హెచ్-1బీ వీసాదారుల కనీస వేతనాల పెంపు! యూఎస్ ప్రతిపాదనలు
ABN , Publish Date - Mar 27 , 2026 | 02:42 PM
హెచ్-1బీ వీసాదారుల వేతన విధానాన్ని సవరించేందుకు అక్కడి కార్మిక శాఖ రంగంలోకి దిగింది. వేతన సవరణకు సంబంధించి ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. వీటిపై ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలపాలని కోరింది.
ఇంటర్నెట్ డెస్క్: తమ పౌరులకే స్థానిక ఉద్యోగాలు దక్కాలన్న తలంపుతో ఉన్న అమెరికా ప్రభుత్వం మరో కీలక చర్యకు సిద్ధమైంది. హెచ్-1బీ వీసాదారుల కనీస వేతనాలను పెంచే కొత్త రూల్స్‌ను ప్రతిపాదించింది. వీసాదారుల వేతనాలు, పౌరులకు ఇచ్చే వేతనాల మధ్య అంతరాన్ని తగ్గించేలా ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ ముసాయిదా నిబంధనలపై అమెరికా కార్మిక శాఖ ప్రజాభిప్రాయాలను సేకరిస్తోంది. తమ అభిప్రాయాలకు తెలిపేందుకు జనాలకు 60 రోజుల గడువు విధించింది. ఆ తరువాత కొత్త రూల్స్‌ను ఖరారు చేస్తుంది.
అమెరికన్లను కాకుండా తక్కువ జీతాలకు హెచ్-1బీ వీసాదారులను కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయన్న వాదనల నడుమ కార్మిక శాఖ వీసాదారుల కనీస వేతనాల సవరణలను ప్రతిపాదించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగు అంచెల వేతన విధానం 20 ఏళ్లుగా కొనసాగుతోందని తెలిపింది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే వీసాదారుల కనీస వేతనం 10 వేల డాలర్ల మేర పెరిగే అవకాశం ఉంది.
ఈ ముసాయిదా నిబంధనల ప్రకారం ఆయా రంగాల్లో పౌరులకు ఇచ్చే శాలరీలను బట్టి కంపెనీలు మునుపటి కంటే అధిక శాలరీలను వీసాదారులకు చెల్లించాల్సి ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల మొదలు, లెవెల్-2 ఉద్యోగాలు, లెవెల్-3 ఉద్యోగాలు, లెవెల్-4 ఉద్యోగాల కనీస శాలరీలు పెరిగే ఛాన్సుంది. హెచ్-1బీ వీసాదారులతో పాటు హెచ్1బీ1, ఈ-3, పీఈఆర్‌ఎమ్ వీసాదారుల కనీస వేతనాల సవరణకు కార్మిక శాఖ ప్రతిపాదనలను విడుదల చేసింది. దేశంలోకి వలసలను నిరోధించేందుకు అమెరికా ఇప్పటికే వీసా నిబంధనలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజును పెంచింది. లాటరీ వ్యవస్థలోనూ మార్పులు చేసింది. స్టూడెంట్ వీసా నిబంధనలకు అనేక మార్పులు చేసింది. ఫలితంగా ఈసారి హెచ్-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య దాదాపు సగానికి పడిపోయే అవకాశం ఉందని అక్కడి ఇమిగ్రేషన్ వ్యవహారాల లాయర్లు చెబుతున్నారు.
ఈ వార్తలూ చదవండి:
ఈసారి హెచ్-1బీ దరఖాస్తులు సగానికి పడిపోయే ఛాన్స్
ఒమాన్‌లో శ్రీ రాజ రాజేశ్వరస్వామి కల్యాణోత్సవం