ఈసారి హెచ్-1బీ దరఖాస్తులు సగానికి పడిపోయే ఛాన్స్
ABN , Publish Date - Mar 23 , 2026 | 12:33 PM
హెచ్-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య ఈసారి 50 శాతం మేర పడిపోయే అవకాశం ఉందని ఇమిగ్రేషన్ సేవల నిపుణులు చెబుతున్నారు. అధిక వీసా ఫీజు, లాటరీ వ్యవస్థ విధానంపై అనిశ్చితి నేపథ్యంలో అనేక మంది వీసా దరఖాస్తు ప్రయత్నాలను విరమించుకున్నారని అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: గతేడాదితో పోలిస్తే ఈసారి హెచ్-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య 30-50 శాతం వరకూ తగ్గే అవకాశం ఉందని యూఎస్ ఇమిగ్రేషన్ రంగ నిపుణులు చెబుతున్నారు. అప్లికేషన్ ఫీజులు అధికం కావడం, వీసా లాటరీ వ్యవస్థలో మార్పులపై స్పష్టత లేకపోవడంతో అనేక మంది వెనక్కుతగ్గినట్టు చెబుతున్నారు. హెచ్-1బీ దరఖాస్తుల తుది గడువు ఈ నెల 19న ముగిసిన విషయం తెలిసిందే.
ఐటీ సర్వీసెస్ కంపెనీలపై వీసా మార్పులు అధిక ప్రభావం చూపించాయని ఇమిగ్రేషన్ సేవల సంస్థలు చెబుతున్నాయి. అధిక శాలరీలకు అవకాశం ఉండే ఉన్నతవిద్యావంతులకే ప్రస్తుత వ్యవస్థ అనుకూలంగా ఉందని అభిప్రాయపడ్డాయి. ప్రతిభావంతుల కోసం అధిక శాలరీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న చిన్న, మధ్య స్థాయి కంపెనీల నుంచి ఈసారి దరఖాస్తులు పెరిగాయని ఇమిగ్రేషన్ సేవా సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ కంపెనీలకు బడా ఐటీ కార్పొరేట్ సంస్థల నుంచి పోటీ కూడా తక్కువగా ఉందని చెప్పారు.
అమెరికా పౌరసత్వ, వలసల సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) 2027 సంవత్సరానికి గాను ఇటీవల హెచ్-1బీ దరఖాస్తులను ఆహ్వానించింది. మార్చ్ 4-19 మధ్య అప్లికేషన్స్ సమర్పించాలని గడువు విధించింది. అయితే, ఈసారి ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే వివరాలు ఇంకా విడుదల కాలేదు. గతేడాది మొత్తం 336,153 దరఖాస్తులు అందాయి. ఇలా వచ్చిన దరఖాస్తుల నుంచి లాటరీ ద్వారా ఏటా 85 వేల మంది వీసాలకు ఎంపిక అవుతారు. హెచ్-1బీ వీసా పిటిషన్ ఫీజును ట్రంప్ లక్ష డాలర్లకు ఖరారు చేయడంతో దరఖాస్తుల సంఖ్య తగ్గిందని ఇమిగ్రేషన్ వ్యవహారాల లాయర్లు చెబుతున్నారు. తాజా మార్పుల నేపథ్యంలో మాస్టర్స్ డిగ్రీలు ఉన్న వారికి వీసా వచ్చే అవకాశాలు అధికమయ్యాయని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
అమెరికా వ్యాప్తంగా మోసాలు! భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ గాలింపు