Longest Living Birds: ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించిన టాప్ 5 పక్షులు ఇవే..
ABN, Publish Date - Jan 06 , 2026 | 04:18 PM
ప్రతి జీవికి కొంత జీవితకాలం ఉంటుంది. మనుషులు 100 సంవత్సరాలు జీవిస్తారని అంటారు. అలాగే జంతువులకు, పక్షులకు కూడా జీవితకాలం ఉంటుంది. ఇవాళ మనం పక్షుల జీవిత కాలానికి సంబంధించి ప్రత్యేక విషయాన్ని తెలుసుకోబోతున్నాం.
1/6
ప్రతి జీవికి కొంత జీవితకాలం ఉంటుంది. అలా.. ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించిన టాప్ 5 పక్షుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, యూఎస్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్ డేటా ఆధారంగా ఎక్కువ కాలం జీవించిన ఆ ఐదు పక్షులు ఇవే...
2/6
పింక్ కాకాటూ: చిలుకల జీవితకాలం చాలా ఎక్కువ అని చెబుతుంటారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. పింక్ కాకాటూ ఎక్కువ కాలం జీవించిన పక్షుల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉంది. బ్రూక్ ఫీల్డ్ జూలో నివసించిన మేజర్ మిచెల్స్ కాకాటూను 1934లో జూకు తీసుకువచ్చారు. ఇది 2016 వరకు జీవించి ఉంది. దీని ప్రకారం ఈ కాకాటూ 83 సంవత్సరాలు జీవించింది. ఎక్కువ సంవత్సరాలు జీవించిన ఈ కాకాటూ పేరును గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేశారు.
3/6
గ్రేటర్ ఫ్లెమింగో: ఇవి చాలా సున్నితంగా కనిపించినప్పటికీ.. ఎక్కువ కాలం జీవించిన పక్షుల్లో 2వ స్థానంలో నిలిచాయి. వాస్తవానికి వీటి జీవితకాలం 25 నుంచి 35 సంవత్సరాలు. కానీ, రికార్డుల ప్రకారం.. ‘గ్రేటర్’ అనే గ్రేటర్ ఫ్లెమింగో అత్యధిక కాలం జీవించిన పక్షుల్లో ఒకటిగా రికార్డులకెక్కింది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ జూలో దీనిని సంరక్షించారు. 1930లలో దీనిని జూకు తీసుకురాగా.. అది 2014 వరకు జీవించి ఉంది. ఇది కూడా దాదాపు 83 సంవత్సరాలు జీవించింది.
4/6
లేసన్ ఆల్బాట్రాస్: ఇవి ఎక్కువగా ఉత్తర పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలో ఉంటాయి. నివేదికల ప్రకారం.. వీటి జాతికి చెందిన విస్‌డమ్ ది ఆల్బాట్రాస్ పేరు గల పక్షి ఎక్కువ కాలం జీవించి ఉంది. యూఎస్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్ ప్రకారం.. ఆ పక్షి ఇంకా చురుకుగా ఉందని, మిడ్వే అటోల్‌కు తిరిగి వస్తోందని పేర్కొన్నారు.
5/6
ఆండియన్ కాండోర్: ఇది ప్రపంచంలోనే ఎగిరే పక్షులలో అతిపెద్దది. ఇది రాబందుల జాతికి చెందినది. ఇవి చాలా నెమ్మదిగా వృద్ధాప్యాన్ని పొందుతాయి. కనెక్టికట్‌లో బియర్డ్స్‌లి జూ అడవిలో జన్మించి పెరిగిన ఆండియన్ కాండోర్ జాతికి చెందిన థావో ఎక్కువకాలం జీవించిన పక్షులలో ఒకటిగా రికార్డులకెక్కింది. ఈ థావో 2010లో తన 79 సంవత్సరాల వయసులో చనిపోయింది.
6/6
కాకాపో: ఇది న్యూజిలాండ్‌కు చెందిన ఎగరలేని, రాత్రిపూట తిరిగే చిలుక. భూమిపై అత్యంత అరుదైన పక్షులలో ఇదొకటి. ఈ జాతికి చెందిన పక్షులు సగటున 60 ఏళ్లు జీవిస్తాయి. కొన్ని అంచనాల ప్రకారం ఇవి 90 నుంచి 100 సంవత్సరాల వరకు కూడా జీవించగలవట. రికార్డుల ప్రకారం.. ఇదే జాతికి చెందిన రిచర్డ్ హెన్రీ అనే కాకాపో 80 ఏళ్ల వయస్సులో చనిపోయింది.
Updated at - Jan 06 , 2026 | 05:31 PM