అమెరికా వ్యాప్తంగా మోసాలు! భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ గాలింపు
ABN , Publish Date - Mar 19 , 2026 | 10:00 AM
అమెరికాలో పలువురు అమాయకులను మోసగించి డబ్బులు దండుకున్న ఒక భారతీయ వ్యక్తి కోసం ఎఫ్‌బీఐ ముమ్మర గాలింపు చర్యలు చేపడుతోంది. అతడి వివరాలు తెలిస్తే తమకు చెప్పాలని ప్రజలను బుధవారం కోరింది.
ఇంటర్నెట్ డెస్క్: యూఎస్‌లో పలువురిని క్రిమినల్ కేసుల పేరిట బెదిరించి డబ్బులు దండుకున్న ఒక భారతీయ వ్యక్తి కోసం అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ గాలింపు చర్యలు చేపడుతోంది. నిందితుడి వివరాలు తెలిస్తే తమకు సమాచారం అందించాలని బుధవారం కోరింది.
నిందితుడు కల్పేష్ కుమార్ రసిక్‌భాయ్ పటేల్ (35) యూఎస్‌లో పలు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడ్డాడని ఎఫ్‌బీఐ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అతడు పెట్రోల్ పంప్‌లో సహాయకుడిగా పనిచేసేవాడని పేర్కొంది. ఎఫ్‌బీఐ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు అమాయకులను ఫోన్‌లో బెదిరించి డబ్బులు దండుకునేవాడు. కొన్ని క్రిమినల్ కార్యకలాపాల్లో బాధితుల వ్యక్తిగత వివరాలు తెరపైకి వచ్చాయంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడేవాడు. బాధితుల నుంచి ప్రీపెయిడ్ డెబిట్ కార్డులు, నగదు రూపంలో డబ్బును అమెరికా వ్యాప్తంగా ఉన్న వివిధ అడ్రస్‌లకు తెప్పించుకునేవాడు.
2017-2021 మధ్య కాలంలో పలు రాష్ట్రాల్లో నిందితుడు ఇలాంటి మోసాలకు పాల్పడ్డాడని ఎఫ్‌బీఐ తెలిపింది. మెయిల్, వైర్ ఫ్రాడ్ కేసుల్లో నిందితుడిపై 2023లో అరెస్టు వారెంట్ జారీ అయ్యిందని పేర్కొంది. పరారీలో ఉన్న పటేల్ వివరాలు తెలిసిన వారు తమకు సమాచారం అందించాలని కోరింది. పటేల్ ప్రస్తుతం ఇల్లినాయ్ లేదా పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఉంటుండవచ్చని ఎఫ్‌బీఐ అధికారులు అనుమానిస్తున్నారు. అతడి వివరాలు తెలిసిన వారు సమీపంలోని ఎఫ్‌బీఐ కార్యాలయాన్ని కానీ లేదా అమెరికన్ ఎంబసీని కానీ సంప్రదించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
అత్యంత ఘనంగా తానా మిడ్-అట్లాంటిక్ చదరంగ టోర్నమెంట్ 2026
జియో కీలక ప్రకటన.. రోమింగ్ ప్యాక్ లేకున్నా ఓటీపీలు