Streets Turn Into Ice Rink: వణుకు పుట్టించే చలి.. ఐస్ కారణంగా జారుడు బల్లలా మారిన రోడ్డు..
ABN , Publish Date - Jan 13 , 2026 | 07:11 AM
మంచు విపరీతంగా కురుస్తోంది. రాత్రి అయ్యిందంటే చాలు జనం రోడ్ల మీద తిరగడానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రోడ్లు మంచుతో గడ్డ కట్టిపోతున్నాయి. జారుడు బల్లలా మారిపోతున్నాయి..
నెదర్లాండ్‌లో చలి వాతావరణం చుక్కలు చూపిస్తోంది. గడ్డ కట్టించే చలితో అక్కడి జనం అల్లాడిపోతున్నారు. మైనస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మంచు విపరీతంగా కురుస్తోంది. రాత్రి అయ్యిందంటే చాలు.. జనం రోడ్ల మీద తిరగడానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రోడ్లు మంచుతో గడ్డ కట్టిపోతున్నాయి. జారుడు బల్లలా మారిపోతున్నాయి. వాహనాలు మాత్రమే కాదు.. మనుషులు కూడా రోడ్లపై తిరగడానికి ఇబ్బందిపడుతున్నారు. ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నెదర్లాండ్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో దారుణమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో ఏముందంటే.. మలుపు తిరిగి ఉన్న ఓ రోడ్డు మొత్తం మంచుతో ఐస్ గడ్డలా మారిపోయింది. ఫుట్‌పాత్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఫుట్‌పాత్‌లో నడుస్తున్న ఓ వ్యక్తి జారి కిందపడబోయాడు. ఎలాగో నిలదొక్కుకుని అక్కడి నుంచి పక్కకు వచ్చేశాడు. కొద్దిసేపటి తర్వాత రోడ్డుపై సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి సైకిల్‌తో సహా కిందపడిపోయాడు. కార్లు కూడా రోడ్లపై ముందుకు వెళ్లలేక ప్రమాదానికి గురయ్యాయి. కార్లు, సైకిళ్లు పెద్ద మొత్తంలో ప్రమాదానికి గురయ్యాయి. మనుషులు నడవలేని పరిస్థితిలో మోకాళ్లపై పాకుతున్నారు. మొత్తానికి ఆ రోడ్డు జారుడు బల్లలా మారిపోయి జనానికి చుక్కలు చూపించింది.
ఇక, వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘చిన్న పిల్లలను తీసుకొచ్చి ఆ రోడ్డులో విడిస్తే తెగ సంబరపడిపోతారు. జారుడు బల్లలాంటి ఆ రోడ్డులో ఆడుకుంటూ ఇంటికి కూడా పోరు’..‘మన ఇండియాలో ఇలాంటి పరిస్థితి ఉంటే ప్రాణాలు పోవటం ఖాయం’..‘ఈ వీడియోను చూస్తుంటే చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి’..‘ఈ జారుడు బల్ల మామూలుగా లేదుగా. చూసే వాళ్లకు సరదా.. నడిచే వాళ్లకు నరకం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి