భారత్‌కు త్వరలో బుజ్జి అతిథి! 6 రోజుల్లో 6 వేల కిలోమీటర్ల జర్నీ
ABN , Publish Date - May 01 , 2026 | 05:32 PM
త్వరలో భారత్‌కు అమూర్ ఫాల్కన్ జాతికి చెందిన ఒక చిట్టి పక్షి రానుంది. ఆఫ్రికా ఖండం నుంచి బయలుదేరిన ఈ పక్షి 6 రోజుల్లో 6 వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలకు చేరుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌కు త్వరలో ఓ బుజ్జి అతిథి రానుంది. అమూర్ ఫాల్కన్ జాతికి చెందిన ఒక చిట్టి పక్షి నేడు ఆఫ్రికాలోని సోమాలియా దేశం నుంచి భారత్‌కు బయలుదేరింది. రాబోయే ఆరు రోజుల్లో ఈ పక్షి దాదాపు 6 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి మణిపూర్ రాష్ట్రానికి చేరుకోనుందని తమిళనాడు పర్యావరణ శాఖ అడిషనల్ సెక్రటరీ సుప్రియా సాహూ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అమూర్ ఫాల్కన్ పక్షుల వలసల అధ్యయనం కోసం ఉద్దేశించిన వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్టుకు సంబంధించిన అప్‌డేట్‌ను ఆమె పంచుకున్నారు. దాదాపుగా ఆరు రోజుల పాటు ఈ పక్షి అవిశ్రాంతంగా ప్రయాణించి భారత్‌కు చేరుకుంటుందని చెప్పారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా అమూర్ ఫాల్కన్‌లకు చెందిన అపాపాంగ్, అలాంగ్, ఆహూ అనే మూడు పక్షులకు శాటిలైట్ ట్యాగ్స్‌ను గతేడాది నవంబర్‌లో జత చేశారు. వీటి ఆధారంగా పక్షుల ప్రయాణాన్ని సిబ్బంది గమనిస్తున్నారు. గతేడాది మణిపూర్ నుంచి బయలుదేరిన ఈ పక్షులు కేవలం ఐదు రోజుల్లో 5 వేల కిలోమీటర్లు ప్రయాణించి సోమాలియాకు వెళ్లాయి. కేవలం 150 గ్రాముల బరువు ఉండే ఒక్కో పక్షి సగటున రోజుకు వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. సోమాలియా నుంచి జింబాబ్వే, బొత్సవానా, కేన్యా దేశాలకు వెళ్లాయి. అక్కడి సవానా గడ్డి మైదానాల్లో గడిపాయి. ఏప్రిల్ మొదట్లోనే అలాంగ్, అపాపాంగ్ పక్షులు సోమాలియా వైపు తిరుగు ప్రయాణం ప్రారంభించాయి. అహూ కదలికలను కూడా పరిశోధకులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సముద్రం దాటడం ప్రమాదకరం కావడంతో గాలులు తమకు అనుకూలంగా ఉన్నప్పుడే అవి సముద్రం దాటుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఎండాకాలంలో ఈ పక్షులు ఆసియాలోని ఈశాన్య ప్రాంతాలకు వెళతాయి. శీతాకాలం మాత్రం ఆఫ్రికా ఖండంలో ఉంటాయి. ఆఫ్రికాకు వెళ్లే క్రమంలో నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో కొన్ని రోజులు సేద తీరి సుదీర్ఘప్రయాణానికి కావాల్సిన శక్తివనరులను ఒంట్లో నిల్వ చేసుకుంటాయి. వాతావరణ మార్పులు, గాలుల మార్పులు వంటి వాటిని తట్టుకుంటూ ఈ చిట్టి పక్షులు సముద్రాలను ఎలా దాటుతాయో తెలుసుకునేందుకు వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు అధ్యయనాన్ని నిర్వహిస్తున్నారు.