ప్రవాస భారతీయులకు వంశీ పురస్కారాలు
ABN , Publish Date - Mar 28 , 2026 | 06:26 PM
సాంస్కృతిక కళారంగ విభాగాలలో విభిన్న సేవలు అందిస్తున్నవారికి పరాభవ నామ సంవత్సర ఉగాదికి ‘వంశీ సీల్వెల్ ప్రవాస భారతీయ ఉగాది పురస్కారాల’ను ఆదివారం హైదరాబాద్ త్యాగరాయ గానసభలో అందజేశారు.
ఇంటర్నెట్ డెస్క్: వివిధ దేశాల్లోని తెలుగు సంస్థలకు చెందిన వారికి వంశీ ఆర్ట్ థియేటర్స్ ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారాలను అందిస్తోంది. ఇందులో భాగంగా సాంస్కృతిక కళారంగ విభాగాలలో విభిన్న సేవలు అందిస్తున్నవారికి పరాభవ నామ సంవత్సర ఉగాదికి ‘వంశీ సీల్వెల్ ప్రవాస భారతీయ ఉగాది పురస్కారాల’ను ఆదివారం హైదరాబాద్ త్యాగరాయ గానసభలో అందజేశారు.
ప్రముఖ సినీ నటులు డా. రాజేంద్ర ప్రసాద్, నటీమణులు సంగీత, మంజుభార్గవి, దర్శకులు రేలంగి నరసింహారావు, సినీకవి వనమాలి, ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు, వివిధ రంగాల కళాకారులను ఈ ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారాలతో వేదికపై సత్కరించారు.
ఇటువంటి వంశీ వేదికపై 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థ ప్రధాన కార్యనిర్వాహక వర్గ సభ్యురాలు, రచయిత్రి రాధిక మంగిపూడి ‘సభా భారతి’ బిరుదును అందుకున్నారని సింగపూర్ నుండి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ పేర్కొన్నారు. తమ సంస్థ సభ్యులైన యడవల్లి శేషు కుమారి శాస్త్రీయ సంగీతంలోనూ, తంగిరాల సౌభాగ్యలక్ష్మి లలిత సంగీత రంగంలోనూ, పావని చిలువేరు సాహిత్య రంగంలోను ఉగాది పురస్కారాలను అందుకోవడం తమకెంతో గర్వకారణమని తెలిపారు.

యూకే నుంచి డా. బాబురావు చౌదరి చాపరాల, భారతి దంపతులు, హాంకాంగ్ నుంచి జయ పీసపాటి, ఖతర్ నుండి సాహిత్య జ్యోత్స్న కొలిపాక, యూఏఈ నుంచి శ్రీకాంత్ చిత్తర్వు, శ్రీనివాస లింగం, సౌదీ అరేబియా నుంచి కొనేరు ఉమామహేశ్వరరావు, అనిల్ కుమార్ కడించెర్ల, అమెరికా నుంచి శ్రీనివాస్ గూడూరు, వాణి దిట్టకవి, జయరాం ఎర్రమిల్లి తదితరులు కూడా ఈ పురస్కారాలను అందుకున్నారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , డా.కేవీ రమణాచారి ఐఏయస్, హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం హెడ్ కామేశ్వరి, డా. వంశీ రామరాజు, ఇతర అతిథుల చేతుల మీదుగా ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.









ఈ వార్తలూ చదవండి:
తానా - పాఠశాల ఆధ్వర్యంలో ‘ప్రాగ్దిశ వీణియపై - మయూఖ తంత్రులమై’
హెచ్-1బీ వీసాదారుల కనీస వేతనాల పెంపు! యూఎస్ ప్రతిపాదనలు