Share News

1992 తర్వాత తొలిసారి.. జూలో ఆకుపచ్చ కాసోవరీ గుడ్డు

ABN , Publish Date - Oct 22 , 2026 | 09:29 AM

ఆస్ట్రేలియాలోని అడిలైడ్ జూలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఏకంగా 34 ఏళ్ల తర్వాత తొలిసారిగా కాసోవరీ పక్షి గుడ్డు పెట్టడంతో జూ సంరక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

1992 తర్వాత తొలిసారి.. జూలో ఆకుపచ్చ కాసోవరీ గుడ్డు
Adelaide Zoo

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాలోని అడిలైడ్ జూలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఏకంగా 34 ఏళ్ల తర్వాత తొలిసారిగా కాసోవరీ పక్షి గుడ్డు పెట్టడంతో జూ సంరక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్టినా అనే పదేళ్ల ఆడ దక్షిణ కాసోవరీ.. జెఫ్రీ అనే 13 ఏళ్ల మగ కాసోవరీతో జతకట్టిన తర్వాత ఈ అద్భుతం జరిగింది.

ఈ ఏడాది ఆగస్టులోనే ఈ రెండు పక్షులను తొలిసారిగా జతగా ఉంచారు. ఈ క్రమంలోనే.. నియాన్ ఆకుపచ్చ రంగులో ఉన్న గుడ్డు కనిపించడంతో సిబ్బంది సంబరపడ్డారు. 1992 తర్వాత ఈ జూలో కాసోవరీ గుడ్డు కనిపించడం ఇదే తొలిసారి కావడంతో ఈ ఘటన ప్రత్యేకతను సంతరించుకుంది. గుడ్డు ఆకర్షణీయమైన రంగులో ఉండటం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.


డైనోసార్ల బంధువు.. గుడ్డులో ప్రత్యేకత ఇదే..

కాసోవరీలు ఆస్ట్రేలియా, పరిసర ప్రాంతాల్లోని దట్టమైన వర్షారణ్యాల్లో నివసించే భారీ, ఎగరలేని పక్షులు. వీటిని డైనోసార్లకు దగ్గరి బంధువులుగా పరిగణిస్తారు. ఈ పక్షుల గుడ్లు ఆకుపచ్చ రంగులో ఉండటానికి బిలివర్డిన్ అనే సహజ వర్ణద్రవ్యం కారణం. అడవిలో నేలపై గూళ్లు నిర్మించుకునే కాసోవరీలకు ఈ రంగు పరిసరాల్లో కలిసిపోయేందుకు.. వేటాడే జంతువుల నుంచి గుడ్లను దాచేందుకు ఉపయోగపడుతుంది. అయితే.. కాసోవరీల సంతానోత్పత్తి అంత సులభం కాదు. సాధారణంగా ఒంటరిగా జీవించే ఈ పక్షులు సంతానోత్పత్తి కాలం మినహా ఇతర సమయాల్లో ఒకదానిపై మరొకటి దూకుడుగా ప్రవర్తించవచ్చు. అందుకే మార్టినా, జెఫ్రీలను కలిపే ముందు వాటి అరుపులు, ప్రవర్తన, కలిసి ఆహారం తీసుకునే తీరును జూ సంరక్షకులు జాగ్రత్తగా పరిశీలించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గుడ్డు పెట్టిన తర్వాత ఆడ కాసోవరీ బాధ్యతల నుంచి తప్పుకోగా, గుడ్డును పొదగడం, పిల్లలను పెంచడం వంటి పనులను మగ కాసోవరీ చూసుకుంటుంది. దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఈ గుడ్డు కనిపించడం జూలో కాసోవరీల సంతానోత్పత్తి కార్యక్రమానికి కీలక ముందడుగుగా నిలిచింది.

Updated Date - Oct 22 , 2026 | 09:35 AM