ఫోన్ వాడకం మితిమీరితే ఇంత ప్రమాదమా? శస్త్రచికిత్స చేయించుకున్న నటి!
ABN , Publish Date - Aug 13 , 2026 | 06:08 PM
ఫోన్‌ను గంటల తరబడి ఉపయోగించడం, ముఖ్యంగా తప్పు భంగిమలో చూడటం వల్ల మెడ, భుజాలు, వెన్ను భాగాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఓ నటి తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంటూ, అవసరానికి మించి ఫోన్ వాడకుండా స్క్రీన్ టైమ్‌ను నియంత్రించుకోవాలని సూచించారు.
ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్‌ఫోన్ మన రోజువారీ జీవితంలో ముఖ్యమైన భాగంగా మారిపోయింది. అయితే అవసరానికి మించి గంటల తరబడి ఫోన్ చూడటం, సరైన భంగిమలో కూర్చోకపోవడం లేదా పడుకుని ఫోన్ ఉపయోగించడం ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా దక్షిణాది నటి తన అనుభవాన్ని పంచుకున్నారు.
గంటల తరబడి ఫోన్ చూడటం
ఓ నటి తన యూట్యూబ్ వ్లాగ్‌లో ఫోన్ వాడకం వల్ల తాను ఎదుర్కొన్న మెడ సమస్య గురించి వివరించారు. తాను మంచంపై పక్కకు తిరిగి పడుకుని వరుసగా నాలుగు గంటల వరకు ఫోన్‌లో గేమ్స్ ఆడేదాన్నని చెప్పారు. మధ్యలో టీ లేదా కాఫీ తాగడానికి మాత్రమే లేచి, మళ్లీ ఫోన్ పట్టుకునేదాన్నని తెలిపారు. గేమ్స్‌తో పాటు గంటల తరబడి వీడియోలు, రీల్స్ చూస్తూ గడిపేదాన్నని ఆమె చెప్పారు. ఇలా ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండటం వల్ల క్రమంగా మెడలో తీవ్రమైన నొప్పి మొదలైందని వివరించారు.
మెడకు శస్త్రచికిత్స
సమస్య తీవ్రం కావడంతో చెన్నైలోని మెడ్‌వే ఆసుపత్రిలో ఆమె మెడకు శస్త్రచికిత్స జరిగినట్లు తెలిపారు. ఈ చికిత్స కోసం సుమారు రూ.3 లక్షలు ఖర్చయ్యాయని చెప్పారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకునే సమయంలో మెడకు సాఫ్ట్ సర్వైకల్ కాలర్ ధరించాలని వైద్యులు సూచించినట్లు ఆమె వెల్లడించారు. ఆపరేషన్ తర్వాత మంచం నుంచి లేవడం, భోజనం చేయడం వంటి సాధారణ పనులకు కూడా ఇతరుల సహాయం అవసరమైందని నటి తెలిపారు. తన మెడ సమస్యకు చికిత్సలో టైటానియం స్క్రూ ఉపయోగించినట్లు కూడా చెప్పారు.
ఫోన్ వాడకంపై తల్లిదండ్రులకు సూచన
తన అనుభవాన్ని వివరిస్తూ ఆ నటి నెటిజన్లకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు ఓ సూచన చేశారు. ఫోన్ ఉపయోగకరమైన పరికరమే అయినప్పటికీ, అవసరానికి మించి ఉపయోగించకూడదని అన్నారు. అనవసరమైన వీడియోలు, రీల్స్ చూస్తూ గంటల తరబడి ఫోన్‌లో గడపకుండా అవసరమైన విషయాలకే పరిమితం కావాలని సూచించారు. ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించాల్సి వస్తే మధ్య మధ్యలో విరామం తీసుకోవడం, సరైన భంగిమలో కూర్చోవడం కూడా ముఖ్యమేనని సూచించారు.
మెడకు శస్త్రచికిత్స చేయించుకున్న నటి షకీలా. 1990లలో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమెకు మలయాళ చిత్రాలతో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత తమిళం, తెలుగుతో పాటు పలు భాషల్లో సినిమాలు చేస్తూ మరింత పాపులర్ అయ్యారు.