ఏఐని నమ్మి.. భార్య లాప్‌టాప్‌ను అప్పగిస్తే..
ABN , Publish Date - Feb 08 , 2026 | 08:26 PM
రోజువారి పనులను చేసిపెట్టే స్థాయిలో ఏఐ అభివృద్ధి చెందలేదని ఒక వెంచర్ క్యాపిటల్ సంస్థ అధిపతి తెలిపారు. తన భార్య లాప్‌టాప్ ఇచ్చి ఏఐని ఒక పని చేసిపెట్టమన్నందుకు తనకు జీవితంలో ఎన్నడూ మరిచిపోలేని అనుభవం మిగిలిందని చెప్పుకొచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐని నమ్మి తన భార్య లాప్‌టాప్‌ను అప్పగించిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. దీంతో, ఆయన జనాలను హెచ్చరిస్తూ నెట్టింట ఓ పోస్టు పెట్టారు. ఏఐని అప్పుడే గుడ్డిగా నమ్మి ఇబ్బందుల్లో పడొద్దని హెచ్చరించారు (AI Agent Deletes All Files).
అమెరికాకు చెందిన డేవిడోవ్స్ వెంచర్ కలెక్టివ్ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిక్ డేవిడోవ్ ఈ పోస్టును పెట్టారు. తన భార్య లాప్‌టాప్‌లో అనవసర ఫైళ్లను డిలీట్ చేసే బాధ్యతను ఆంథ్రొపిక్ సంస్థకు చెందిన క్లాడ్ కోవర్క్ ఏఐ ఏజెంట్‌కు అప్పగించినట్టు తెలిపారు. చివరకు రిజల్ట్ చూశాక గుండె ఆగినంతపనైందని చెప్పారు.
‘పాత ఫైళ్లను డిలీట్ చేయమని ఏఐ ఏజెంట్‌కు చెప్పా. అదేమో పొరపాటున టర్మినల్ ద్వారా కీలక ఫొటోలను, ఫైల్స్‌ను మొత్తం డిలీట్ చేసింది. 15 ఏళ్లుగా నా భార్య సేవ్ చేసిన రకరకాల ఫొటోలు, వీడియోలను మొత్తం చెరిపేసింది. వాటిల్లో మా పిల్లల ఫొటోలు, మా టూర్స్ ఫొటోలు.. ఇలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఒక్కసారిగా కనబడకుండా పోయాయి. ఫొటోలను ట్రాష్ (రీసైకిల్ బిన్)లో వేయకుండా మరో విధానంలో డిలీట్ చేయడంతో వాటిని రికవరీ టూల్స్‌తో వెనక్కు తేవడం కూడా సాధ్యం కాలేదు. చివరకు యాపిల్ సపోర్టు వారికి ఫోన్ చేశాను. ఐక్లోడ్‌లోని ఓ ఫీచర్ ద్వారా వారు డిలీట్ అయిన ఫొటోలను తిరిగి తెప్పించగలిగారు. పోయాయనుకున్న వేల కొద్దీ ఫొటోలు మళ్లీ ఒక్కొక్కటిగా వస్తుంటే నాకు పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు ఉంది. ఫొటోలు డిలీట్ అవడం చూశాక గుండె ఆగినంత పనైంది. కాబట్టి, జనాలకు నేను చెప్పేదేంటంటే.. రోజువారీ పనులు చేసిపెట్టే స్థాయిలో ఏఐ ఏజెంట్స్ ఇంకా అభివృద్ధి చెందలేదు. వాటిని నమ్మి ఏ పనీ అప్పగించొద్దు’ అని అన్నారు.
జనాలకు డిజిటల్ సహాయకుడిగా ఉండేందుకు ఆంథ్రొపిక్ సంస్థ క్లాడ్ కోవర్క్ ఏఐ ఏజెంట్‌ను రెడీ చేసింది. యూజర్ కంప్యూటర్లలోని ఫైల్స్‌ను రీడ్ చేయడం, కొత్తవి క్రియేట్ చేయడం లేదా ఉన్న వాటిని ఎడిట్ చేయడం వంటివి ఇది సులువుగా చేస్తుందని సంస్థ చెబుతోంది. ఇది కేవలం యూజర్లకు కబుర్లు చెప్పే చాట్‌బాట్ కాదని పేర్కొంది.