వచ్చాక మానసిక ప్రశాంతత దక్కిందని అన్నారు. తాను నగరాలను పోల్చి చూడట్లేదని, నగరాల్లో ఉండే ప్రజలు ఆశించేదేమిటో మాత్రమే చెబుతున్నానని అన్నారు.
ఢిల్లీలో తాను ఎదుర్కొన్న టెన్షన్ గురించి కూడా చెప్పుకొచ్చారు. వీధుల్లో వాకింగ్‌కు వెళ్లాలన్నా ఆందోళనగా ఉండేదని అన్నారు. ఫోన్లు, గొలుసులు చోరీకి గురికావచ్చనో లేదా ఇతరత్రా వేధింపులు ఎదురుకావచ్చనో అక్కడ జనాలు అత్యంత జాగ్రత్తగా ఉంటారని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మహిళలు రాత్రివేళ బయటకు వెళ్లినప్పుడు కుటుంబాలు తీవ్ర ఒత్తిడికి లోనవుతాయని అన్నారు.
అయితే, హైదరాబాద్‌కు వచ్చాక తనకు ప్రశాంతత దక్కిందని అన్నారు. తాను, తన భార్యతో కలిసి రాత్రి వేళ ప్రశాంతంగా వాకింగ్‌కు వెళ్లివస్తున్నట్టు చెప్పారు. ఆమె ఒంటరిగా పనిపై వెళ్లినా ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేదని చెప్పుకొచ్చారు.
తెలంగాణ పోలీసులపై కూడా పర్వ్ ప్రశంసలు కురిపించారు. అవసరమైన సాయం చేసే ఇక్కడి పోలీసులు సామాన్య పౌరులతో ఎంతో మర్యాదగా ఉంటారని కూడా అన్నారు. నగరానికి వచ్చాక తన మనసు ఆధ్యాత్మికతవైపు కూడా మళ్లిందని చెప్పుకొచ్చారు. కెరీర్‌లో కూడా ముందుకు వెళ్లగలిగానని అన్నారు. ఈ అభిప్రాయాలతో అనేక మంది ఏకీభవించారు.