Share News

1,100 ఏళ్ల నాటి మెట్ల బావి.. ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం

ABN , Publish Date - Mar 30 , 2026 | 05:29 PM

రాజస్థాన్‌లో సుమారు 1,100 ఏళ్ల క్రితం నిర్మించిన చాంద్ బవోరి బావి గొప్పదనాన్ని వివరిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. నేటి డిజైన్ థింకింగ్ సిద్ధాంతాన్ని భారతీయులు అప్పట్లోనే అమలు చేశారని మహీంద్రా ప్రశంసల వర్షం కురిపించారు.

1,100 ఏళ్ల నాటి మెట్ల బావి.. ఆనంద్ మహీంద్రా  ఆశ్చర్యం
Anand Mahindra - Chand Baori

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేవి భారీ కోటలు, ప్యాలెస్‌లే. అయితే, రాష్ట్రానికి వచ్చే పర్యాటకులను ఆశ్చర్యంలో ముంచెత్తే ఒక మెట్ల బావి మరింత విశిష్టమైనదని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. సుమారు 1,100 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బావి గొప్పదనాన్ని తాజా పోస్టులో ఆయన వివరించారు. భారతీయుల నైపుణ్యానికి ఈ బావి నిదర్శనమని అన్నారు. నిర్మాణ రంగ నిపుణులు ప్రస్తుతం అనుసరించే ఆధునిక డిజైన్ థింకింగ్‌ సిద్ధాంతాన్ని భారతీయులు వెయ్యి ఏళ్ల క్రితమే అమల్లో పెట్టారని ఆనంద్ మహీంద్రా చెప్పుకొచ్చారు.

ఆనంద్ మహీంద్రా చెప్పిన వివరాల ప్రకారం, దౌసా జిల్లా ఆభానేరీ గ్రామంలోని ఈ బావి సుమారు 30 మీటర్ల లోతు ఉంటుంది. బావి లోపలికి దిగేందుకు 13 అంచెల్లో 3,500 మెట్లను ఏర్పాటు చేశారు. బావి నిర్మాణం వెనుక అప్పటి వారి ఆలోచన తనకు అమితాశ్చర్యం కలిగించిందని ఆనంద మహీంద్రా అన్నారు. ప్రజల అవసరాలను తీర్చడమే కాకుండా వారికి గొప్ప అనుభూతిని కలిగించే సృజనాత్మక పరిష్కారాలను కనుగొనాలన్న డిజైన్ థింకింగ్ సిద్ధాంతాన్ని అప్పట్లోనే భారతీయులు అమలు చేశారని అన్నారు. ఇది నిజంగా విశేషమేనని వ్యాఖ్యానించారు. ఈ బావి డిజైన్‌లో కళాత్మకత ఉట్టిపడుతోందని అన్నారు.


ఈ బావిని క్రీస్తుశకం 8వ, 9వ శతాబ్దాల మధ్య నిర్మించారు. నికుంభ్ వంశానికి చెందిన రాజు చందా స్థానికుల నీటి అవసరాల కోసం ఈ బావిని అందుబాటులోకి తెచ్చారు. అక్టోబర్-మార్చి నెలల మధ్య కాలం ఆభానేరీకి వెళ్లేందుకు తగిన సమయమని అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఆ కాలంలో ఎండతీవ్రత తక్కువగా, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందట. ఉదయం వేళలో వెళితే జనాల రద్దీ కూడా తక్కువగా ఉంటుందని సూచిస్తున్నారు. రాజధాని జైపూర్ నుంచి కారు లేదా ట్యాక్సీలో సులువుగా ఆభానేరీకి వెళ్లవచ్చు. జైపూర్ నుంచి దౌసా వరకూ ఆర్టీసీ బస్సులో వెళ్లి అక్కడి నుంచి ఆటో లేదా ట్యాక్సీ ద్వారా ఆభానేరీ గ్రామానికి చేరుకోవచ్చు.


ఈ వార్తలూ చదవండి:

వామ్మో.. విమానాల్లో కూడా జనాలు ఇంతేనా! ఫొటోలు వైరల్

గర్భధారణపై మైక్రోగ్రావిటీ ప్రభావం.. శాస్త్రవేత్తలు ఏం తేల్చారంటే..

Updated Date - Mar 30 , 2026 | 05:57 PM